మాదీయుల మరియు పారసీకుల ప్రవాసం నుండి ఇశ్రాయేలీయుల విడుదల

 

ఎజ్రా పుస్తకములోని అధ్యాయముల వారీగా సంఘటనలు

 

ఎజ్రా 1

ఇశ్రాయేలీయులను ప్రవాసం నుండి విడిపించుటకు సహాయ పడిన పారసీకదేశపు రాజైన కోరెషు

1.పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట చాటింపుచేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను 

2.–పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా – ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి, యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.౹ 

3.కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను; వారి దేవుడు వారికి తోడై యుండునుగాక.౹ 

4.మరియు యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోనివారు తమ యొద్ద నివసించువారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను.౹ 

5.అప్పుడు యూదా పెద్దలును, బెన్యామీనీయుల పెద్దలును, యాజకులును లేవీయులును, ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరు వారితోకూడుకొని వచ్చి, యెరూషలేములోఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి.౹ 

6.మరియు వారి చుట్టు నున్నవారందరును స్వేచ్ఛగా అర్పించినవిగాక, వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి.౹ 

7.మరియు నెబుకద్నెజరు యెరూషలేములోనుండి తీసికొని వచ్చి తన దేవతలయొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములనురాజైన కోరెషు బయటికి తెప్పించెను.౹ 

8.పారసీకదేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతుద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి, యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను.౹ 

9.వాటియొక్క లెక్క  

       బంగారపు పళ్లెములు                            ౩౦
వెండి పళ్లెములు 1000
కత్తులు 29
10.బంగారుగిన్నెలు 30
వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలు 410
యితరమైన ఉపకరణములు 1000

11.బంగారు వస్తువులును వెండి వస్తువులును అన్నియు అయిదువేల నాలుగు వందలు. షేష్బజ్జరు బబులోను చెరలోనుండి విడిపింపబడినవారితోకూడ కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసికొని వచ్చెను.

ఎజ్రా 2  (వ్యక్తుల పేర్లు మరియు కుటుంబ పేర్లపై ప్రశ్నలు అడగబడవు. కానీ దయచేసి మీ స్వంత అవగాహన కోసం దాన్ని చదవండి)

1బబులోను రాజైన నెబుకద్నెజరుచేత బబులోను దేశమునకు చెరగా తీసికొని పోబడినవారికి ఆ దేశమందు పుట్టి చెరలోనుండి విడిపింపబడి. –35వ వచనం వరకు (క్విజ్లో చేర్చబడలేదు)

యాజకులు

(నెహెమ్యా 12:1-9)

36.యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల ఏబది ముగ్గురు 

37.ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు,౹ 

38.పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువదియేడుగురు,౹ 

39.హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడు గురు,౹ 

లేవీయులు,గాయకులు మరియు ద్వారపాలకులు

40.లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు,౹ 

41.గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు,౹ 

42.ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు,౹

ఆలయ సేవకులు

43.నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు, – 54వ వచనం వరకు (క్విజ్లో చేర్చబడలేదు).

సొలొమోను సేవకుల వారసులు

55.సొలొమోను సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు,౹ 

56.యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు,౹ 

57.షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయీము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమీ వంశస్థులు,౹ 

58.నెతీనీయులును సొలొమోను సేవకుల వంశస్థులును అందరును కలిసి మూడువందల తొంబది యిద్దరు.౹ 

59.మరియు తేల్మెలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలోనుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమపితరులయొక్క యింటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందునవారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను.౹ 

60.వారు ఎవరనగా దెలాయ్యా వంశస్థులు, టోబీయా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు ఆరువందల ఏబది యిద్దరు.౹

యాజకులు తొలగించబడుట

61.మరియు యాజకులలో హబాయ్యా వంశస్థులు, హాక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లయియొక్క కుమార్తెలలో ఒకతెను పెండ్లిచేసికొని వారి పేళ్లనుబట్టి బర్జిల్లయి అనిపిలువబడినవాని వంశస్థులు.౹ 

62.వీరు వంశావళి లెక్కలో తమతమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములోనుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచ బడిరి.౹ 

63.మరియు పారసీకుల అధికారి–ఊరీమును తుమ్మీమును ధరించుకొనగల యొక యాజకుడు ఏర్పడువరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికాజ్ఞాపించెను.౹ 

పూర్తి సంఖ్య మరియు వారి స్వాధీనములు

 64.సమాజముయొక్క లెక్క మొత్తము నలువది రెండువేల మూడువందల అరువదిమంది యాయెను.౹ 

65.వీరుగాక వీరి దాసులును దాసురాండ్రును ఏడువేల మూడువందల ముప్పదియేడుగురు. మరియు వారిలో గాయకులును గాయకురాండ్రును రెండువందలమంది యుండిరి.౹ 

66.వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది యారు, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదు,౹ 

67.వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదు, గాడిదలు ఆరువేల ఏడువందల ఇరువదియు ఉండెను.౹

ప్రవాసుల సమర్పణలు

68.కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములోనుండు యెహోవా మందిరమునకు వచ్చి, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి.౹ 

69.పని నెరవేర్చుటకు తమ శక్తికొలది ఖజానాకు పదునారువేల మూడువందల తులముల బంగారమును రెండులక్షల యేబది వేల తులముల వెండిని యాజకులకొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి.౹

70.యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును తమ పట్టణములకు వచ్చి కాపురముచేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమతమ పట్టణములందు కాపురము చేసిరి.

ఎజ్రా 3

బలిపీఠం పునర్నిర్మాణం

1.ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు తమతమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏకమనస్సు కలిగినవారై యెరూషలేములో కూడి,౹ 

2.యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులును లేచి, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి.౹ 

3.వారు దేశమందు కాపురస్థులైనవారికి భయపడుచు, ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి, దానిమీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహనబలులు అర్పించుచు వచ్చిరి 

4.మరియు గ్రంథమునుబట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి, ఏ దినమునకు నియమింపబడిన లెక్కచొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి.౹ 

5.తరువాత నిత్యమైన దహనబలిని, అమావాస్యలకును యెహోవాయొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహనబలులను, ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచు వచ్చిరి.౹ 

6.ఏడవ నెల మొదటి దినమునుండి యెహోవాకు దహనబలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరముయొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు.౹

దేవుని మందిరము యొక్క పునర్నిర్మాణం

7.మరియు వారు కాసెవారికిని వడ్రవారికిని ద్రవ్యము నిచ్చిరి. అదియుగాక పారసీకదేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రముమీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరువారికిని భోజనపదార్థములను పానమును నూనెను ఇచ్చిరి.

