ప్రవక్తలు మరియు రాజులు  (BSI)

1 భాగము

1 సమూయేలు 8

ఇశ్రాయేలు ఒక రాజును కోరుకొనుట

1. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయులమీద న్యాయాధిపతులుగా నియమించెను.౹ 

2. అతని జ్యేష్ఠకుమారుని పేరు యోవేలు; రెండవవాని పేరు అబీయా,౹ 

3. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా

 4. ఇశ్రాయేలీయుల పెద్దలందరు కూడి రామాలో సమూయేలునొద్దకు వచ్చి

 5. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తనవంటి ప్రవర్తన గలవారు కారు గనుక, సకలజనుల మర్యాదచొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి.౹

 6. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థనచేసెను.౹

7. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా–జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించియున్నారు.౹ 

8. వారు నన్ను విసర్జించి, యితర దేవతలను పూజించి, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించిన నాటి నుండి నేటివరకు తాము చేయుచువచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారు; వారు చెప్పిన మాటలను అంగీకరించుము.౹ 

9. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము.

ఒక రాజు గురించి హెచ్చరిక

10. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్ని వినిపించి

11. ఈలాగున చెప్పెను–మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా, అతడు మీ కుమారులను పట్టుకొని, తన రథములను తోలుటకును తన గుఱ్ఱములను కాపాడుటకును వారిని ఉంచుకొనును, కొందరు అతని రథముల ముందర పరుగెత్తుదురు.౹

12. మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును; తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధా యుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును.౹

13. మీ కుమార్తెలను భక్ష్యకా రిణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారినిగాను పెట్టుకొనును.౹ 

14. మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలీవతోటలలోను శ్రేష్ఠమైనవాటిని తీసికొని తన సేవకులకిచ్చును.౹ 

15. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను పదియవభాగము తీసి తన పరివారజనమునకును సేవకులకును ఇచ్చును.౹ 

16. మీ దాసులను మీ పని కత్తెలను మీ పశువులలోను గార్దభములలోను శ్రేష్ఠమైన వాటిని పట్టుకొని తన పనికొరకు ఉంచుకొనును.౹

17. మీ మందలో పదియవభాగము పట్టుకొనును, మీమట్టుకు మీరు అతనికి దాసులవుదురు.౹ 

18. ఆ దినమున మీరు కోరు కొనిన రాజునుబట్టి మీరు మొఱ్ఱపెట్టినను యెహోవా మీ మొఱ్ఱవినక పోవును అనెను.౹

19. అయినను జనులు సమూయేలుయొక్క మాట చెవిని బెట్టనొల్లక–ఆలాగున కాదు,౹ 

20. జనములు చేయురీతిని మేమును చేయునట్లు మాకు రాజుకావలెను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించుననిరి.౹ 

21. సమూయేలు జనులయొక్క మాట లన్నిటిని విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను 

22. గనుక యెహోవా–నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవియ్యగా సమూయేలు–మీరందరు మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చెను.

1 సమూయేలు 9

15. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను.౹

 16. ఎట్లనగా–నా జనుల మొఱ్ఱ నాయొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించియున్నాను; కాగా ఫిలిష్తీయుల చేతిలోనుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయులమీద వానిని అధికారినిగా అభిషేకించుటకుగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములోనుండి ఒక మనుష్యుని నీయొద్దకు రప్పించుదును.౹ 

17. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా–ఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను.౹ 

18. సౌలు గవినియందు సమూయేలును కలిసికొని–దీర్ఘదర్శి యిల్లు ఏది? దయచేసి నాతో చెప్పుమని అడుగగా

19. సమూయేలు సౌలుతో–నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకుముందు వెళ్లుడి, నేడు మీరు నాతోకూడ భోజనము చేయవలెను, రేపు నీ మనస్సులో నున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్లనిచ్చెదను.౹ 

20. మూడుదినముల క్రిందట తప్పిపోయిన నీ గార్దభములనుగూర్చి విచారపడకుము, అవి దొరికినవి. ఇశ్రాయేలీయుల అభీష్టము ఎవరియందున్నది? నీయందును నీ తండ్రి యింటి వారియందును గదా అనెను.౹

21. అందుకు సౌలు–నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనదికాదా? నా యింటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు? అనెను.౹ 

22. అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు సాలలోనికి తోడుకొనిపోయి, పిలువబడిన దాదాపు ముప్పదిమందిలో ప్రధానస్థలమందు వారిని కూర్చుండబెట్టి

23. పచనకర్తతో–నేను నీ దగ్గరనుంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసికొని రమ్మనగా 

