ప్రవక్తలు మరియు రాజులు  (BSI)

2 భాగము

2 సమూయేలు 6

మందసమును యెరూషలేముకు తీసుకువచ్చారు.

1.తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో ముప్పదివేలమంది శూరులను సమకూర్చుకొని 

2.బయలుదేరి, కెరూబులమధ్య నివసించు సైన్యములకధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటనుండి తీసికొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితోకూడ బాయిలా యెహూదాలోనుండి ప్రయాణమాయెను.౹

 3.వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబుయొక్క యింటిలోనుండి తీసికొనిరాగా అబీనాదాబు కుమారులగు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి.౹

4.దేవుని మందసముగల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటనుండి తీసికొనిరాగా అహ్యో దానిముందర నడిచెను.౹

 5.దావీదును ఇశ్రాయేలీయులందరును సరళవృక్షపు కఱ్ఱతో చేయబడిన నానావిధములైన సితారాలను స్వర మండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి.౹

 6.వారు నాకోను కళ్లము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా 

7.యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పునుబట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్దపడి చనిపోయెను.౹ 

8.యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అను పేరు పెట్టెను.౹ 9నేటికిని దానికి అదేపేరు. ఆ దినమున–యెహోవా మందసము నాయొద్ద ఏలాగుండుననుకొని, దావీదు యెహోవాకు భయపడి

 10.యెహోవా మందసమును దావీదు పురములోనికి తనయొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటివరకు తీసికొని అచ్చట ఉంచెను.౹ 

11.యెహోవా మందసము మూడునెలలు గిత్తీయుడగు ఓబేదె దోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటివారినందరిని ఆశీర్వదించెను.౹ 

12.దేవుని మందసము ఉండుటవలన యెహోవా ఓబేదెదోము ఇంటివారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసికొని వచ్చెను.౹ 

13-14.ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఆరేసి యడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్వినదూడ ఒకటియు వధింపబడెను, దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించినవాడై శక్తికొలది యెహోవా సన్నిధిని నాట్య మాడుచుండెను.౹ 

15.ఈలాగున దావీదును ఇశ్రాయేలీయులందరును ఆర్భాటముతోను బాకా నాదములతోను యెహోవా మందసమును తీసికొని వచ్చిరి.౹

 16.యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలోనుండి చూచి, యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచు నున్న దావీదును కనుగొని, తన మనస్సులో అతని హీనపరచెను.౹ 

17.వారు యెహోవా మందసమును తీసికొని వచ్చి గుడారముమధ్యను దావీదు దానికొరకు ఏర్పరచిన స్థలమున నుంచగా, దావీదు దహనబలులను సమాధానబలులను యెహోవా సన్నిధిని అర్పించెను.౹ 

18-19.దహనబలులను సమాధానబలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి, సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులగు స్త్రీపురుషులకందరికి ఒక్కొక రొట్టెయు ఒక్కొక భక్ష్యమును ఒక్కొక ద్రాక్షపండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరును తమతమ యిండ్లకు వెళ్లిపోయిరి.

20.తన యింటివారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి–హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి యెంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు

 21.నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనులమీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను యేర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేనాలాగు చేసితిని; యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని.౹ 

22.ఇంతకంటె మరి యెక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో అనెను. మరణమువరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను.

1 దినవృత్తాంతములు 13

మందసమును తిరిగి తీసుకొని వచ్చుట.

1.దావీదు సహస్రాధిపతులతోను శతాధిపతులతోను అధిపతులందరితోను ఆలోచనచేసి, సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఈలాగు సెలవిచ్చెను

 2.ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగినయెడల ఇశ్రాయేలీయుల నివాసప్రదేశముల యందంతట శేషించియున్న మన సహోదరులును తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులును లేవీయులును మనతోకూడుకొనునట్లు వారియొద్దకు పంపి

 3.మన దేవుని మందసమును మరల మనయొద్దకు కొంచు వత్తము రండి; సౌలు దినములలో దానియొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి.౹

 4.ఈ కార్యము సమా జకులందరి దృష్టికి అనుకూలమాయెను గనుక జనులందరును ఆప్రకారము చేయుదుమనిరి.౹

 5.కాగా దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తీసికొని వచ్చుటకు దావీదు ఐగుప్తుయొక్క షీహోరునది మొదలుకొని హమాతునకు పోవుమార్గమువరకునుండు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చెను.౹ 

6.కెరూబులమధ్య నివాసముచేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలోనుండు కిర్యత్యారీము అనబడిన బాలానుండి తీసికొనివచ్చుటకై అతడును ఇశ్రాయేలీయులందరును అచ్చటికి పోయిరి.౹ 

7.వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండిమీద ఎక్కించి, అబీనాదాబు ఇంటనుండి తీసికొనివచ్చిరి; ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి.౹ 

8.దావీదును ఇశ్రాయేలీయులందరును తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు, సితారాలను స్వరమండలములను తంబురలను తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి.౹ 

9.వారు కీదోను కళ్లమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చేయిచాపగా 

10.యెహోవా కోపము అతనిమీద రగులుకొనెను, అతడు తన చేయి మందసము నొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను.౹ 

11.యెహోవా ఉజ్జాను వినాశము చేయుటచూచి దావీదు వ్యాకులపడెను; అందుచేత ఆ స్థలమునకు నేటివరకు పెరెజ్ ఉజ్జా అని పేరు.౹

 12.ఆ దినమున దావీదు దేవుని విషయమై భయమొంది–దేవుని మందసమును నాయొద్దకు నేను ఏలాగు తీసికొని పోవుదుననుకొని, మందసమును

 13.తన యొద్దకు దావీదు పురమునకు తీసికొనిపోక, దానిని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను.౹ 

14.దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద మూడు నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను.

2 సమూయేలు 7

దావీదుకు దేవుని వాగ్దానము.

1.యెహోవా నలుదిక్కుల అతని శత్రువులమీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి 

2.నేను దేవదారుమ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా 

3.నాతాను–యెహోవా నీకు తోడుగా నున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను.౹ 

4.అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా 

5.నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము–యెహోవా నీకాజ్ఞ ఇచ్చునదేమనగా–నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా?