8.యెరూషలేములోనుండు దేవునియొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవనెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారుడైన యేషూవయును, చెరలోనుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చినవారందరును పని ఆరంభించి, యిరువది సంవత్సరములు మొదలుకొని పై యీడుగల లేవీయులను యెహోవా మందిరముయొక్క పనికి నిర్ణయించిరి.౹ 

9.యేషూవయు అతని కుమారులును అతని సహోదరులును, కద్మీయేలును అతని కుమారులును, హోదవ్యా కుమారులును, హేనాదాదు కుమారులును, వారి కుమారులును, లేవీయులైనవారి బంధువులును, దేవుని మందిరములో పనివారిచేత పనిచేయించుటకు నియమింపబడిరి.౹ 

10.శిల్పకారులు యెహోవా మందిరముయొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలురాజైన దావీదు నిర్ణయించిన విధిచొప్పున తమ వస్త్రములు ధరించుకొనినవారై యాజకులు బాకాలతోను, ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయితాళములతోను నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి 

11.వీరు వంతు చొప్పున కూడి–యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరముయొక్క పునాది వేయబడుట చూచి, జనులందరును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి.౹ 

12.మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు, ఇప్పుడు వేయబడిన యీ మందిరముయొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషముచేత బహుగా అరచిరి.౹ 

13.ఏది సంతోష శబ్దమో యేది దుఃఖశబ్దమో జనులు తెలిసికొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను.

ఎజ్రా 4

దేవుని మందిరము యొక్క పునర్నిర్మాణమునకు వ్యతిరేకత

1.అంతట యూదావంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైనవారు, చెరనివారణయయినవారు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని 

2.జెరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానులయొద్దకును వచ్చి–మీరు ఆశ్రయించునట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన ఏసర్హద్దోనుయొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించు వారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి.౹ 

3.అందుకు జెరుబ్బాబెలును యేషూవయు ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులును–మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు; మేమే కూడుకొని పారసీకదేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞప్రకారము ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదుమని వారితో చెప్పిరి.౹ 

4.దేశపు జనులు యూదావంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరచిరి.౹ 

5.మరియు పారసీకదేశపు రాజైన కోరెషుయొక్క దినములన్నిటిలోను పారసీకదేశపు రాజైన దర్యావేషుయొక్క పరిపాలనకాలమువరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి.౹ 

తరువాతి వ్యతిరేకత అహష్వేరోషు మరియు అర్తహషస్తయొక్క దినములలో

6.మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదాదేశస్థులనుగూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారిమీద తప్పు మోపిరి.

7.అర్తహషస్తయొక్క దినములలో బిష్లామును మిత్రి దాతును టాబెయేలును వారి పక్షముగానున్న తక్కినవారును పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసిపంపిరి. ఆ యుత్తరము సిరియాభాషలో వ్రాయబడి సిరియాభాషలోనే తాత్పర్యము చేయబడినది.౹ 

8.మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షిమ్షయియు ఈ ప్రకారముగా యెరూషలేము సంగతినిగూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్తహషస్తయొద్దకు పంపిరి.౹ 

9.అంతట మంత్రియగు రెహూమును లేఖకుడగు షిమ్షయియు వారి పక్షముగానున్న తక్కినవారైన దీనాయీయులును అపర్స త్కాయ్యులును టర్పెలాయేలును అపార్సాయులును అర్కెవాయులును బబులోనువారును షూషన్కాయులును దెహావేయులును ఏలామీయులును 

10.ఘనుడును, శ్రేష్ఠుడునైన ఆస్నప్పరు నది యివతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది యవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములును, నది యివతలనున్న తక్కినవారును ఉత్తరము ఒకటి వ్రాసిరి.౹ 

11.వీరు రాజైన అర్తహ షస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది యివతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయునదేమనగా 

12.తమ సన్నిధినుండి మాయొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి, తిరుగుబాటుచేసిన ఆ చెడుపట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు.౹ 

13.కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువ బెట్టినయెడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని యియ్యకయుందురు, అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును.౹ 

14.మేము రాజుయొక్క ఉప్పుతిన్నవారము గనుక రాజునకు నష్టమురాకుండ మేము చూడవలెనని ఈ యుత్తరమును పంపి రాజవైన తమకు ఈ సంగతి తెలియ జేసితిమి.౹ 

15.మరియు తమ పూర్వికులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచినయెడల, ఈ పట్టణపువారు తిరుగుబాటు చేయువారుగాను, రాజులకును దేశములకును హాని చేయువారుగాను, కలహకారులుగాను కనబడుదు రనియు, అందువలననే యీ పట్టణము నాశనము పొందెననియు రాజ్యపు దస్తావేజులవలననే తమకు తెలియ వచ్చును.౹ 

16.కావున రాజవైన తమకు మేము రూఢిపరచునదేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టబడినయెడల నది యివతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు.౹ 

17.అప్పుడు రాజు–మంత్రియగు రెహూమునకును లేఖకుడగు షిమ్షయికిని షోమ్రోనులో నివసించువారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యవతలనుండు తక్కినవారికిని–మీకు క్షేమసంప్రాప్తియగును గాక అని యీ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చిన దేమనగా 

18.–మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకొన్నాము.౹ 

19.అందువిషయమై మా యాజ్ఞనుబట్టి వెదకగా, ఆదినుండి ఆ పట్టణపువారు రాజులమీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది.౹ 

20.మరియు యెరూషలేముపట్టణమందు బలమైనరాజులు ప్రభుత్వము చేసిరి. వారు నది యవతలి దేశములన్నిటిని ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను.౹ 

21.కాబట్టి యిప్పుడు ఆ మనుష్యులు ఆ పని చాలించి, మేము సెలవిచ్చువరకు ఆ పట్టణమును కట్టక మానవలెనని ఆజ్ఞాపించుడి.౹ 

22.ఇది తప్పకుండ చేయుటకు మీరు జాగ్రత్తపడుడి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరుగకుండ చూడుడి అని సెలవిచ్చెను.౹ 

23.రాజైన అర్తహషస్త పంపించిన యుత్తరముయొక్క ప్రతి రెహూమునకును షిమ్షయికిని వీరిపక్షముగా నున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములోనున్న యూదులయొద్దకు వచ్చి, బలవంతముచేతను అధికారముచేతను వారు పని ఆపునట్లుచేయగా 

24.యెరూషలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగున పారసీకదేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరమువరకు ఆ పని నిలిచిపోయెను.

ఎజ్రా 5

రాజైన దర్యావేషునకు తత్తెనై ఉత్తరము

1.ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు యూదాదేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా 

2.షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బా బెలును యోజాదాకు కుమారుడైన యేషూవయునులేచి యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టనారం భించిరి. మరియు దేవునియొక్క ప్రవక్తలు వారితోకూడ నుండి సహాయము చేయుచువచ్చిరి.౹ 

3.అంతట నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షముననున్నవారును యూదులయొద్దకు వచ్చి–ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా 

4.ఈ కట్టడమును చేయించినవారి పేరులు మొదైలైన సంగతులను మేము వారితో చెప్పితిమి.౹ 

5.యూదుల దేవుడు వారి పెద్దలమీద తన దృష్టియుంచినందున ఆ సంగతినిగూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనొందువరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు.