24. పచనకర్త జబ్బను దాని మీద నున్నదానిని తీసికొనివచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెను–చూడుము, మనము కలిసికొను కాలమునకై దాచియుంచబడిన దానిని నీకు పెట్టియున్నాడు, జనులను పిలిచితినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీకొరకుంచవలసినదని చెప్పితిని. ఆ దినమున సౌలు సమూయేలుతోకూడ భోజనముచేసెను,౹

25. పట్టణస్థులు ఉన్నతమైన స్థలముమీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దెమీద మాటలాడు చుండెను.౹

26. మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలు–మిద్దెమీదనున్న సౌలును పిలిచి నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తరువాత వారిద్దరు బయలుదేరి 

27. ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో–మనకంటె ముందుగా వెళ్లుమని యీ పనివానితో చెప్పుము; దేవుడు సెలవిచ్చి నది నేను నీకు తెలియజెప్పువరకు నీవు ఇక్కడ నిలిచి యుండుమనెను; అంతట వాడు వెళ్లెను.

1 సమూయేలు 10

ప్రవక్తలలో సౌలు

1. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తలమీద తైలముపోసి అతని ముద్దు పెట్టుకొని– యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యముమీద అధిపతిగా నియమించియున్నాడు అని చెప్పి యీలాగు సెలవిచ్చెను

 2. ఈ దినమున నీవు నా యొద్దనుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులోనుండు రాహేలు సమాధిదగ్గర ఇద్దరు మనుష్యులు నీకు కనబడుదురు. వారు–నీవు వెదకబోయిన గార్దభములు దొరికినవి, నీ తండ్రి తన గార్దభములకొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీకొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు.౹

 3. తరువాత నీవు అక్కడనుండి వెళ్లి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవునియొద్దకు పోవు ముగ్గురు మనుష్యులు నీకు ఎదురుపడుదురు; ఒకడు మూడు మేకపిల్లలను, ఒకడు మూడు రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయుచు వత్తురు.౹

 4. వారు నిన్ను కుశలప్రశ్నలడిగి నీకు రెండు రొట్టెలు ఇత్తురు. అవి వారిచేత నీవు తీసి కొనవలెను.౹ 

5. ఈలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు, అచ్చట ఊరిదగ్గరకు నీవు రాగానే, స్వరమండలము తంబుర సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలమునుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు ప్రకటనచేయుచు వత్తురు;౹ 

6. యెహోవా ఆత్మ నీమీదికి బలముగా దిగివచ్చును; నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సువచ్చును.౹ 

7. దేవుడు నీకు తోడుగానుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచినదాని చేయుము.౹ 

8. నాకంటె ముందు నీవు గిల్గాలునకు వెళ్లగా, దహనబలులను బలులను సమాధానబలులను అర్పించుటకై నేను నీయొద్దకు దిగి వత్తును; నేను నీయొద్దకు వచ్చి నీవు చేయవలసినదానిని నీకు తెలియజేయువరకు ఏడు దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను.౹

9. అతడు సమూయేలునొద్దనుండి వెళ్లిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను.

10. వారు ఆ కొండదగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారిమధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను.౹ 

11. పూర్వము అతని నెరిగినవారందరు అతడు ప్రవక్తలతోకూడనుండి ప్రకటించుట చూచి– కీషు కుమారునికి సంభవించిన దేమిటి? సౌలును ప్రవక్తలలో నున్నాడా? అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా 

12. ఆ స్థల మందుండు ఒకడు–వారి తండ్రి యెవడని యడిగెను. అందుకు సౌలును ప్రవక్తలలో నున్నాడా? అను సామెత పుట్టెను.౹

13. అంతట అతడు ప్రకటించుట చాలించి ఉన్నతస్థలమునకు వచ్చెను.

14. సౌలుయొక్క పినతండ్రి అతనిని అతని పనివానిని చూచి–మీరిద్దరు ఎక్కడికి పోతిరని అడుగగా అతడు –గార్దభములను వెదకబోతిమి; అవి కనబడక పోగా సమూయేలునొద్దకు పోతిమని చెప్పినప్పుడు 

15. సౌలు పిన తండ్రి–సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా 

16. సౌలు–గార్దభములు దొరికినవని అతడు చెప్పెనని తన పినతండ్రితో అనెనుగాని రాజ్యమునుగూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలు పలేదు.