 6.ఐగుప్తులోనుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించితిని.౹ 

7.ఇశ్రాయేలీయులతోకూడ నేను సంచరించిన కాల మంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరమొకటి మీరు నాకు కట్టింపక పోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా? 

8.కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుము–సైన్యములకధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా– గొఱ్ఱెల కాపులోనున్న నిన్ను గొఱ్ఱెలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించితిని.౹ 

9.నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగానుండి నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలముచేసి, లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి యున్నాను.౹ 

10.మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండ తమ స్వస్థలమందు నివసించునట్లు దానియందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనులమీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధిగల జనులు ఇకను వారిని కష్టపట్టకయుండునట్లుగా చేసి

 11.నీ శత్రువులమీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయు నదేమనగా–నేను నీకు సంతానము కలుగజేయుదును.౹ 

12.నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతోకూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.౹

 13.అతడు నా నామఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్యసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;౹

 14.నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడైయుండును; అతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతునుగాని

 15.నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను.౹ 

16.నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.౹

 17.తనకు కలిగిన దర్శన మంతటినిబట్టి యీ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియ జెప్పెను.

దావీదు ప్రార్ధన.

18.దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను–నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నే నెంతటివాడను? నా కుటుంబము ఏ పాటిది?

 19.ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతినిబట్టి, బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోవుదానిని గూర్చి నీవు సెలవిచ్చియున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును?

 20.యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగియున్నావు.౹

 21.నీ వాక్కునుబట్టి నీ యిష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీని తెలియజేసితివి.౹

 22.కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనతగలవాడవు, నీవంటి దేవుడొకడును లేడు; మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు.౹ 

23.నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులనుబట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తుదేశములోనుండియు, ఆ జనుల వశములోనుండియు, వారి దేవతల వశములోనుండియు నీవు విమోచించిన ఇశ్రాయేలీయులనునట్టి నీ జనులవంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది.౹

 24.మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవైయుండి, వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులై యుండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి.౹

 25.దేవా యెహోవా, నీ దాసుడనగునన్నుగూర్చియు నా కుటుంబమునుగూర్చియు నీవు సెలవిచ్చినమాట యెన్నటికి నిలుచునట్లు దృఢపరచి 

26.సైన్యములకధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై యున్నాడను మాటచేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును, నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడునట్లును నీవు సెలవిచ్చినమాట నెరవేర్చుము.౹

 27.ఇశ్రాయేలీయుల దేవా సైన్యములకధిపతియగు యెహోవా–నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరచితివి గనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను.౹

 28.యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే; నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము.౹

 29.దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము; యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చియున్నావు; నీ ఆశీర్వాదమునొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక.

1 దినవృత్తాంతములు 15 .మందసమును యెరూషలేముకు తీసుకువచ్చారు.

1.దావీదు తనకొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను; దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరచి, దానిమీద గుడారమొకటి వేయించెను.౹

 2.మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవచేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి–వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను.౹ 

3.అంతట దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తీసికొనివచ్చుటకై ఇశ్రాయేలీయులనందరిని యెరూషలేమునకు సమాజముగా కూర్చెను.౹

 4-5.అహరోను సంతతివారిని లేవీయులైన కహాతు సంతతివారి అధిపతియగు ఊరీయేలును వాని బంధువులలో నూట ఇరువదిమందిని,౹ 

6.మెరారీయులలో అధిపతియైన అశాయాను వాని బంధువులలో రెండువందల ఇరువది మందిని,౹ 

7.గెర్షోను సంతతివారికధిపతియగు యోవేలును వాని బంధువులలో నూట ముప్పదిమందిని,౹ 

8.ఎలీషా పాను సంతతివారికధిపతియగు షెమయాను వాని బంధు వులలో రెండువందలమందిని,౹

 9.హెబ్రోను సంతతివారి కధిపతియగు ఎలీయేలును వాని బంధువులలో ఎనుబదిమందిని

 10.ఉజ్జీయేలు సంతతివారికధిపతియగు అమ్మీనా దాబును వాని బంధువులలో నూట పండ్రెండుగురిని దావీదు సమకూర్చెను.౹

 11.అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన ఊరియేలు అశాయా యోవేలు షెమయా ఎలీయేలు అమ్మీనాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను.౹ 

12.లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై యున్నారు.౹ 

13.ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా మందసమును మోయక యుండుటచేతను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధినిబట్టి విచారణచేయకుండుటచేతను, ఆయన మనలో నాశనము కలుగజేసెను; కావున ఇప్పుడు మీరును మీవారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, నేను ఆ మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తేవలెను.౹

 14.అప్పుడు యాజకులును లేవీయులును ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి.౹

 15.తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటనుబట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజములమీదికి ఎత్తికొనిరి.౹

 16.అంతట దావీదు–మీరు మీ బంధువులగు పాటకులను పిలిచి, స్వరమండలములు సితారాలు తాళములు లోనగు వాద్యవిశేషములతో గంభీర ధ్వనిచేయుచు, సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటుచేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.౹

 17.కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులగు మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతానును,౹

 18.వీరితోకూడ రెండవ వరుసగానున్న తమ బంధువులైన జెకర్యా బేను యహజీయేలు షెమీరా మోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు బెనాయా మయ శేయా మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహు లనువారిని ద్వారపాలకులగు ఓబేదెదోమును యెహీయేలును పాటకు లనుగా నియమించిరి.౹

 19.పాటకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి.౹ 

20.జెకర్యా అజీయేలు షెమీరామోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు మయశేయా బెనాయా అనువారు హెచ్చు స్వరముగల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి.౹ 

21.మరియు మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహు ఓబేదెదోము యెహీయేలు అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి.౹ 

22.లేవీయుల కధిపతియైన కెనన్యా మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను.౹ 

23.బెరెక్యాయును ఎల్కానాయును మందసమునకు ముందునడుచు కావలివారుగాను 

24.షెబన్యా యెహోషాపాతు నెతనేలు అమాశై జెకర్యా బెనాయా ఎలీయెజెరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను, ఓబేదెదోమును యెహీయాయును వెనుకతట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి.౹

 25.దావీదును ఇశ్రాయేలీయుల పెద్దలును సహస్రాధిపతులును యెహోవా నిబంధనమందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి.౹ 

26.యెహోవా నిబంధనమందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయముచేయగా వారు ఏడు కోడెలను ఏడు గొఱ్ఱెపొట్టేళ్లను బలులుగా అర్పించిరి.౹ 

27.దావీదును మందసమును మోయు లేవీయులందరును పాట కులును పాటకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపునారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని యుండిరి, దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించియుండెను.౹

 28.ఇశ్రాయేలీయులందరును ఆర్భా టముచేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధనమందసమును తీసికొనివచ్చిరి.౹ 

29.యెహోవా నిబంధనమందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తెయైన మీకాలు కిటికీలోనుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను.