6.నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బో జ్నయియును, నది యివతల నుండువారి పక్షముగానున్న అపర్సెకాయులును, రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు 

7.–రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తియగునుగాక.౹ 

8.రాజవైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశములోనికి వెళ్లితిమి, అక్కడ మహాదేవునియొక్క మందిరము ఉన్నది; అది గొప్ప రాళ్లచేత కట్టబడినది, గోడలలో మ్రానులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారిచేతిలో వృద్ధియగుచున్నది.౹ 

9.ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితిమి.౹ 

10.వారిలో అధికారులైన వారిపేళ్లు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పేళ్లను అడుగగా 

11.వారు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చిరి–మేము భూమ్యాకాశముల దేవునియొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీయులలో నొక గొప్పరాజు కట్టించి నిలిపిన మందిరమును మరల కట్టుచున్నాము.౹ 

12.మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరను బబులోను రాజుచేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనముచేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను.౹ 

13.అయితే బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను.౹ 

14.మరియు నెబుకద్నెజరు యెరూషలేమందున్న దేవాలయములోనుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములనురాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములోనుండి తెప్పించి 

15.తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అను నతనికి అప్పగించి– నీవు ఈ ఉపకరణములను తీసికొని యెరూషలేము పట్టణ మందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.

16.కాబట్టి ఆ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములోనుండు దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటినుండి నేటివరకు అది కట్టబడుచున్నను ఇంకను సమాప్తికాకుండ ఉన్నది.౹ 

17.కాబట్టి రాజవైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజుయొక్క ఖజానాలో వెదకించి, యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరెషు నిర్ణయముచేసెనో లేదో అది తెలిసికొని, రాజవైన తమరు ఆజ్ఞ ఇచ్చి యీ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయ గోరుచున్నాము.

ఎజ్రా 6

రాజైన దర్యావేషు ఆజ్ఞ 

1.అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజుకొట్టులో వెదకగా 

2.మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానాయను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడియున్న యీ సంగతి కనబడెను.

3.–రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములోఉండు దేవుని మందిరమునుగూర్చి నిర్ణయించినది–బలులు అర్పింపతగిన స్థలముగా మందిరముకట్టింపబడవలెను; దాని పునాదులు గట్టిగా వేయబడవలెను; దాని నిడివి అరువది మూరలును దాని వెడల్పు అరువది మూరలును ఉండవలెను;౹ 

4.మూడు వరుసలు గొప్ప రాళ్లచేతను ఒక వరుస క్రొత్త మ్రానులచేతను కట్టింపబడవలెను; దాని వ్యయమును రాజుయొక్క ఖజానాలోనుండి యియ్యవలెను.౹ 

5.మరియు యెరూషలేములోనున్న ఆలయములోనుండి నెబుకద్నెజరు బబులోనునకు తీసికొని వచ్చిన దేవుని మందిరముయొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి, యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి, దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను.

6.కావున రాజైన దర్యావేషు ఈలాగు సెలవిచ్చెను– నది యవతల అధికారియైన తత్తెనై అను నీవును, షెతర్బోజ్నయి అను నీవును నది యవతల మీతోకూడ నున్న అపర్సెకాయులును యూదులజోలికి పోక 

7.దేవుని మందిరపు పని జరుగనిచ్చి, వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింప నియ్యుడి.౹ 

8.మరియు దేవుని మందిరమును కట్టించునట్లుగా యూదులయొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమునుగూర్చి మేము నిర్ణయించినదేమనగా–రాజుయొక్క సొమ్ములోనుండి, అనగా నది యవతలనుండి వచ్చిన పన్నులోనుండి వారు చేయుపని నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసినదాని ఇయ్యవలెను.౹ 

9.మరియు ఆకాశమందలి దేవునికి దహనబలులు అర్పించుటకై కోడెలేగాని గొఱ్ఱెపొట్టేళ్లేగాని గొఱ్ఱెపిల్లలేగాని గోధుమలేగాని ఉప్పేగాని ద్రాక్షారసమేగాని నూనెయేగాని, యెరూషలేములోనున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనయైన అర్పణలను అర్పించి, రాజును అతని కుమారులును జీవించునట్లు ప్రార్థనచేయు నిమిత్తమై వారు చెప్పినదానినిబట్టి ప్రతిదినమును తప్పకుండ 

10.వారికి కావలసినదంతయు ఇయ్యవలెను.౹ 

11.ఇంకను మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరచినయెడల వాని యింటివెన్నుగాడి ఊడ దీయబడి నిలువనెత్తబడి దానిమీద వాడు ఉరితీయింపబడును, ఆ తప్పునుబట్టి వాని యిల్లు పెంటరాశి చేయబడును.౹ 

12.ఏ రాజులేగాని యేజనులేగాని యీ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యిచాపినయెడల, తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అను నేనే యీ ఆజ్ఞ ఇచ్చితిని. మరియు అది అతివేగముగా జరుగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను.

దేవుని మందిరము సమాప్తి మరియు అంకితం

13.అప్పుడు నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షమున నున్నవారునురాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞచొప్పున వేగముగా పని జరిపించిరి.౹ 

14.యూదుల పెద్దలు కట్టించుచు, ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ననుసరించి వారు కట్టించుచు, కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారసీకదేశపురాజుల ఆజ్ఞచొప్పున ఆ పని సమాప్తి చేసిరి.౹ 

15.రాజైన దర్యావేషు ఏలుబడియందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము సమాప్తి చేయబడెను.౹ 

16.అప్పుడు ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును చెరలోనుండి విడుదలనొందిన తక్కినవారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి.౹ 

17.దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగువందల గొఱ్ఱెపిల్లలను ఇశ్రాయేలీయులకందరికిని పాపపరిహారార్థబలిగా ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు మేకపోతులను అర్పించిరి.౹ 

18.మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషేయొక్క గ్రంథమందు వ్రాసిన దానినిబట్టి తరగతులచొప్పున యాజకులను వరుసలచొప్పున లేవీయులను నిర్ణయించిరి.

పస్కాపండుగ

19.చెరలోనుండి విడుదలనొందినవారు మొదటి నెల పదునాలుగవదినమున పస్కాపండుగ ఆచరించిరి.౹ 

20.యాజకులును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొని పవిత్రులైన తరువాత, చెరలోనుండి విడుదలనొందిన వారందరికొరకును తమ బంధువులైన యాజకులకొరకును తమకొరకును పస్కాపశువును వధించిరి.౹ 

21.కావున చెరలోనుండి విడుదలనొంది తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులును, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రతనుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరును వచ్చి,తిని పులియనిరొట్టెల పండుగను ఏడు దినములు ఆనందముతో ఆచరించిరి.౹ 

22.ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనివిషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరురాజు హృదయమునువారివైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను.