సౌలు బహిరంగంగా రాజుగ ఎన్నుకొనబడెను

17. తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను

 18. ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు–నేను ఇశ్రాయేలీయులైన మిమ్మును ఐగుప్తుదేశములోనుండి రప్పించి ఐగుప్తీయుల వశములోనుండియు, మిమ్మును బాధపెట్టిన జనములన్నిటి వశములోనుండియు విడిపించితిని.౹ 

19. అయినను మీ దుర్దశలన్నిటిని ఉపద్రవములన్నిటిని పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి–మామీద ఒకని రాజుగా నియమింపుమని ఆయనను అడిగియున్నారు. కాబట్టి యిప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావ లెను.౹ 

20. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిని సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను.౹ 

21. బెన్యామీను గోత్రమును వారి యింటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మథ్రీ యింటి కూటము ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతని వెదకినప్పుడు అతడు కనబడలేదు.౹

 22. కావునవారు–ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసియున్నదా అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా–ఇదిగో అతడు సామానులో దాగియున్నాడని సెలవిచ్చెను.౹

 23. వారు పరుగెత్తిపోయి అక్కడనుండి అతని తోడుకొనివచ్చిరి; అతడు జనసమూహములో నిలిచి నప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటె ఎత్తుగలవాడుగా కనబడెను.౹

24. అప్పుడు సమూయేలు–జనులందరిలో యెహోవా ఏర్పరచినవానిని మీరు చూచి తిరా? జనులందరిలో అతనివంటివాడొకడును లేడని చెప్పగా, జనులందరు బొబ్బలు పెట్టుచు–రాజు చిరంజీవి యగుగాక అని కేకలువేసిరి.

25. తరువాత సమూయేలు రాజ్యపాలనపద్ధతిని జనులకు వినిపించి, ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతట సమూయేలు జనులందరిని వారి వారి ఇండ్లకు పంపివేసెను.౹

26. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్లిపోయెను. దేవునిచేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్లిరి.

27. పనికిమాలినవారు కొందరు–ఈ మనుష్యుడు మనలను ఏలాగు రక్షింపగల డని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసికొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను.

1 సమూయేలు 11

సౌలు అమ్మోనీయులను ఓడించాడు

1. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదు కెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరు–మేము నీకు సేవచేయుదుము, మాతో నిబంధనచేయుమని నాహాషుతో అనిరి.౹

2. ఇశ్రాయేలీయులందరి మీదికి నింద తెచ్చునట్లు మీయందరి కుడికన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసెదనని అమ్మోనీయుడైన నాహాషు

3. యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారు–మేము ఇశ్రాయేలీయుల సరిహద్దు లన్నిటికి దూతలను పంపుటకై యేడు దినముల గడువు మాకిమ్ము; మమ్మును రక్షించుటకు ఎవరును లేక పోయినయెడల మమ్మును మేము నీకప్పగించుకొనెదమనిరి.౹

4. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరు బిగ్గరగా ఏడ్చిరి.౹ 

5. సౌలు పొలమునుండి పశువులను తోలుకొని వచ్చుచు– జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా వారు యాబేషువారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి.౹ 

6. సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతనిమీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై

7. ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశము లోని నలుదిక్కులకు దూతలచేత వాటిని పంపి–సౌలుతోను సమూయేలుతోను చేరకుండువాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనులమీదికి వచ్చెను గనుక యొకడైనను నిలువకుండ వారందరు వచ్చిరి.౹

8. అతడు బెజెకులో వారిని లెక్కపెట్టగా ఇశ్రాయేలువారు మూడు లక్షలమందియు యూదావారు ముప్పదివేలమందియు అయిరి.౹ 

9. అప్పుడు–రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేసెను. దూతలు పోయి యాబేషువారికి ఆ వర్తమానము తెలుపగా వారు సంతోషపడిరి.౹ 

10. కాబట్టి యాబేషువారు నాహాషుయొక్క దూతలతో ఇట్లనిరి–రేపు మేము బయలుదేరి మమ్మును అప్పగించుకొందుము, అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును.౹

11. మరునాడు సౌలు జనులను మూడు సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండుమధ్యను జొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీయులను హతముచేయగా వారిలో మిగిలినవారు ఇద్దరేసికూడి పోజాలకుండ చెదరి పోయిరి.౹ 

12. జనులు–సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి? మేము వారిని చంపునట్లు ఆ మనుష్యులను తెప్పించుడని సమూయేలుతో అనగా 

13. సౌలు–నేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసెను గనుక ఈ దినమున ఏ మనుష్యుని మీరు చంపవద్దనెను.

14. మనము గిల్గాలునకు వెళ్లి రాజ్యపరిపాలన పద్ధతిని మరల స్థాపించుకొందము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా 

15. జనులందరు గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధానబలులను అర్పించి, యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీయులందరును అక్కడ బహుగా సంతోషించిరి.