2 సమూయేలు 11

దావీదు మరియు బత్షెబ.

1.వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతనివారిని ఇశ్రాయేలీయులనందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడివేసిరి; అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను.

2.ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను.౹ 

3.ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలిసికొనుటకై యొక దూతను పంపెను, అతడు వచ్చి–ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా 

4.దావీదు దూతలచేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను; కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను.౹ 

5.ఆ స్త్రీ గర్భవతియై –నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా

 6.దావీదు హిత్తీయుడగు ఊరియాను నాయొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను.౹

 7.ఊరియా దావీదు నొద్దకురాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధసమాచారమును అడిగెను.౹

 8.తరువాత దావీదు–ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవియ్యగా, ఊరియా రాజ నగరిలోనుండి బయలువెళ్లెను.౹

 9.అతనివెనుక రాజు ఫలాహారము అతనియొద్దకు పంపించెనుగాని ఊరియా తన యింటికి వెళ్లక తన యేలినవాని సేవకులతోకూడ రాజ నగరిద్వారమున పండుకొనెను.౹ 

10.ఊరియా తన యింటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి–నీవు ప్రయాణముచేసి వచ్చితివి గదా; యింటికి వెళ్లకపోతివేమని యడుగగా

 11.ఊరియా–మందసమును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగను, నా యధిపతియగు యోవాబును నా యేలినవాడవగు నీ సేవకులును బయట దండులో నుండగను, భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికిపోదునా? నీ తోడు నీ ప్రాణముతోడు నేనాలాగు చేయువాడను కానని దావీదుతో అనెను.౹

 12.దావీదు–నేడును నీ విక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను.౹

 13.అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను; అతడు బాగుగాతిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేసెను; సాయంత్రమున అతడు బయలు వెళ్లి తన యింటికి పోక తన యేలినవాని సేవకులమధ్య పడకమీద పండుకొనెను.౹

14.ఉదయమున దావీదు – యుద్ధము మోపుగా జరుగుచున్నచోట ఊరియాను ముందుపెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్దనుండి వెళ్లి పొమ్మని 

15.యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియాచేత పంపించెను.౹

 16.యోవాబు పట్టణమును ముట్టడివేయు చుండగా, ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను.౹ 

17.ఆ పట్టణపువారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి, హిత్తీయుడగు ఊరియాయును హతమాయెను.౹ 

18.కాబట్టి యోవాబు యుద్ధ సమాచార మంతయు దావీదునొద్దకు పంపి దూతతో ఇట్లనెను

 19.యుద్ధసమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపము తెచ్చుకొని–యుద్ధము చేయునప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి?

 20.గోడమీదనుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియక పోయెనా? 

21.ఎరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఏలాగు హతమాయెను? ఒక స్త్రీ తిరుగటిరాతి తునక ఎత్తి గోడమీదనుండి అతని మీద వేసినందున అతడు తేబేసుదగ్గర హతమాయెను గదా? ప్రాకారముదగ్గరకు మీరెందుకు పోతిరని నిన్నడిగినయెడల నీవు–తమరి సేవకుడగు ఊరియాయు హతమాయెనని చెప్పుమని బోధించి దూతను పంపెను.౹

 22.దూత పోయి యోవాబు పంపిన వర్తమానమంతయు దావీదునకు తెలియజేసెను.౹ 

23.ఎట్లనగా – ఆ మనుష్యులు మమ్మును ఓడించుచు పొలములోనికి మాకెదురు రాగా మేము వారిని గుమ్మమువరకు వెంటాడి గెలిచితిమి.౹ 

24.అప్పుడు ప్రాకారముమీదనుండి విలు కాండ్రు తమ సేవకులమీద అంబులువేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి, తమరి సేవకుడైన హిత్తీయుడగు ఊరియా కూడ హతమాయెను.౹

 25.అందుకు దావీదు–నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము–ఆ సంగతినిబట్టి నీవు చింతపడకుము; ఖడ్గము ఒకప్పుడు ఒకనిమీదను ఒకప్పుడు మరియొకనిమీదను పడుట కద్దు; పట్టణముమీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి, నీవు యోవాబును ధైర్యపరచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను.౹ 

26.ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్తకొరకు అంగలార్చెను.౹ 

27.అంగలార్పుకాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్యయయి అతనికొక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను.

2 సమూయేలు 12

నాతాను దావీదుని మందలించుట.

1.కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను; అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను–ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి.౹

 2.ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొఱ్ఱెలును గొడ్లును కలిగియుండెను.౹ 

3.అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన యొక చిన్న ఆడు గొఱ్ఱెపిల్ల తప్ప ఏమియు లేకపోయెను. వాడు దానిని పెంచు కొనుచుండగా అది వానియొద్దను వాని బిడ్డలయొద్దను ఉండి పెరిగి వాని చేతిముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తెవలె ఉండెను.౹

 4.అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తనయొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొఱ్ఱెలలోగాని గొడ్లలోగాని దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రుని గొఱ్ఱెపిల్లను పట్టుకొని, తన యొద్దకు వచ్చినవానికి ఆయత్తము చేసెను.౹

 5.దావీదు ఈ మాట విని ఆ మనుష్యునిమీద బహుగా కోపించుకొని–యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు.౹

 6.వాడు కని కరము లేక యీ కార్యము చేసెను గనుక ఆ గొఱ్ఱెపిల్లకు ప్రతిగా నాలుగు గొఱ్ఱెపిల్లల నియ్యవలెనని నాతానుతో అనెను.