 

(గమనిక : ఇక్కడ గుర్తించబడిన తేదీలు మరియు సంవత్సరాలు బైబిలు గ్రంథము నుండి సమకూర్చబడలేదు ఇవి చాలా మంది బైబులు పండితులచే అంచనా వేయబడినవి . అందువల్ల క్విజ్ సిలబస్‌లో చేర్చబడలేదు )

(అదే సమయములో పారసీక దేశములోని స్థితిగతులు : తన వ్యక్తిని రాజు సంస్ధానములో స్థాపించాలన్న తన చర్యను దేవుడు నిర్దేశించాడు,ఈ దేవుని నిర్ణయమును సాతాను తన సొంత పథకం హామాను అనే వ్యక్తి ద్వారా సవాలు చేయడానికి ప్రయత్నించాడు.కానీ, మొర్దకై మరియు ఎస్తేరు నాయకత్వం ద్వారా దేవుని ప్రజలు, సాతాను యొక్క పథకాలను అధిగమించారు. – ఎస్తేరు గ్రంథములోని చరిత్ర ఇది. )

ఎస్తేరు 1 వ అధ్యాయము

రాణియైన వష్తియొక్క పదవీచ్యము

1.అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము : హిందూదేశము మొదలుకొని కూషు దేశమువరకు నూట ఇరువదియేడు సంస్థానములను అహష్వేరోషు ఏలెను.౹ 

2.ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలోనుండి రాజ్యపరిపాలన చేయుచుండగా 

3.తన యేలుబడియందు మూడవ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందుచేయించెను. పారసీక దేశముయొక్కయు మాద్య దేశముయొక్కయు పరాక్రమశాలులును ఘనులును సంస్థానాధిపతులును అతని సన్నిధి నుండగా 

4.అతడు తన మహిమగల రాజ్యముయొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు, అనగా నూట ఎనుబది దినములు కనుపరచెను.౹ 

5.ఆ దినములు గడచిన తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి ఘనులకేమి జనులకందరికిని రాజు కోటలోని తోట ఆవరణములో ఏడు దినములు విందుచేయించెను.౹ 

6.అక్కడ ధవళ ధూమ్రవర్ణములుగల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభములమీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్లు పరచిన నేలమీద వెండి బంగారుమయమైన జలతారుగల పరుపులుండెను.౹ 

7.అచ్చట కూడినవారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు, రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి.౹ 

8.ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటనుబట్టి యెవరును బలవంతము చేయలేదు; ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలెనని తన కోటపనివారికి రాజు ఆజ్ఞ నిచ్చి యుండెను.౹ 

9.రాణియైన వష్తి కూడ రాజైన అహష్వే రోషు కోటలో స్త్రీలకు ఒక విందుచేయించెను.

10.ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతో షముగా నున్నప్పుడు, కూడివచ్చిన జనమునకును, అధిపతులకును రాణియైన వష్తియొక్క సౌందర్యమును కనుపరచవలెనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు 

11.రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారముచేయు మెహూమాను బిజ్తా హర్బోనా బిగ్తా అబగ్తా జేతరు కర్కసు అను ఏడుగురు నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి.౹ 

12.రాణియైన వష్తి నపుంసకులచేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను, అతని కోపము రగులుకొనెను.౹ 

13.విధిని రాజ్యధర్మమును ఎరిగినవారందరిచేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనువాడు గనుక 

14.అతడు కాలజ్ఞానులను చూచి–రాణియైన వష్తి రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకులచేత ఇచ్చిన ఆజ్ఞప్రకారము చేయక పోయినందున ఆమెకు విధినిబట్టి చేయవలసినదేమని వారి నడిగెను.౹ 

15.అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు, రాజ్యమందు ప్రథమపీఠములమీద కూర్చుండు పారసీకులయొక్కయు మాదీయులయొక్కయు ఏడుగురు ప్రధానులు ఎవరనగా–కర్షెనా షెతారు అద్మాతా తర్షీషు మెరెసు మర్సెనా మెమూకాను అనువారు.౹ 

16.మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల యెదుటను ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను–రాణియైన వష్తి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషుయొక్క సకల సంస్థానములలోనుండు అధిపతులందరి యెడలను జనులందరియెడలను నేరస్థురాలాయెను.౹ 

17.ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణియైన వష్తిని తన సన్నిధికి పిలుచుకొని రావలెనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరు దాని విని, ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు.౹ 

18.మరియు పారసీకులయొక్కయు మాదీయులయొక్కయు నాయకపత్నులు రాణి చేసినదాని సమాచారము విని, రాణి పలికినట్లు ఈ దినమందు రాజుయొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును.౹ 

19.రాజునకు సమ్మతి ఆయెనా వష్తి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమయొద్దనుండి యొక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండునట్లు పారసీకులయొక్కయు మాదీయులయొక్కయు న్యాయముచొప్పున నియమింపవలెను. మరియు వష్తికంటె యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను.౹ 

20.మరియు రాజుచేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతట ప్రకటించినయెడల, ఘను రాలుగాని అల్పురాలుగాని స్త్రీలందరు తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను.౹ 

21.ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను.౹ 

22.ప్రతి పురుషుడు తన యింటిలో అధికారిగా నుండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభాషననుసరించి తన యింటివారితో మాటలాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాతప్రకారముగాను, ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించెను.

ఎస్తేరు 2వ అధ్యాయము 

ఎస్తేరు రాణిగా చేయబడుట

1.ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషుయొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్తిని ఆమె చేసినదానిని ఆమెకు నిర్ణయింపబడినదానిని తలంచగా 

2.యౌవనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి–అందమైన కన్యకలను రాజుకొరకు వెదకనగును,౹ 

3.అందునిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరిని సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజుయొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించునట్లు రాజు తన రాజ్యముయొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధికొరకు సుగంధద్రవ్యములను వారికిచ్చిన తరువాత 

4.రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వష్తికి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయెను గనుక అతడు ఆలాగు జరిగించెను.

5.షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దకై అను ఒక యూదుడుండెను.౹

6.బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకోన్యాను పట్టుకొనిపోయినప్పుడు ఇతడు యెకోన్యాతోకూడ యెరూషలేము నుండి చెరపట్టబడినవారిలో ఒకడు.౹ 

7.తన పినతండ్రి కుమార్తెయైన హదస్సా అను ఎస్తేరు తలిదండ్రులు లేనిదై యుండగా అతడామెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమునుగలదై యుండెను. ఆమె తలిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను.౹ 

8.రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురముచేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగుచేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, ఎస్తేరును రాజుయొక్క నగరునకు తేబడి, స్త్రీలను కాయు హేగేవశమునకు అప్పగింపబడెను.౹ 

9.ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతనివలన దయపొందెను; కాబట్టి ఆమె పరిమళక్రియలకొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజనపదార్థములను, రాజు ఇంటిలోనుండి ఆమెకు ఇయ్యదగిన యేడుగురు ఆడుపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్ఠమైన స్థలమందుంచెను.౹ 

10.మొర్దకై–నీ జాతిని నీ వంశమును కనుపరచ కూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించియుండెను గనుక ఆమె తెలుపలేదు.౹ 

11.ఎస్తేరు ఏలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలిసికొనుటకై అంతఃపురముయొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దకై తిరుగులాడు చుండెను.౹ 