1 సమూయేలు 12

రాజు ధృవీకరించాడు

12. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజైయున్నను–ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి.౹ 

13. కాబట్టి మీరు కోరి యేర్పరచుకొనిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీమీద రాజుగా నిర్ణయించియున్నాడు.౹

14. మీరు యెహోవాయందు భయభక్తులుకలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగముచేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించినయెడల మీకు క్షేమము కలుగును

15. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసినయెడల యెహోవా హస్తము మీపితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును.౹ 

16. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి.౹

 17. గోధుమ కోతకాలము ఇదే గదా? మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలిసికొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను.౹ 

18. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరు యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి 

19. సమూయేలుతో ఇట్లనిరి–రాజును నియమించుమని మేము అడుగుటచేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండ నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము.౹ 

20. అంతట సమూయేలు జనులతో ఇట్లనెను– భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి.౹

21. ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జించువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అను సరించుదురు. నిజముగా అవి మాయయే.౹

22. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగి యున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.౹

23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును.౹ 

24. ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము.౹

25. మీరు కీడుచేయువారైతే తప్పకుండ మీరును మీ రాజును నాశనమగుదురు.

ఫిలిష్తీయులతో యుద్ధం

1 సమూయేలు 13

1. సౌలు ముప్పది ఏండ్లవాడై యేలనారంభించెను. అతడు రెండు సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను

5. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయుటకై ముప్పదివేల రథములను ఆరువేల గుఱ్ఱపు రౌతులను సముద్రపుదరినుండు ఇసుకరేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగిరి.౹

6. ఇశ్రాయేలీయులు దిగులుపడుచు వచ్చి తాము ఇరుకులో నున్నట్టు తెలిసికొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నతస్థలములలోను కూపములలోను దాగిరి.౹

7. కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్లి పోయిరిగాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను; జనులందరు భయపడుచు అతని వెంబడించిరి.

8. సమూయేలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి, సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తన యొద్దనుండి చెదరిపోవుటయు చూచి 

9. దహనబలులను సమాధానబలులను నా యొద్దకు తీసికొని రమ్మని చెప్పి దహనబలి అర్పించెను.౹

10. అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలిసి కొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా

11. సమూయేలు అతనితో–నీవు చేసిన పని యేమని యడిగెను. అందుకు సౌలు–జనులు నాయొద్దనుండి చెదరిపోవుటయు, నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి 

12. ఇంకను యెహోవాను శాంతిపరచకమునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నామీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించితిననెను.౹ 

13. అందుకు సమూయేలు ఇట్లనెను–నీ దేవుడైన యెహోవా నీ కిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి; నీ రాజ్యమును ఇశ్రాయేలీయులమీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి యుండెను; అయితే నీ రాజ్యము నిలు వదు.౹ 

14. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సుగల యొకని కనుగొనియున్నాడు. నీకు ఆజ్ఞాపించినదాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనులమీద అతనిని అధిపతినిగా నియమించును.

1 సమూయేలు 14

నిరంతర పోరాటం

47. ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారము నొందినవాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీయులతోను అమ్మోనీయులతోను ఎదోమీ యులతోను సోబాదేశపు రాజులతోను ఫిలిష్తీయులతోను యుద్ధము చేసెను. ఎవరిమీదికి అతడు పోయెనో వారినందరిని ఓడించెను.౹ 

48మరియు అతడు దండునుకూర్చి అమాలేకీయులను హతముచేసి ఇశ్రాయేలీయులను కొల్ల సొమ్ముగా పెట్టినవారి చేతిలోనుండి వారిని విడిపించెను.

49. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా, యోనాతాను ఇష్వీ మెల్కీషూవ; అతని యిద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదానిపేరు మేరబు చిన్న దానిపేరు మీకాలు.౹ 

50. సౌలుయొక్క భార్యకు అహీనోయమని పేరు, ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు, ఇతడు సౌలునకు పిన తండ్రియైన నేరు కుమారుడు.౹ 

51. సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రియగు నేరును అబీయేలు కుమారులు.

52. సౌలు బ్రదికిన దినములన్నియు ఫిలిష్తీయులతో ఘోర యుద్ధము జరుగగా తాను చూచిన బలాఢ్యుల నందరిని పరాక్రమశాలులనందరిని తనయొద్దకు చేర్చుకొనెను.

1 సమూయేలు 15

సౌలు యొక్క అవిధేయత

1. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలీయులగు తన జనులమీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను; యెహోవా మాట వినుము.౹ 

2. సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా–అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే, వారు ఐగుప్తులోనుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారిమీదికి వచ్చిరి గదా.౹ 

3. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలే కీయులను హతముచేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱెలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పెను.

{ సంఖ్యాకాండము 24:20 మరియు అతడు అమాలేకీయులవైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను –అమాలేకు అన్యజనములకు మొదలు  వాని అంతము నిత్యనాశనమే.

21. మరియు అతడు కేనీయులవైపు చూచి ఉపమానరీతిగా ఇట్లనెను –నీ నివాసస్థలము దుర్గమమైనది నీ గూడు కొండమీద కట్టబడియున్నది.