7.నాతాను దావీదును చూచి–ఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలీయులమీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకముచేసి సౌలు చేతిలోనుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకనుగ్రహించి 

8.నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును.౹ 

9.నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితి వేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లుగా నీవు పట్టుకొని యున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా?

 10.నీవు నన్ను లక్ష్యముచేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును.౹ 

11.నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చున దేమనగా–నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవాని కప్పగించెదను.౹

 12.పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయిం తును అనెను.౹

 13.నేను పాపముచేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను–నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.౹ 

14-15.అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను.

16.యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను.౹

 17.దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడియుండి బిడ్డకొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నిక యైనవారు లేచి అతనిని నేలనుండి లేవనెత్తుటకు వచ్చిరిగాని అతడు సమ్మతింపక వారితోకూడ భోజనము చేయక యుండెను.౹

 18.ఏడవదినమున బిడ్డ చావగా–బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటలాడినప్పుడు అతడు మా మాటలు వినక యుండెను.౹ 

19.ఇప్పుడు బిడ్డ చనిపోయెనని మనము అతనితో చెప్పినయెడల తనకుతాను హాని చేసికొనునేమో యనుకొని, దావీదు సేవకులు బిడ్డ చనిపోయెనను సంగతి అతనితో చెప్ప వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చని పోయెనను సంగతి గ్రహించి–బిడ్డ చనిపోయెనా అని తన సేవకుల నడుగగా వారు–చనిపోయెననిరి.౹

 20.అప్పుడు దావీదు నేలనుండి లేచి స్నానముచేసి తైలము పూసికొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన యింటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి; అప్పుడు అతడు భోజనము చేసెను.౹ 

21.అతని సేవకులు–బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసముండి దానికొరకు ఏడ్చుచుంటివిగాని అది మరణమైనప్పుడు లేచి భోజనముచేసితివి. నీవీలాగున చేయుట ఏమని దావీదు నడుగగా 

22.అతడు–బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రదికించునేమో యనుకొని నేను ఉపవాసముండి యేడ్చు చుంటిని.౹

 23.ఇప్పుడు చనిపోయెను గనుక నేనెందుకు ఉపవాసముండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వానియొద్దకు పోవుదునుగాని వాడు నాయొద్దకు మరల రాడని వారితో చెప్పెను.౹ 

24.తరువాత దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చి ఆమెయొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను.౹

25.యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞనుబట్టి యదీద్యా అని అతనికి పేరు పెట్టెను.

26.యోవాబు రబ్బా అను అమ్మోనీయుల పట్టణముమీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనెను.౹ 

27.దావీదునొద్దకు అతడు దూతలను పంపి–నేను రబ్బామీద యుద్ధముచేసి జలములమీది పట్టణమును పట్టుకొంటిని;౹ 

28.నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండునట్లు మిగిలిన దండువారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలెనని వర్తమానముచేయగా 

29.దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద యుద్ధముచేసి దానిని పట్టుకొని, వారి రాజు కిరీటమును అతని తలమీదనుండి తీయించగా అది దావీదు తలమీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెక్కినదై రెండు బంగారు మణుగులంత యెత్తుండెను.౹

 30.మరియు అతడు పట్టణములోనుండి బహువిస్తారమైన దోపుసొమ్ము పట్టుకొని పోయెను.౹

 31.పట్టణములో ఉన్నవారిని బయటికి తెప్పించి రంపములచేతను పదును గల యినుప పనిముట్లచేతను ఇనుప గొడ్డండ్లచేతను వారిని తుత్తునియలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను. అమ్మోనీయుల పట్టణములన్నిటికి అతడు ఈలాగు చేసెను. ఆ తరువాత దావీదును జనులందరును తిరిగి యెరూషలేమునకు వచ్చిరి.

2 సమూయేలు 15

అబ్షాలోము కుట్ర .

1.ఇదియైన తరువాత అబ్షాలోము ఒక రథమును గుఱ్ఱములను సిద్ధపరచి, తనయెదుట పరుగెత్తుటకై యేబదిమంది బంటులను ఏర్పరచుకొనెను.౹ 

2.ఉదయముననే లేచి బయలుదేరి పట్టణముయొక్క గుమ్మపు మార్గమందు ఒకతట్టున నిలిచి, రాజుచేత తీర్పునొందుటకై వ్యాజ్యెమాడు వారెవరైనను వచ్చియుండగా కనిపెట్టి వారిని పిలిచి–నీవు ఏ ఊరివాడవని యడుగుచుండెను–నీ దాసుడనైన నేను ఇశ్రాయేలీయుల గోత్రములలో ఫలానిదానికి చేరిన వాడనని వాడు చెప్పగా

 3.అబ్షాలోము–నీ వ్యాజ్యెము సరిగాను న్యాయముగాను ఉన్నదిగాని దానిని విచారించుటకై నియమింపబడినవాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి

 4.నేను ఈ దేశమునకు న్యాయాధిపతినైయుండుట యెంత మేలు; అప్పుడు వ్యాజ్యెమాడు వారు నాయొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచు వచ్చెను.౹ 

5.మరియు తనకు నమస్కారము చేయుటకై యెవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దుపెట్టుకొనుచు వచ్చెను.౹

 6.తీర్పునొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులకందరికి అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయుల నందరిని తనతట్టు త్రిప్పుకొనెను.

7-8.నాలుగు సంవత్సరములు జరిగినమీదట అబ్షాలోము రాజునొద్దకు వచ్చి–నీ దాసుడనైన నేను సిరియ దేశము నందలి గెషూరునందుండగా–యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించినయెడల నేను ఆయనను సేవించె దనని మ్రొక్కు కొంటిని గనుక, నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మ్రొక్కుకొనిన మ్రొక్కు బడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవిచేయగా 

9.రాజు–సుఖముగా పొమ్మని సెలవిచ్చెను గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయెను.౹ 

10.అబ్షాలోము–మీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటియొద్దకు వేగుల వారిని పంపెను.౹

 11.విందునకు పిలువబడియుండి రెండువందలమంది యెరూషలేములోనుండి అబ్షాలోముతోకూడ బయలుదేరి యుండిరి, వీరు ఏమియు తెలియక యథార్థమైన మనస్సుతో వెళ్లియుండిరి.౹ 

12.మరియు బలి అర్పింపవలెనని యుండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపెలు అను దావీదుయొక్క మంత్రిని గీలో అను అతని ఊరినుండి పిలిపించి యుండెను. అబ్షాలోముదగ్గరకు వచ్చిన జనము మరి మరి యెక్కువగుటచేత కుట్ర బహుబలమాయెను.