12.ఆరుమాసములు గోపరస తైలముతోను, ఆరు మాసములు సుగంధవర్గములతోను, స్త్రీల పరిమళక్రియలకొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళక్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు. పండ్రెండు మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్లుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చి నప్పుడు ఒక్కొక చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను, ఏమనగా ఆ తీరునవారు పరిమళక్రియలు చేయుకాలము సంపూర్ణమగుచుండెను.౹ 

13.మరియు అంతఃపురములోనుండి రాజు ఇంటిలోనికి వెళ్లవలసిన సమయమందు ఆమె యేమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుటకద్దు.౹ 

14.సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్లి మరుదినము ఉపపత్నులను కాయు రాజుయొక్క షండుడైన షయష్గజు అను అతని వశములోనున్న రెండవ అంతఃపురమునకు తిరిగివచ్చును. ఆమెయందు రాజు సంతోషించి ఆమెను పేరుపెట్టి పిలిచితేనేగాని ఆమె రాజు నొద్దకు మరల వెళ్లకుండెను.౹ 

15.మొర్దకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రియైన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్లుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజుయొక్క షండుడైన హేగే నిర్ణ యించిన అలంకారముగాక ఆమె మరి ఏమియు కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికి ఆమెయందు దయపుట్టెను.౹ 

16.ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు ఏడవ సంవత్సరమున టెబేతు అను పదియవ నెలలో రాజ నగరులోనికి అతనియొద్దకు పోగా 

17.స్త్రీలందరికంటె రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటె ఆమె అతనివలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్యకిరీటమును ఆమె తలమీద ఉంచి ఆమెను వష్తికి బదులుగా రాణిగా నియమించెను.౹ 

18.అప్పుడు రాజు తన అధిపతులకందరికిని సేవకులకందరికిని ఎస్తేరు విషయమై యొక గొప్పవిందుచేయించి, సంస్థానములలో సెలవుదినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను.౹ 

మొర్దెకై కుట్రను బయటపెట్టుట

19.రెండవమారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దకై రాజు గుమ్మములో కూర్చుని యుండెను.౹ 

20.ఎస్తేరు మొర్దకైయొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక యుండెను.౹ 

21.ఆ దినములలో మొర్దకై రాజు గుమ్మములో కూర్చుని యుండగా రాజుయొక్క యిద్దరు షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలో చించుకొని యుండిరి.౹ 

22.ఈ సంగతి మొర్దకైకి తెలియబడి నందున అతడు దానిని రాణియైన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దకై పేరట రాజునకు దాని తెలియ జేసెను.౹ 

23.ఈ సంగతినిగూర్చి విచారణకాగా అది నిజ మాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్యసమాచార గ్రంథమందు వ్రాయబడెను.

ఎస్తేరు 3వ అధ్యాయము

యూదులను నాశనం చేయుటకు హామాను పన్నిన పధకం

1.ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరచి వాని హెచ్చించి, వాని పీఠమును తన దగ్గర నున్న అధిపతులందరికంటె ఎత్తుగా నుంచెను.౹ 

2.కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరును రాజాజ్ఞాను సారముగా మోకాళ్లూని హామానునకు నమస్కరించిరి. మొర్దకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా 

3.రాజు గుమ్మముననున్న రాజసేవకులు–నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దకైని అడిగిరి.౹ 

4.ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయెను గనుక వారు–మొర్దకైయొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు–నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి యుండెను.౹ 

5.మొర్దకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి 

6.మొర్దకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని యెంచి, మొర్దకైయొక్క జనులు ఎవరైనది తెలిసికొని, అహష్వేరోషుయొక్క రాజ్యమందంతటనుండు మొర్దకై స్వజనులగు యూదులనందరిని సంహరించుటకు ఆలో చించెను.౹ 

7.రాజైన అహష్వేరోషుయొక్క యేలుబడియందు పండ్రెండవ సంవత్సరమున నీసాను మాసమున, అనగా ప్రథమమాసమునవారు హామాను ఎదుట పూరు, అనగా చీటిని దినదినమునకును నెల నెలకును అదారు అను పండ్రెండవనెలవరకు వేయుచు వచ్చిరి.౹ 

8.అంతట హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా –మీ రాజ్య సంస్థా నములన్నిటియందుండు జనులలో ఒక జాతివారు చెదరి యున్నారు; వారి విధులు సకలజనుల విధులకు వేరుగా ఉన్నవి; వారు రాజుయొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు; కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు.౹ 

9.రాజునకు సమ్మతియైతే వారు హతము చేయబడునట్లును, నేను ఆ పనిచేయువారికి ఇరువదివేల మణుగుల వెండిని రాజుయొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును, చట్టము పుట్టించుమనగా 

10.రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామానున కిచ్చి 

11.–ఆ వెండి నీకియ్య బడియున్నది; నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి యున్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు.౹ 

12.మొదటి నెల పదమూడవ దినమందు రాజుయొక్క లేఖికులు పిలువబడిరి; హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానములమీద నుంచ బడిన రాజుయొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములలోని జనములమీద నుంచబడిన అధిపతులకును అధికారులకును, వారి వారి లిపినిబట్టియు, ఆయా జనములభాషనుబట్టియు, రాజైన అహష్వేరోషు పేరట ఆ లేఖికులచేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరముచేత ముద్రింపబడెను.౹ 

13.అదారు అను పండ్రెండవనెల పదమూడవ దినమందు యౌవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరిని ఒక్కదినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారిచేత రాజ్య సంస్థానములన్నిటికిని పంపబడెను.౹ 

14.మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను.౹ 

15.అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్లిరి. ఆయాజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను, దాని విని షూషను పట్టణము కలతపడెను. అంతట రాజును హామానును విందుకు కూర్చుండిరి.

ఎస్తేరు 4వ అధ్యాయము

మొర్దెకై ఎస్తేరును సహాయం చేయుటకు ఒప్పించుట

1.జరిగినదంతయు తెలియగానే మొర్దకై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసికొని బూడిదె పోసికొని పట్టణము మధ్యకు బయలువెళ్లి మహా శోకముతో రోద నముచేసి 

2.రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను; గోనె కట్టుకొనినవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు.౹ 

3.రాజుయొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాస ముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగినవారైరి, అనేకులు గోనెను బూడిదెను వేసికొని పడియుండిరి.౹ 

4.ఎస్తేరుయొక్క పనికత్తెలును ఆమెదగ్గరనున్న షండులును వచ్చి జరిగినదాని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై–మొర్దకై కట్టుకొని యున్న గోనెపట్టను తీసివేయుమని ఆజ్ఞ ఇచ్చి, కట్టించు కొనుటకై అతనియొద్దకు వస్త్రములు పంపెనుగాని అతడు వాటిని తీసికొనలేదు.౹ 

5.అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి యుండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి–అది ఏమియైనది, ఎందుకైనది తెలిసి కొనుటకు మొర్దకైయొద్దకు వెళ్లుమని ఆజ్ఞ నిచ్చెను.౹ 