నిర్గమకాండము 17: 8. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా

 9. మోషే యెహోషువతో–మనకొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసికొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధముచేయుము; రేపు నేను దేవుని కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలిచెదననెను.౹ 

10. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను; మోషే అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖర మెక్కిరి

11. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి; మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి,౹

12. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసికొని వచ్చి అతడు దానిమీద కూర్చుండుటకై దానివేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతనిచేతులను ఆదుకొనగా అతనిచేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండెను.౹

13. అట్లు యెహోషువ కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను.౹ 

14. అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను–నేను అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంధములో దీని వ్రాసి యెహోషువకు విని పించుము.౹ 

15. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరుపెట్టి

 16. అమాలేకీయులు తమచేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములవరకు యుద్ధమనెను.

ద్వితీయోపదేశకాండము 25:17. మీరు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసినదానిని జ్ఞాపకము చేసికొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీ కెదురుగా వచ్చి

18. నీవు ప్రయాసవడి అలసియున్నప్పుడు నీవారిలో నీ వెనుక నున్న బలహీనులనందరిని హతముచేసెను.౹

19. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపెట్లనున్న నీ సమస్త శత్రువులనులేకుండచేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మరచిపోవద్దు.

ద్వితీయోపదేశకాండము 23:3 అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు.౹

4. ఏలయనగా మీరు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసికొని మిమ్మును ఎదుర్కొనరాక, నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెతోరులోనుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి.౹

5. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విన నొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను.౹ 

6. నీ దినములన్నిట ఎన్నడును వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు.

అమ్మోను మరియు మోయాబు యొక్క వంశావళి.

ఆదికాండము 12:36. ఆలాగున లోతుయొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి.౹ 

37. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటివరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.౹ 

38. చిన్నది కూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటివరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.}

1 సమూయేలు 15: 4 అంతట సౌలు జనులను పోగుచేసి తెలాయీములో వారిని లెక్కపెట్టగా, కాలుబలము రెండు లక్షలమందియు యూదావారు పదివేలమందియు నుండిరి.౹ 

5. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో నొకదానికి వచ్చి లోయలో పొంచియుండి

6. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనుక అమాలేకీయులతోకూడ నేను మిమ్మును నాశనము చేయకుండునట్లు మీరు వారిలోనుండి బయలుదేరి పోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీయులలోనుండి వెళ్లిపోయిరి.౹ 

7. తరువాత సౌలు అమాలేకీయులను హవీలానుండి ఐగుప్తుదేశపు మార్గముననున్న షూరువరకు తరిమి హతముచేసి

సౌలు యొక్క తిరుగుబాటు

8. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులనందరిని కత్తిచేత నిర్మూలము చేసెను

9. సౌలును జనులును కూడి అగగును, గొఱ్ఱెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొఱ్ఱెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి, పనికిరాని నీచపశువులన్నిటిని నిర్మూలముచేసిరి.

సమూయేలు సౌలును మందలించుట

10. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

11. సౌలు నన్ను అనుస రింపక వెనుకతీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంత యెహోవాకు మొఱ్ఱపెట్టుచుండెను.౹

12. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకువచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయెనన్న సమాచారము వినెను.౹

13. తరువాత అతడు సౌలు నొద్దకురాగా సౌలు–యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా

14. సమూయేలు–ఆలాగైతే నాకు వినబడుచున్న గొఱ్ఱెల అరుపులును ఎడ్ల రంకెలును ఎక్కడివి? అని అడిగెను.౹

15. అందుకు సౌలు–అమాలేకీయుల యొద్దనుండి జనులు వీటిని తీసికొనివచ్చిరి; నీ దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకు జనులు గొఱ్ఱెలలోను ఎడ్లలోను మంచివాటిని ఉండనిచ్చిరి; మిగిలినవాటినన్నిటిని మేము నిర్మూలముచేసితిమనగా

16. సమూయేలు–నీవు మాటలాడ పనిలేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా, సౌలు–చెప్పుమనెను.౹ 

17. అందుకు సమూయేలు– నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకించెను.౹

18. మరియు యెహోవా నిన్ను సాగనంపి–నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగువరకు వారితో యుద్ధము చేయుమని సెలవియ్యగా 

19. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడుమీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను.౹ 

20. అందుకు సౌలు–ఆ మాట అనవద్దు; నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసికొనివచ్చితిని కాని అమాలేకీయులను నిర్మూలము చేసితిని.౹

21. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొఱ్ఱెలలోను ఎడ్లలోను ముఖ్యమైనవాటిని తీసికొనివచ్చిరని సమూయేలుతో చెప్పెను.౹

22. అందుకు సమూయేలు–తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.౹ 

23. తిరుగుబాటు చేయుట సోదెచెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను విసర్జించెననగా 

24. సౌలు–జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని.౹

25. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతోకూడ తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను.౹ 

26. అందుకు సమూయేలు–నీతోకూడ నేను తిరిగి రాను; నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ యెహోవా నిన్ను విసర్జించెనని చెప్పి 

27. వెళ్లిపోవలెనని తిరుగగా, సౌలు అతని దుప్పటిచెంగు పట్టుకొనినందున అది చినిగెను.౹

28. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను–నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలోనుండి లాగివేసి నీకంటె ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించియున్నాడు.

29. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైనవాడు నరుడుకాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు.౹ 

30. అందుకు సౌలు–నేను పాపము చేసితిని, అయినను నా జనుల పెద్దలయెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నన్ను ఘనపరచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతోకూడ తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున

31. సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్లెను. సౌలు యెహోవాకు మ్రొక్కిన తరువాత 

32. సమూయేలు–అమాలేకీయులరాజైన అగగును నా దగ్గరకు తీసికొనిరండనిచెప్పెను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి–మరణశ్రమ నాకు గడచిపోయెనే అని చెప్పగా 

33. సమూయేలు–నీ కత్తి స్త్రీలకు సంతులేకుండ చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతులేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను.

34. అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయెను, సౌలును సౌలు గిబియాలోని తన యింటికి వెళ్లెను.౹ 

35. సౌలు బ్రదికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్లలేదుగాని సౌలునుగూర్చి దుఃఖాక్రాంతు డాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయులమీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను

1 సమూయేలు 16

సమూయేలు బేత్లెహేము వెళ్తాడు

1. అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను – ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలునుగూర్చి నీ వెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును.౹

2. సమూయేలు–నేనెట్లు వెళ్లుదును? నేను వెళ్లిన సంగతి సౌలు వినినయెడల అతడు నన్ను చంపుననగా యెహోవా –నీవు ఒక పెయ్యను తీసికొనిపోయి యెహోవాకు బలిపశువును వధించుటకై వచ్చితినని చెప్పి

3. యెష్షయిని బల్యర్పణమునకు పిలువుము; అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును; ఎవనిపేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవియ్యగా

4. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవుచొప్పున బేత్లెహేమునకు వెళ్లెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి–సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా

5. అతడు–సమాధానముగానే వచ్చితిని; మీరు శుద్ధులై నాతోకూడ బలికి రండని చెప్పి, యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను.౹

6. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి–నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన యెదుట నిలిచియున్నాడని అనుకొనెను 

7. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను–అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసి యున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.౹

 8. యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు–యెహోవా ఇతని కోరుకొన లేదనెను.౹

 9. అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడు –యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను.౹ 

10. యెష్షయి తన యేడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు–యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి 

11. నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడు–ఇంకను కడసారివాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు–నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చువరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా

దావీదు అభిషేకం

 12. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొనివచ్చెను. అతడు ఎఱ్ఱనివాడును చక్కని నేత్రములుగలవాడును చూచుటకు సుందరమైనవాడునై యుండెను. అతడు రాగానే–నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా

13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను.

14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్దనుండి దురాత్మయొకటి వచ్చి అతని వెరపింపగా 

15. సౌలు సేవకులు–దేవునియొద్దనుండి వచ్చిన దురాత్మయొకటి నిన్ను వెరపించియున్నది;౹ 

16. మా యేలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొకని విచారించుటకై మాకు సెలవిమ్ము దేవుని యొద్దనుండి దురాత్మ వచ్చి నిన్ను పెట్టినప్పుడెల్ల అతడు సితారా చేతపట్టుకొని వాయించుటచేత నీవు బాగుపడుదువని అతనితో ననిరి 

17. సౌలు–బాగుగా వాయింపగల యొకని విచారించి నా యొద్దకు తీసికొని రండని తన సేవకులకు సెలవియ్యగా వారిలో ఒకడు

 18. చిత్తగించుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా నున్నాడనగా 

19. సౌలు–యెష్షయియొద్దకు దూతలను పంపి, గొఱ్ఱెలయొద్దనున్న నీ కుమారుడైన దావీదును నాయొద్దకు పంపుమనెను.౹ 

20. అప్పుడు యెష్షయి ఒక గార్దభముమీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదుచేత సౌలునొద్దకు పంపెను.౹

21. దావీదు సౌలు దగ్గరకువచ్చి అతనియెదుట నిలువబడగా అతనియందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను.౹ 

22. అంతట సౌలు–దావీదు నా అనుగ్రహము పొందెను గనుక అతడు నా సముఖమందు సేవచేయుటకు ఒప్పుకొనుమని యెష్ష యికి వర్తమానము పంపెను.౹ 

23. దేవునియొద్దనుండి దురాత్మ వచ్చి సౌలును పెట్టినప్పుడెల్ల దావీదు సితారా చేతపట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను.