దావీదు పారిపోవుట.

13.ఇశ్రాయేలీయులు అబ్షాలోముపక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా 

14.దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–అబ్షాలోము చేతిలోనుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము; మనము పారిపోదము రండి, అతడు హఠా త్తుగా వచ్చి మనలను పట్టుకొనకను, మనకు కీడుచేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్లిపోదము రండి.౹ 

15.అందుకు రాజు సేవకులు ఈలాగు మనవి చేసిరి–చిత్తగించుము; నీ దాసులమైన మేము మా యేలినవాడవును రాజవునగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా నున్నాము.౹

 16.అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులగు పదిమందిని ఉంచిన మీదట తన యింటివారినందరిని వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరెను.౹

 17.రాజును అతని యింటివారును బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి బసచేసిరి.౹

18.అతని సేవకులందరును అతని యిరుపార్శ్వముల నడిచిరి; కెరే తీయులందరును పెలేతీయులందరును గాతునుండి వచ్చిన ఆరువందలమంది గిత్తీయులును రాజునకు ముందుగా నడచుచుండిరి.౹ 

19.రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని– నీవు నివాసస్థలము కోరు పరదేశివై యున్నావు; నీవెందుకు మాతోకూడ వచ్చుచున్నావు? నీవు తిరిగి పోయి రాజున్న స్థలమున ఉండుము.౹ 

20.నిన్ననే వచ్చిన నీకు, ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతోకూడ ఈ తిరుగు లాట యెందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము; కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక యని చెప్పగా

 21.ఇత్తయి–నేను చచ్చినను బ్రదికినను, యెహోవా జీవముతోడు నా యేలినవాడవును రాజవునగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా యేలినవాడవును రాజవునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవిచేసెను.౹ 

22.అందుకు దావీదు –ఆలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను గనుక గిత్తీయుడగు ఇత్తయియును అతని వారందరును అతని కుటుంబికులందరును సాగిపోయిరి.౹ 

23.వారు సాగిపోవుచుండగా జనులందరు బహుగా ఏడ్చుచుండిరి, ఈ ప్రకారము వారందరు రాజుతోకూడ కిద్రోనువాగు దాటి అరణ్యమార్గమున ప్రయాణమై పోయిరి.౹ 

24.సాదోకును లేవీయులందరును దేవుని నిబంధనమందసమును మోయుచు అతనియొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములోనుండి జనులందరును దాటిపోవువరకు నిలిచెను.౹ 

25.అప్పుడు రాజు సాదోకును పిలిచి–దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసికొనిపొమ్ము; యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందినయెడల ఆయన నన్ను తిరిగి రప్పించి 

26.దానిని తన నివాసస్థానమును నాకు చూపించును; నీయందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చినయెడల ఆయన చిత్తము, –నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయెడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి

 27.యాజకుడైన సాదోకుతో ఇట్లనెను–సాదోకూ, నీవు దీర్ఘదర్శివి కావా? శుభమొంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ యిద్దరు కుమారులును పట్టణమునకు పోవలెను.౹ 

28.ఆలకించుము; నీయొద్దనుండి నాకు రూఢియైన వర్తమానము వచ్చువరకు నేను అరణ్య మందలి రేవులదగ్గర నిలిచి యుందును.౹

29.కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసికొనిపోయి అక్కడ నిలిచిరి.

30.అయితే దావీదు ఒలీవచెట్ల కొండ యెక్కుచు ఏడ్చుచు, తల కప్పుకొని పాదరక్షలులేకుండ కాలినడకను వెళ్లెను; అతనియొద్దనున్న జనులందరును తలలు కప్పుకొని యేడ్చుచు కొండ యెక్కిరి.౹ 

31.అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు–యెహోవా అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను.౹

 32.దేవుని ఆరాధించు స్థలమొకటి ఆ కొండమీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తలమీద ధూళి పోసికొని వచ్చి రాజును దర్శనము చేసెను.౹

 33.రాజు–నీవు నాతోకూడ వచ్చినయెడల నాకు భారముగా ఉందువు;౹ 

34.నీవు పట్టణమునకు తిరిగి పోయి–రాజా, యింతవరకు నీ తండ్రికి నేను సేవచేసినట్లు ఇకను నీకు సేవచేసెదనని అబ్షాలోముతో చెప్పినయెడల నీవు నా పక్షపువాడవై యుండి అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్ట గలవు.౹ 

35.అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు; కాబట్టి రాజనగరియందు ఏదైనను జరుగుట నీకు వినబడినయెడల యాజకుడైన సాదోకుతోను అబ్యాతారుతోను దాని చెప్పవలెను.౹ 

36.సాదోకు కుమారుడైన అహిమయస్సు అబ్యాతారు కుమారుడైన యోనాతాను అనువారి ఇద్దరు కుమారులు అచ్చటనున్నారు. నీకు వినబడినదంతయు వారిచేత నాయొద్దకు వర్తమానము చేయుమని చెప్పి అతనిని పంపివేసెను.౹ 

37.దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను.

2 సమూయేలు 16

అహీతోపెలు మరియు హూషైయ సలహా.