6.హతాకు రాజు గుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండు మొర్దకైయొద్దకు పోగా 

7.మొర్దకై తనకు సంభవించిన దంతయు, యూదులను నాశనము చేయుటకుగాను హామాను వారినిబట్టి రాజు ఖజానాకు తూచి యిచ్చెదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత యనియును అతనికి తెలిపి 

8.–వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియు, ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతనియొద్దకు పోవలెనని చెప్పుమనియు దాని నతని కిచ్చెను. హతాకు వచ్చి మొర్దకైయొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను.౹ 

9.అంతట ఎస్తేరు మొర్దకైతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చిన దేమనగా 

10-11.–పిలువబడక పురుషుడేగాని స్త్రీయేగాని రాజుయొక్క అంతర్గృహమున ప్రవేశించినయెడల బ్రదుకునట్లుగా రాజు తన బంగారపుదండమును ఎవరితట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకందరికిని అతని సంస్థానములలోనున్న జనులకందరికిని తెలిసే యున్నది. నేటికి ముప్పది దినములనుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను.౹ 

12.వారు ఎస్తేరుయొక్క మాటలు మొర్దకైకి తెలుపగా 

13.మొర్దకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తర మిచ్చి– రాజ నగరులో ఉన్నంతమాత్రముచేత యూదులందరికంటె నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు;౹ 

14.నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్నయెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కునుండి వచ్చును గాని, నీవును నీ తండ్రి యింటివారును నశించుదురు. నీవు ఈ సమయమునుబట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను.౹ 

15.అప్పుడు ఎస్తేరు మొర్దకైతో మరల ఇట్లనెను.౹ 

16.–నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరిని సమాజమందిరమునకు సమకూర్చి, నా నిమిత్తము ఉపవాసముండి మూడుదినములు అన్నపానములు చేయకుండుడి; నేనును నా పని కత్తెలును కూడ ఉపవాసముందుము; ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును; నేను నశించిన నశించెదను.౹ 

17.అటువలెనే మొర్దకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన యంతటి ప్రకారముగా జరిగించెను.

ఎస్తేరు 5వ అధ్యాయము

రాజునకు ఎస్తేరు యొక్క అభ్యర్థన

1.మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని, రాజునగరుయొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనముమీద రాజు కూర్చుని యుండెను.౹ 

2.రాణియైన ఎస్తేరు ఆవరణములో నిలువబడి యుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలోనుండు బంగారపు దండమును ఎస్తేరుతట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండముయొక్క కొన ముట్టెను.౹ 

3.రాజు – రాణియైన ఎస్తేరూ, నీకేమి కావలెను? నీ మనవి యేమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకను గ్రహించెదనని ఆమెతో చెప్పగా 

4.ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినయెడల నేను రాజుకొరకు సిద్ధము చేయించిన విందునకు రాజవైన తామును హామానును నేడు రావలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను.౹ 

5.ఎస్తేరు మాటప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టుమని రాజు సెలవియ్యగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి.౹ 

6.రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక యేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? అది రాజ్యములో సగముమట్టుకైనను చేయబడునని చెప్పగా 

7.ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను– రాజవైన తమ దృష్టికి నా యెడల దయకలిగి నా మనవి చొప్పునను నా కోరికచొప్పునను జరిగించుట రాజవైన తమకు అనుకూలమైతే 

8.రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును; ఇదే నా మనవియు నా కోరికయుననెను.౹

మొర్దెకై పై హామాను యొక్క ఆగ్రహం

9.ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసముగలవాడై బయలువెళ్లి, రాజుగుమ్మముననుండు మొర్దకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దకైమీద బహుగా కోపగించెను.౹ 

10.అయితే హామాను కోపము అణచుకొని తన యింటికిపోయి తన స్నేహితులను తన భార్యయైన జెరెషును పిలిపించి 

11.తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమునుగూర్చియు, చాలామంది పిల్లలు తనకుండుటనుగూర్చియు, రాజు తన్ను ఘనపరచి రాజు క్రిందనుండు అధిపతులమీదను సేవకులమీదను తన్ను ఏలాగున పెద్దగాచేసెనో దానిని గూర్చియు వారితో మాటలాడెను.౹ 

12.మరియు అతడు–రాణియైన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి యెవనిని పిలిపించలేదు, రేపటి దినమున కూడ రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను.౹ 

13.అయితే యూదుడైన మొర్దకై రాజుగుమ్మమున కూర్చునియుండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటివలన నాకు ప్రయోజన మేమియు లేదని అతడు చెప్పగా 

14.అతని భార్యయైన జెరెషును అతని స్నేహితులందరును–ఏబది మూరల ఎత్తుగల యొక ఉరికొయ్య చేయించుము; దాని మీద మొర్దకై ఉరితీయింపబడునట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము; తరువాత నీవు సంతోషముగా రాజుతోకూడ విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య యొకటి సిద్ధము చేయించెను.

ఎస్తేరు 6వ అధ్యాయము

మొర్దెకై గౌరవించబడుట

1.ఆ రాత్రి నిద్రపట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను.౹ 

2.ద్వారపాలకులైన బిగ్తాను తెరెషు అను రాజుయొక్క యిద్దరు నపుంసకులురాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దకై తెలిపినట్టు అందులో వ్రాయబడి యుండెను.౹ 

3.రాజు ఆ సంగతి విని–ఇందు నిమిత్తము మొర్దకైకి బహుమతి యేదై నను ఘనత యేదైనను చేయబడెనా అని యడుగగా రాజు సేవకులు–అతనికేమియు చేయబడలేదని ప్రత్యుత్తర మిచ్చిరి.౹ 

4.అప్పుడు–ఆవరణములో ఎవరో యున్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్యమీద మొర్దకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరుయొక్క ఆవరణములోనికి వచ్చియుండెను.౹ 

5.రాజ సేవకులు–ఏలినవాడా చిత్తగించుము, హామాను ఆవరణములో నిలువబడియున్నాడని రాజుతో చెప్పగా రాజు–అతని రానియ్యుడని సెలవిచ్చి నందున హామాను లోపలికి వచ్చెను.౹ 

6.–రాజు ఘనపరచ నపేక్షించువానికి ఏమిచేయవలెనని రాజు అతని నడుగగా హామాను–నన్ను గాక మరి ఎవరిని రాజు ఘనపరచ నపే క్షించునని తనలో తాననుకొని రాజుతో ఇట్లనెను 

7.–రాజు ఘనపరచ నపేక్షించువానికి చేయ తగినదేమనగా 

8.రాజు ధరించుకొను రాజవస్త్రములను రాజు ఎక్కు గుఱ్ఱమును రాజు తన తలమీద ఉంచుకొను రాజకిరీటమును ఒకడు తీసికొని రాగా 

9.ఘనులైన రాజుయొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుఱ్ఱమును పట్టుకొని, రాజు ఘనపరచ నపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింప జేసి ఆ గుఱ్ఱముమీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు–రాజు ఘనపరచ నపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయతగునని అతనిముందర చాటింపవలెను.౹ 