సౌలు మరియు ఆత్మ మాధ్యమం

1 సమూయేలు 28

1. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా, ఆకీషు దావీదును పిలిచి–నేను దండెత్తగా నీవును నీ జనులును నాతోకూడ యుద్ధమునకు బయలుదేరి రావలెనని పరిష్కారముగా తెలిసికొనుమనగా 

2. దావీదు–నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలిసికొందువనెను. అందుకు ఆకీషు–ఆలాగైతే నిన్ను ఎప్పటికి నాకు సంరక్షకుడుగా నిర్ణయింతుననెను.

3. సమూయేలు మృతిబొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టియుండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని దేశములోనుండి వెళ్లగొట్టి యుండెను.౹ 

4. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా, సౌలు ఇశ్రాయేలీయులందరిని సమకూర్చెను; వారు గిల్బోవలో దిగిరి.౹ 

5. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది 

6. యెహోవా యొద్ద విచారణచేయగా యెహోవా స్వప్నముద్వారానైనను ఊరీముద్వారానైనను ప్రవక్తలద్వారానైనను ఏమియు సెలవియ్యకుండెను.

7. అప్పుడు సౌలు–నా కొరకు మీరు కర్ణపిశాచముగల యొక స్త్రీని కనుగొనుడి; నేను పోయి దానిచేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు–చిత్తము, ఏన్దోరులో కర్ణపిశాచము గల యొకతె యున్నదని అతనితో చెప్పిరి.౹

8. కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని యిద్దరు మనుష్యులను వెంటబెట్టుకొనిపోయి రాత్రివేళ ఆ స్త్రీయొద్దకు వచ్చి–కర్ణపిశాచముద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా 

9. ఆ స్త్రీ– ఇదిగో, సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని అతడు దేశములో ఉండకుండ నిర్మూలముచేసెను గదా. నీవు నా ప్రాణముకొరకు ఉరి యొగ్గి నాకు మరణమేల రప్పింతువు అని అతనితో అనెను.౹

10. అందుకు సౌలు–యెహోవా జీవముతోడు దీనినిబట్టి నీకు శిక్ష యెంతమాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణముచేయగా

11. ఆ స్త్రీ–నీతో మాటలాడుటకై నేనెవని రప్పింపవలెనని యడుగగా అతడు –సమూయేలును రప్పింపవలెననెను.౹ 

12. ఆ స్త్రీ సమూయేలును చూచి నప్పుడు బిగ్గరగా కేకవేసి–నీవు సౌలువే; నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా

13. రాజు–నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమె నడుగగా ఆమె–దేవతలలో ఒకడు భూమిలోనుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాననెను.౹

14. అందుకతడు–ఏ రూపముగా ఉన్నాడని దాని నడిగినందుకు అది–దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు–అతడు సమూయేలు అని తెలిసికొని సాగిలపడి నమస్కారము చేసెను.౹

15. సమూయేలు–నన్ను పైకిరమ్మని నీ వెందుకు తొందరపెట్టితివని సౌలు నడుగగా సౌలు– నేను బహు శ్రమలోనున్నాను; ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నములద్వారానైనను నా కేమియు సెలవియ్యకయున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితిననెను.౹

16. అందుకు సమూయేలు–యెహోవా నిన్ను ఎడ బాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుటవలన ప్రయోజనమేమి?

17. యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చియున్నట్టు నీ చేతినుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాని నిచ్చియున్నాడు.౹ 

18. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక, అమాలేకీయుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చక పోయిన దానినిబట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు.౹

19. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును; యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును; రేపు నీవును నీ కుమారులును నాతోకూడ ఉందురు అని సౌలుతో చెప్పగా

20. సమూయేలు మాటలకు సౌలు బహు భయమొంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజన మేమియు చేయక యుండినందున బలహీను డాయెను.౹ 

21. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకువచ్చి, అతడు బహుగా కలవరపడుట చూచి–నా యేలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసితిని.౹ 

22. ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించుము, నేను నీకు ఇంత ఆహారము వడ్డించుదును, నీవు భోజనముచేసి ప్రయాణమై పోవుటకు బలము తెచ్చుకొనుమని అతనితో చెప్పగా 

23. అతడు ఒప్పక భోజనము చేయననెను; అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై యతని బలవంతముచేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేలనుండి లేచి మంచముమీద కూర్చుండెను.౹ 

24. తన యింటిలో క్రొవ్విన పెయ్య ఒకటి యుండగా ఆ స్త్రీ దాని తీసికొని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసులేని రొట్టెలు కాల్చి

25. తీసికొని వచ్చి సౌలునకును అతని సేవకులకును వడ్డించగా వారు భోజనముచేసి లేచి ఆ రాత్రి వెళ్లిపోయిరి.