15.అబ్షాలోమును ఇశ్రాయేలువారందరును అహీతో పెలును యెరూషలేమునకు వచ్చి యుండిరి.౹ 

16.దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషైయను నతడు అబ్షాలోమునొద్దకువచ్చి అతని దర్శించి–రాజు చిరంజీవి యగును గాక రాజు చిరంజీవియగును గాక అని పలుకగా 

17.అబ్షాలోము–నీ స్నేహితునికి నీవుచేయు ఉపకార మింతేనా నీ స్నేహితునితోకూడ నీవు వెళ్లకపోతివేమని అతని నడుగగా 

18.హూషై–యెహోవాయును ఈ జనులును ఇశ్రాయేలీయులందరును ఎవని కోరుకొందురో నేను అతని వాడనగుదును, అతనియొద్దనే యుందును.౹ 

19.మరియు నేనెవనికి సేవచేయవలెను? అతని కుమారుని సన్నిధిని నేను సేవచేయవలెను గదా? నీ తండ్రి సన్నిధిని నేను సేవచేసినట్లు నీ సన్నిధిని నేను సేవచేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేసెను.౹ 

20.అబ్షాలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలిసి కొనుటకై ఆలోచన చేతము రమ్ము అనగా 

21.అహీతోపెలు–నీ తండ్రిచేత ఇంటికి కావలియుంచబడిన ఉపపత్నులయొద్దకు నీవు పోయినయెడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరు తెలిసికొందురు, అప్పుడు నీ పక్షమున నున్నవారందరు ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను.౹ 

22.కాబట్టి మేడమీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులకందరికి తెలియునట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను.౹

 23.ఆ దినములలో అహీ తోపెలు చెప్పిన యే యాలోచనయైనను ఒకడు దేవుని యొద్ద విచారణచేసి పొందిన ఆలోచనయైనట్టుగా ఉండెను; దావీదును అబ్షాలోమును దానిని అట్లే యెంచుచుండిరి.

2 సమూయేలు 17

1.దావీదు అలసట నొంది బలహీనముగా నున్నాడు గనుక

 2-3.నేను అతనిమీదపడి అతని బెదరించినయెడల అతని యొద్దనున్న జనులందరు పారిపోదురు; రాజును మాత్రము హతముచేసి జనులందరిని నీతట్టు త్రిప్పెదను; నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరు వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను పండ్రెండు వేలమందిని ఏర్పరచుకొనిపోయి యీ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా

 4.ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలువారి పెద్దలకందరికిని యుక్తముగా కనబడెను.

5.అంతట–అర్కీయుడైన హూషై యేమి చెప్పునో మనము వినునట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞ ఇయ్యగా, హూషై అబ్షాలోమునొద్దకు వచ్చెను.౹ 

6.అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి–అతని మాటచొప్పున మనము చేయుదమా చేయకుందుమా? నీ యాలోచన యేమైనది చెప్పుమని అతని నడుగగా 

7.హూషై అబ్షాలోముతో ఇట్లనెను. ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు.౹

 8.నీ తండ్రియు అతని పక్షమున నున్నవారును మహా బలాఢ్యులనియు, అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంట్ల వంటివారై రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియును. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతోకూడ బసచేయడు.౹

 9.అతడేదో యొక గుహయందో మరి ఏ స్థలమందో దాగి యుండును. కాబట్టి నీవారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతినిబట్టి అబ్షాలోము పక్షమున నున్నవారు ఓడిపోయిరని చెప్పు కొందురు.౹ 

10.నీ తండ్రి మహా బలాఢ్యుడనియు, అతని పక్షపువారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీయులందరును ఎరుగుదురు గనుక సింహపుగుండెవంటి గుండెగలవారు సయితము దిగులొందుదురు.౹

 11.కాబట్టి నా ఆలోచన యేమనగా, దానునుండి బెయేర్షెబావరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీయుల నందరిని నలుదిశలనుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను.౹ 

12.అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో యొకదానియందు అతనిమీద పడుదుము; నేలమీద మంచుపడురీతిగా మనము అతనిమీదికి వచ్చినయెడల అతని పక్షపువారిలో ఒకడును తప్పించుకొనజాలడు.౹

13.అతడు ఒక పట్టణములో చొచ్చినయెడల ఇశ్రాయేలీయులందరును ఆ పట్టణమునకు త్రాళ్లు తీసికొనివచ్చి యొక చిన్న రాయి అచ్చట కనబడకుండ దానిని నదిలోనికి లాగుదురు.౹

 14.అబ్షాలోమును ఇశ్రాయేలువారందరును ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పినదానికంటె యుక్తమని యొప్పుకొనిరి; ఏలయనగా యెహోవా అబ్షాలోముమీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థముచేయ నిశ్చయించి యుండెను.

15.కాబట్టి హూషై అబ్షాలోమునకును ఇశ్రాయేలువారి పెద్దలకందరికిని అహీతోపెలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులగు సాదోకుతోను అబ్యా తారుతోను తెలియజెప్పి

 16.మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటు స్థలములలో ఉండవద్దనియు, రాజును అతని సమక్షమందున్న జనులందరును నశింపకుండునట్లు శీఘ్రముగా వెళ్లిపోవుడనియు దావీదునకు వర్తమానము పంపుడని చెప్పెను.౹ 

17.తాము పట్టణముతట్టు వచ్చిన సంగతి తెలియబడక యుండునట్లు యోనాతానును అహిమయస్సును ఏన్‌రోగేలు దగ్గర నిలిచియుండగా పని కత్తె యొకతెవచ్చి, హూషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాని తెలియజెప్పిరి.౹

18.తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెనుగాని వారిద్దరు వేగిరముగా పోయి బహూరీములో ఒకని యిల్లు చేరి అతని యింటి ముంగిట ఒక బావి యుండగా దానిలో దిగి దాగి యుండిరి.౹

19.ఆ యింటి యిల్లాలు ముతక గుడ్డ యొకటి తీసికొనివచ్చి బావిమీద పరచి దానిపైన గోధుమపిండి ఆర బోసెను గనుక వారు దాగిన సంగతి యెవరికిని తెలియక పోయెను.౹ 

20.అబ్షాలోము సేవకులు ఆ యింటి ఆమెయొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడుగగా ఆమె–వారు ఏరుదాటి పోయిరని వారితో చెప్పెను గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.౹ 

21.వారు వెళ్లిన తరువాత యోనాతానును అహిమయస్సును బావిలోనుండి బయటికి వచ్చి దావీదునొద్దకు పోయి అహీతోపెలు అతనిమీద చేసిన ఆలోచన తెలియజేసి–నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా 

22.దావీదును అతని యొద్దనున్న జనులందరును లేచి యొర్దానునది దాటిరి, తెల్లవారునప్పటికి నది దాటక యుండినవాడు ఒకడును లేకపోయెను.౹

 23.అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరుగకపోవుట చూచి, గాడిదకు గంతకట్టి యెక్కి తన ఊరనున్న తన యింటికి పోయి తన యిల్లు చక్కబెట్టుకొని ఉరిపోసికొని చనిపోయెను; జనులు అతని తండ్రి సమాధియందు అతనిని పాతిపెట్టిరి.