10.అందుకు రాజు–నీవు చెప్పినప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుఱ్ఱమును తీసికొని, రాజు గుమ్మమునొద్ద కూర్చునియున్న యూదుడైన మొర్దకైకి ఆలాగుననే చేయుము; నీవు చెప్పినదానిలో ఒకటియు విడువక అంతయు చేయుమని హామానునకు ఆజ్ఞ ఇచ్చెను.౹ 

11.ఆప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుఱ్ఱమును తీసికొని, మొర్దకైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుఱ్ఱము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు, రాజు ఘనపరచ నపేక్షించువానికి ఈ ప్రకారము చేయ తగునని అతనిముందర చాటించెను.౹ 

12.తరువాత మొర్దకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను; అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన యింటికి త్వరగా వెళ్లి పోయెను.౹ 

13.హామాను తనకు సంభవించినదంతయు తన భార్యయైన జెరెషుకును తన స్నేహితులకందరికిని తెలు పగా, అతనియొద్దనున్న జ్ఞానులును అతని భార్యయైన జెరెషును–ఎవనిచేత నీకు అధికారనష్టము కలుగుచున్నదో ఆ మొర్దకై యూదుల వంశపువాడైనయెడల అతనిమీద నీకు జయము కలుగదు, అతనిచేత అవశ్యముగా చెడి పోదువని ఆతనితో అనిరి.౹ 

14.వారు ఇంక మాటలాడుచుండగా రాజుయొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి.

ఎస్తేరు 7వ అధ్యాయము

హామానును ఉరితీయుట

1.రాజును హామానును రాణియైన ఎస్తేరునొద్దకు విందునకు రాగా 

2.రాజు–ఎస్తేరు రాణీ, నీ విజ్ఞాపన మేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? రాజ్యములో సగముమట్టుకైనను నీకనుగ్రహించెదనని రెండవ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను.

3.అప్పుడు రాణియైన ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను –రాజా, నీ దృష్టికి నేను దయపొందినదాననైనయెడల రాజవైన తమకు సమ్మతియైతే, నా విజ్ఞాపననుబట్టి నా ప్రాణమును, నా మనవినిబట్టి నా జనులును, నా కనుగ్ర హింపబడుదురు గాక.౹ 

4.సంహరింపబడుటకును, హతము చేయబడి నశించుటకును, నేనును నా జనులును కూడ అమ్మబడినవారము. మేము దాసులముగాను దాసు రాండ్రముగాను అమ్మబడినయెడల నేను మౌనముగా నుందును; ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజవగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు.౹ 

5.అందుకు రాజైన అహష్వేరోషు–ఈ కార్యము చేయుటకు తన మనస్సు దృఢపరచుకొన్నవాడెవడు? వాడేడి? అని రాణియగు ఎస్తేరు నడుగగా 

6.ఎస్తేరు–మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన యీ హామానే అనెను. అంతట హామాను రాజు ఎదుటను రాణి యెదుటను భయాక్రాంతుడాయెను.౹ 

7.రాజు ఆగ్రహమొంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హానిచేయనుద్దేశించెనని హామాను తెలిసికొని, రాణియైన ఎస్తేరు ఎదుట తన ప్రాణముకొరకు విన్నపము చేయుటకై నిలిచెను.౹ 

8.నగరు వనములోనుండి ద్రాక్షారసపు విందుస్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండియున్న శయ్యమీద హామాను బడియుండుట చూచి–వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా? అని చెప్పెను; ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుకు వేసిరి.౹ 

9.రాజు ముందరనుండు షండులలో హర్బోనా అనునొకడు–ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలుకొరకు మాటలాడిన మొర్దకైని ఉరితీయుటకు హామాను చేయించిన యేబది మూరల యెత్తు గల ఉరికొయ్య హామాను ఇంటియొద్ద నాటబడి యున్న దనగా రాజు–దానిమీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను.౹ 

10.కాగా హామాను మొర్దకైకి సిద్ధముచేసిన ఉరి కొయ్యమీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజుయొక్క ఆగ్రహము చల్లారెను.

ఎస్తేరు 8వ అధ్యాయము

యూదుల కొరకు రాజు యొక్క శాసనం

1.ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణియైన ఎస్తేరున కిచ్చెను. ఎస్తేరు మొర్దకై తనకు ఏమి కావలెనో రాజునకు తెలియ జేసినమీదట అతడు రాజు సన్నిధికి రాగా 

2.రాజు హామాను చేతిలోనుండి తీసికొనిన తన ఉంగరమును మొర్దకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను.౹ 

3.మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసికొని, అతని పాదములమీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా 

4.రాజు బంగారు దండమును ఎస్తేరుతట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి 

5.– రాజవైన తమకు సమ్మతియైనయెడలను, తమ దృష్టికి నేను దయపొందినదాననై రాజవైన తమ యెదుట ఈ సంగతి యుక్తముగా తోచినయెడలను, తమ దృష్టికి నేను ఇంపైన దాననైనయెడలను, రాజవైన తమ సకల సంస్థానములలో నుండు యూదులను నాశనముచేయవలెనని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదులచొప్పున జరుగకుండునట్లు వాటిని రద్దుచేయుటకు ఆజ్ఞ ఇయ్యుడి.౹ 

6.నా జనులమీదికి రాబోవు కీడును, నా వంశముయొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింపగలనని మనవిచేయగా 

7.రాజైన అహష్వేరోషు రాణియైన ఎస్తేరునకును యూదుడైన మొర్దకైకిని ఈలాగు సెలవిచ్చెను–హామాను ఇంటిని ఎస్తేరున కిచ్చియున్నాను; అతడు యూదులను హతముచేయుటకు ప్రయత్నించి నందున అతడు ఉరికొయ్యమీద ఉరితీయబడెను.౹ 

8.అయితే రాజుపేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింప బడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు; కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాని ముద్రించుడి.

9.సీవాను అను మూడవ నెలలో ఇరువది మూడవ దినమందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; మొర్దకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును, హిందూ దేశము మొదలుకొని కూషుదేశమువరకు వ్యాపించియున్న నూట ఇరువదియేడు సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతనుబట్టియు దాని దాని భాషనుబట్టియు తాకీదులు వ్రాయబడెను.౹ 

10.రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుఱ్ఱములమీద, అనగా రాజనగరుపనికి పెంచబడిన బీజాశ్వములమీద అంచెగాండ్ర నెక్కించి ఆ తాకీ దులను వారిచేత పంపెను.౹ 

11.రాజైన అహష్వేరోషుయొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే, అనగా అదారు అను పండ్రెండవనెల పదమూడవ దినమందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని, తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశములలోనుండి తమకు విరోధులగు జనుల సైనికులనందరిని, శిశువులను స్త్రీలను కూడ, సంహరించి హతముచేసి నిర్మూల పరచి 

12.వారి వస్తువులను కొల్లపట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చెనని దానియందు వ్రాయబడెను.౹ 

13.మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానములలోని జనులకందరికి పంపించవలెననియు, యూదులు తమ శత్రువులమీద పగతీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలెననియు ఆజ్ఞ ఇయ్యబడెను.౹ 

14.రాజ నగరు పనికి పెంచబడిన బీజాశ్వములమీద నెక్కిన అంచె గాండ్రు రాజు మాటవలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను.౹ 

యూదుల విజయం

15.అప్పుడు మొర్దకై ఊదావర్ణమును తెలుపువర్ణమునుగల రాజవస్త్రమును బంగారపు పెద్దకిరీటమును అవిసె నారతో చేయబడిన ధూమ్రవర్ణముగల వస్త్రములను ధరించుకొనినవాడై రాజుసముఖమునుండి బయలుదేరెను; అందునిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోష మొందెను.౹ 

16.మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను.౹ 

17.రాజుచేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను, అది శుభదినమని విందుచేసికొనిరి. మరియు దేశజనులలో యూదులయెడల భయముకలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి.