1 సమూయేలు 31

సౌలు మరియు అతని కుమారులు చంపబడ్డారు

1. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుటనుండి పారిపోయిరి. గిల్బోవ పర్వతమువరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు

2. సౌలును అతని కుమారులను తరుముచు, యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అను సౌలుయొక్క కుమారులను హతము చేసిరి.౹

3. యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులువేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను. అప్పుడు సౌలు

4. సున్నతిలేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీకత్తి దూసి దానిచేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయముచేత ఆలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దానిమీద పడెను.౹ 

5. సౌలు మరణమాయెనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తిమీదపడి అతనితోకూడ మరణమాయెను.౹

6. ఈలాగున సౌలును అతని ముగ్గురు కుమారులును అతని ఆయుధములను మోయువాడును అతని వారందరును ఒక దినముననే మరణమైరి.౹

7. లోయ అవతలనున్న ఇశ్రాయేలీయులును, యొర్దాను అవతల నున్నవారును, ఇశ్రాయేలీయులు పారిపోవుటయు, సౌలును అతని కుమారులును చచ్చియుండుటయు చూచి తమ నివాసగ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిష్తీయులు వచ్చివాటిలో కాపురముండిరి.

8. మరునాడు ఫిలిష్తీయులు హతమైనవారిని దోచుకొన వచ్చి గిల్బోవ పర్వతముమీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని

9. అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్లలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిష్తీయుల దేశములో నలుదిశలు వాటిని పంపిరి.౹

10. మరియు వారు అతని ఆయుధములను అష్తారోతు దేవిగుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి.౹

11. అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దానిగురించిన వార్త యాబేష్గిలాదువారు విని 

12. బలశాలులందరు లేచి రాత్రియంత నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణపు గోడమీదనుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనముచేసి

13. వారి శల్యములను తీసి యాబేషులోని పిచులవృక్షము క్రింద పాతిపెట్టి యేడుదినములు ఉపవాసముండిరి.

2 సమూయేలు 1

దావీదు సౌలు మరణమును గూర్చి తెలుసుకొంటాడు

1. దావీదు అమాలేకీయులను హతముచేసితిరిగి వచ్చెను. సౌలు మృతినొందిన తరువాత అతడు సిక్లగులో రెండు దినములుండెను.౹

2 . మూడవదినమున బట్టలు చింపుకొని తలమీద బుగ్గిపోసికొనిన యొకడు సౌలునొద్దనున్నదండులోనుండి వచ్చెను.౹

3. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారముచేయగా దావీదు–నీ వెక్కడనుండి వచ్చితివని యడిగెను. అందుకు వాడు–ఇశ్రాయేలీయుల సైన్యములోనుండి నేను తప్పించుకొని వచ్చితిననెను.౹

4. జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవియ్యగా వాడు–జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయిరి. అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను.౹

5. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీ కేలాగు తెలిసినది అని దావీదు వానినడుగగా వాడిట్లనెను

6-7. గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన యీటెమీద ఆనుకొనియుండెను. అతడు రథములును రౌతులును తనను వెనువెంట తగులు చుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు–చిత్తము నా యేలినవాడా అని నేనంటిని.

8-10. నీవెవడవని అతడు నన్నడుగగా–నేను అమాలేకీయుడనని చెప్పితిని. అతడు–నా ప్రాణము ఇంక నాలో ఉన్నదిగాని తల త్రిప్పుచేత నేను బహు బాధ పడుచున్నాను; నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవియ్యగా, ఈలాగు పడినతరువాత అతడు బ్రదుకడని నేను నిశ్చయించుకొని అతనిదగ్గర నిలిచి అతని చంపితిని; తరువాత అతని తలమీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసికొని నా యేలినవాడవైన నీయొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను.౹

11. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతనియొద్దనున్నవారందరును ఆలాగున చేసి

12. సౌలును యోనాతానును యెహోవా జనులును ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలి రని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రమువరకు ఉపవాసముండిరి.౹ 

13. తరువాత దావీదు–నీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చినవానినడుగగా వాడు–నేను ఇశ్రాయేలుదేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడననెను.౹ 

14-16. అందుకు దావీదు–భయపడక యెహోవా అభిషేకించినవానిని చంపుటకు నీవేల అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే; నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది వని వానితో చెప్పి తనవారిలో ఒకని పిలిచి–నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను.

Related Quiz Articles