అబ్షాలోము మరణము .

24.దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీయులందరును యొర్దాను నది దాటి వచ్చిరి.౹ 

25.అబ్షాలోము యోవాబునకు మారుగా అమాశాను సైన్యాధి పతిగా నియమించెను. ఈ అమాశా ఇత్రా అను ఇశ్రాయేలీయుడు యోవాబు తల్లియైన సెరూయా సహోదరియగు నాహాషు కుమార్తెయైన అబీగయీలు నొద్దకు పోయి నందున పుట్టినవాడు

 26.అబ్షాలోమును ఇశ్రాయేలీయులును గిలాదుదేశములో దిగియుండిరి.

27.దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపువాడైన నాహాషు కుమారుడగు షోబీయును, లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రోగెలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయియు 

28.అరణ్యమందు జనులు అలసినవారై ఆకలిగొని దప్పిగొనియుందురని తలంచి, పరుపులు పాత్రలుకుండలు గోధుమలు యవలు పిండి వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడు కాయలు పేలాలు 

29.తేనె వెన్న గొఱ్ఱెలు జున్నుముద్దలు దావీదును అతనియొద్దనున్న జనులును భోజనము చేయుటకై తీసికొనివచ్చిరి.

2 సమూయేలు 24

దావీదు పోరాట పురుషులను చేర్చుకొనుట.

1.ఇంకొకమారు యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణచేసి–నీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.౹

 2.అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతియైన యోవాబును పిలిచి–జనసంఖ్య యెంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబావరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారముచేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా

 3.యోవాబు–జనుల సంఖ్య యెంత యున్నను నా యేలినవాడవును రాజవునగు నీవు బ్రదికి యుండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయునుగాక; నా యేలినవాడవును రాజవునగు నీకు ఈ కోరిక ఏలపుట్టెననెను.౹

 4.అయినను రాజు యోవా బునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చియుండుటచేత యోవాబును సైన్యాధిపతులును ఇశ్రాయేలీయుల సంఖ్య చూచుటకై రాజుసముఖమునుండి బయలువెళ్లి

 5.యొర్దాను నది దాటి యాజేరుతట్టున గాదు లోయ మధ్యనుండు పట్టణపు కుడిపార్శ్వముననున్న అరోయేరులో దిగి 6అక్కడనుండి గిలాదునకును తహ్తింహోద్షీ దేశమునకును వచ్చిరి; తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి.౹

 7.అక్కడనుండి బురుజులుగల తూరు పట్టణమునకును హివ్వీయులయొక్కయు కనానీయులయొక్కయు పట్టణములన్నిటికిని వచ్చి యూదాదేశపు దక్షిణదిక్కుననున్న బెయేర్షెబావరకు సంచరించిరి.౹

 8.ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి తొమ్మిదినెలల ఇరువది దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి.౹ 

9.అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను; ఇశ్రాయేలువారిలో కత్తి దూయగల యెనిమిది లక్షలమంది యోధులుండిరి; యూదా వారిలో అయిదు లక్షలమంది యుండిరి.

10.జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు–నేను చేసిన పనివలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసితిని; యెహోవా, కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవిచేయగా 

11.ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 

12.నీవు పోయి దావీదుతో ఇట్లనుము– యెహోవా సెలవిచ్చునదేమనగా–మూడు విషయములను నీ యెదుట పెట్టుచున్నాను; వాటిలో ఒక దానిని నీవు కోరుకొనినయెడల నేనది నీమీదికి రప్పించెదను.౹ 

13.కావున గాదు దావీదునొద్దకు వచ్చి యిట్లని సంగతి తెలియజెప్పెను–నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుము చున్న నీ శత్రువులయెదుట నిలువలేక నీవు మూడు నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు మూడుదినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచనచేసి నన్ను పంపినవానికి నేనియ్యవలసిన యుత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను.౹ 

14.అందుకు దావీదు – నా కేమియు తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యతగలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండ యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను.౹ 

15.అందుకు యెహోవా ఇశ్రాయేలీయులమీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజకూటపు వేళవరకు అది జరుగుచుండెను; అందుచేత దానునుండి బెయేర్షెబావరకు డెబ్బది వేలమంది మృతినొందిరి.౹ 

16.అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు, యెహోవా ఆ కీడునుగూర్చి సంతాపమొంది–అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనముచేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవాదూత యెబూసీయుడైన అరౌనాయొక్క కళ్లము దగ్గర ఉండగా

 17.దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థిం చెను–చిత్తగించుము; పాపము చేసినవాడను నేనే; దుర్మార్గముగా ప్రవర్తించినవాడను నేనే; గొఱ్ఱెలవంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి యింటివారిని శిక్షించుము.

దావీదు బలిపీఠమును కట్టెను.

18.ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చి–నీవు పోయి యెబూసీయుడైన అరౌనాయొక్క కళ్లములో యెహోవా నామమున ఒక బలిపీఠముకట్టించుమని అతనితో చెప్పగా 

19.దావీదు గాదుచేత యెహోవా యిచ్చిన ఆజ్ఞచొప్పున పోయెను.౹ 20అరౌనా రాజును అతని సేవకులును తన దాపునకు వచ్చుటచూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారముచేసి–నా యేలినవాడవును రాజవునగు నీవు నీ దాసుడనైన నాయొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా

 21.దావీదు –ఈ తెగులు మనుష్యులకు తగలకుండ నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠముకట్టించుటకై నీయొద్ద ఈ కళ్లమును కొనవలెనని వచ్చితిననెను,౹

 22.అందుకు అరౌనా–నా యేలినవాడవగు నీవు చూచి యేది నీకు అనుకూలమో దాని తీసికొని బలి అర్పించుము; చిత్తగించుము, దహనబలికి ఎడ్లున్నవి, నూర్చుకఱ్ఱ సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును.౹ 

23.రాజా, యివన్నియు అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి– నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా 

24.రాజు–నేను ఆలాగు తీసికొనను, వెల యిచ్చి నీయొద్ద కొందును, వెల యియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్లమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను.౹

25.అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠముకట్టించి దహనబలులను సమాధానబలులను అర్పించెను; యెహోవా దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచి పోయెను.

1 దినవృత్తాంతములు 29:26.యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజైయుండెను.౹

 27.అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు; హెబ్రోనులో ఏడు సంవత్సరములును, యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును అతడు ఏలెను.౹

28.అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి, మంచి ముది మిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను.౹ 

29.రాజైన దావీదునకు జరిగినవాటన్నిటినిగూర్చియు, అతని రాజరిక మంతటినిగూర్చియు, పరాక్రమమునుగూర్చియు, అతనికిని ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికిని వచ్చిన కాలములనుగూర్చియు,౹ 

30.దీర్ఘదర్శి సమూయేలు మాటలనుబట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలనుబట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలనుబట్టియు వ్రాయబడి యున్నది.

1 దినవృత్తాంతములు 21:1తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా

 2.దావీదు యోవాబునకును జనులయొక్క అధిపతులకును–మీరు వెళ్లి బెయేర్షెబా మొదలుకొని దానువరకుఉండు ఇశ్రాయేలీయులను ఎంచి, వారి సంఖ్య నాకు తెలియుటకై నాయొద్దకు దాని తీసికొని రండని ఆజ్ఞ ఇచ్చెను.౹ 

3.అందుకు యోవాబు–రాజా నా యేలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్నవారికంటె నూరంతలు ఎక్కువమందిని చేయునుగాక; వారందరు నా యేలినవాని దాసులుకారా? నా యేలినవానికి ఈ విచారణ యేల? ఇది జరుగవలసిన హేతువేమి? జరిగినయెడల ఇశ్రాయేలీయులకు శిక్షకలుగును అని మనవిచేసెను.౹ 

4.అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమందంతట సంచరించితిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను.౹ 

5.ఇశ్రాయేలీయులందరిలో కత్తిదూయువారు పదకొండు లక్షలమందియు యూదా వారిలో కత్తిదూయువారు నాలుగు లక్షల డెబ్బదివేలమందియు సంఖ్యకు వచ్చిరి.౹ 

6.రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీను గోత్రసంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు.౹

 7.ఈ కార్యము దేవునిదృష్టికి ప్రతికూలమగుటచేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను.౹

 8.దావీదు–నేను ఈ కార్యముచేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొఱ్ఱపెట్టగా 9యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఈలాగు సెలవిచ్చెను–నీవు వెళ్లి దావీదుతో ఇట్లనుము.౹ 

10. యెహోవా సెలవిచ్చునదేమనగా–మూడు విషయములు నేను నీయెదుట నుంచుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకొనినయెడల దాని నీకు చేయుదును.౹ 

11.కావున గాదు దావీదు నొద్దకు వచ్చి యిట్లనెను 

12.మూడేండ్ల పాటు కరవు కలుగుట, మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు వారియెదుట నిలువలేక నశించిపోవుట, మూడుదినములపాటు దేశమందు యెహోవా కత్తి, అనగా తెగులు నిలుచుటచేత యెహోవాదూత ఇశ్రాయేలీయుల దేశమందంతట నాశనము కలుగ జేయుట, అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు; కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరమియ్యవలెనో దాని యోచించుము.౹ 

13.అందుకు దావీదు–నేను మిక్కిలి యిరుకులో చిక్కియున్నాను; యెహోవా మహా కృపగలవాడు, నేను మనుష్యులచేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను.౹ 

14.కావున యెహోవా ఇశ్రాయేలీయులమీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో డెబ్బదివేలమంది చచ్చిరి.౹ 

15.యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను; అతడు నాశనము చేయబోవుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమొంది నాశనముచేయు దూతతో–చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవియ్యగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్లము నొద్ద నిలిచెను.౹

 16.దావీదు కన్నులెత్తి చూడగా, భూమ్యాకాశములమధ్యను నిలుచుచు, వరదీసిన కత్తి చేతపట్టుకొని దానిని యెరూషలేముమీద చాపిన యెహోవాదూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలును గోనె పట్టలు కప్పుకొనినవారై సాష్టాంగపడగా

 17.దావీదు– జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనేగదా? పాపముచేసి చెడుతనము జరిగించినవాడను నేనేగదా? గొఱ్ఱెలవంటివారగు వీరేమి చేసిరి? నా దేవుడవైన యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నీ జనులమీద నుండకుండ నామీదను నా తండ్రి యింటివారిమీదను ఉండ నిమ్మని దేవునితో మనవిచేసెను.

దావీదు బలిపీఠమును కట్టెను.

18.యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్లవలెనని దావీదునకు ఆజ్ఞ నిమ్మని యెహోవాదూత గాదునకు సెలవియ్యగా 

19.యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్లెను.౹ 

20.ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చు చుండెను; అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు, అతడును అతనితోకూడనున్న అతని నలుగురు కుమారులును దాగుకొనిరి.౹ 

21.దావీదు ఒర్నానునొద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి, కళ్లములోనుండి వెలుపలికి వచ్చి, తల నేలమట్టునకు వంచి దావీదుకు నమస్కారము చేసెను.౹ 

22.ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్లపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు ఒర్నానుతో అనగా 

23.ఒర్నాను–రాజైన నా యేలినవాడు దాని తీసికొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయును గాక; ఇదిగో దహనబలులకు ఎద్దులు కట్టెలకై నురిపిడి సామగ్రి నైవేద్యమునకు గోధుమ పిండి; ఇదియంతయు నేనిచ్చెదనని దావీదుతో అనెను.౹ 

24.రాజైన దావీదు–అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసికొని యెహోవాకు దహనబలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాని తీసికొందునని ఒర్నానుతో చెప్పి

 25.ఆ భూమికి ఆరువందల తులముల బంగారమును అతని కిచ్చెను.౹ 

26.పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహనబలులను సమాధానబలులను అర్పించి యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆకాశములోనుండి దహనబలిపీఠము మీదికి అగ్నివలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను.౹ 

27.యెహోవాదూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వరలో వేసెను.

28.యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చెనని దావీదు తెలిసికొని అచ్చటనే బలి అర్పించెను

 29.మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహనబలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను.౹ 

30.దావీదు యెహోవాదూత పట్టుకొనిన కత్తికి భయపడిన వాడై దేవునియొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్లలేకుండెను.

Related Quiz Articles