ఎస్తేరు 9వ అధ్యాయము

1.రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను పండ్రెండవనెల పదమూడవదినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను.౹ 

2.యూదులురాజైన అహష్వేరోషుయొక్క సంస్థానములన్నిటిలో నుండు పట్టణములయందు తమకు కీడుచేయవలెనని చూచినవారిని హతముచేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలువలేకపోయిరి.౹ 

3.మొర్దకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానములయొక్క అధిపతులును అధికారులును ప్రభువులును రాజు పని నడిపించువారును యూదులకు సహాయముచేసిరి.౹ 

4.మొర్దకై రాజుయొక్క నగరులో గొప్పవాడాయెను. ఈ మొర్దకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుటచేత అతని కీర్తి సంస్థానములన్నిటియందు వ్యాపించెను.౹ 

5.యూదులు తమ శత్రువులనందరిని కత్తివాత హతముచేసి వారిని నాశనముచేసి మనస్సు తీర తమ విరోధులకు చేసిరి.౹ 

6.షూషను కోటయందు యూదులు ఐదువందలమందిని చంపి నాశనముచేసిరి.౹ 

7.హమ్మెదాతా కుమారుడై యూదులకు శత్రువగు హామానుయొక్క పదిమంది కుమారులైన పర్షందాతా 

8.దల్పోను అస్పాతా పోరాతా 

9.అదల్యా అరీదాతా పర్మష్తా 

10.అరీసై అరీదై వైజాతా అను వారిని చంపిరి; అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు.౹ 

11.ఆ దినమున షూషను కోటయందు చంపబడినవారి లెక్క రాజునకు తెలియ జెప్పగా 

12.రాజు రాణియైన ఎస్తేరుతో–యూదులు షూషను కోటయందు ఐదువందలమందిని హామానుయొక్క పదిమంది కుమారులను బొత్తిగా నాశనము చేసియున్నారు; రాజుయొక్క కొదువ సంస్థానములలో వారు ఏమిచేసి యుందురో; ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకనుగ్ర హింపబడును, నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయబడునని సెలవియ్యగా 

13.ఎస్తేరు–రాజవైన తమకు సమ్మతమైనయెడల ఈ దినము జరిగిన చొప్పున షూషనునందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామానుయొక్క పదిమంది కుమారులు ఉరికొయ్యమీద ఉరితీయింపబడునట్లుగాను సెలవియ్యుడనెను.౹ 

14.ఆలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను; హామానుయొక్క పదిమంది కుమారులు ఉరి తీయింపబడిరి.౹ 

15.షూషనునందున్న యూదులు అదారు మాసమున పదు నాలుగవ దినమందు కూడుకొని, షూషనునందు మూడు వందలమందిని చంపివేసిరి; అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు.౹ 

16.రాజు సంస్థానములయందుండు తక్కిన యూదులు కూడుకొని, తమ ప్రాణములను రక్షించు కొనుటకై పూనుకొని అదారు మాసము పదమూడవ దినమందు తమ విరోధులలో డెబ్బది యయిదువేలమందిని చంపివేసి, తమ పగవారివలన బాధలేకుండ నెమ్మదిపొందిరి; అయితే వారును కొల్లసొమ్ముపట్టుకొనలేదు.౹ 

17.పదునాలుగవ దినమందును వారు నెమ్మదిపొంది విందుచేసికొనుచు సంతో షముగా నుండిరి.౹ 

18.షూషనునందున్న యూదులు ఆ మాసమందు పదమూడవ దినమందును పదునాలుగవ దినమందును కూడుకొని పదునైదవ దినమందు నెమ్మదిపొంది విందుచేసికొనుచు సంతోషముగా నుండిరి.౹ 

19.కాబట్టి ప్రాకారములులేని ఊళ్లలో కాపురమున్న గ్రామవాసు లైన యూదులు అదారు మాసము పదునాలుగవ దినమందు సంతోషముగానుండి–అది విందుచేయదగిన శుభదినమను కొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి.

పూరీము స్థాపించబడింది

20.మొర్దకై యీ సంగతులనుగూర్చి రాజైన అహష్వే రోషుయొక్క సంస్థానములన్నిటికి సమీపముననేమి దూరముననేమి నివసించియున్న యూదులకందరికి పత్రికలను పంపి 

21.–యూదులు తమ పగవారిచేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదిన మనియు, ప్రతి సంవత్సరము అదారు నెలయొక్క పదు నాలుగవదినమును పదునైదవ దినమును వారు ఆచరించుకొనుచు 

22.విందుచేసికొనుచు సంతోషముగానుండి ఒకరి కొకరు బహుమానములను, దరిద్రులకు కానుకలను, పంప తగిన దినములనియు వారికి స్థిరపరచెను.౹ 

23.అప్పుడు యూదులు తాము ఆరంభించినదానిని మొర్దకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని యొప్పుకొనిరి.౹ 

24.యూదులకు శత్రువగు హమ్మెదాతా కుమారుడైన అగా గీయుడగు హామాను యూదులను సంహరింప దలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలెనని, పూరు, అనగా చీటి, వేయించియుండగా 

25.ఎస్తేరు, రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తల పెట్టిన చెడుయోచన తన తలమీదికే వచ్చునట్లుగా చేసి,వాడును వాని కుమారులును ఉరికొయ్యమీద ఉరితీయబడునట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను.౹ 

26.కావున ఆ దినములు పూరు అను పేరునుబట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటినిబట్టియు, ఈ సంగతినిబట్టియు, తాము చూచినదానినంతటినిబట్టియు తమమీదికి వచ్చినదానినిబట్టియు 

27.యూదులు ఈ రెండు దినములనుగూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమునుబట్టి వాటిని ఆచరించెదమనియు, ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోను ప్రతి సంస్థానములోను ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడునట్లుగా ఆచరించెదమనియు,౹ 

28.పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు, తమ సంతతివారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని, ఆ సంగతిని మరచి పోకుండునట్లు, తమమీదను, తమ సంతతివారిమీదను, తమతో కలిసికొనిన వారిమీదను ఇది యొక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి.౹ 

29.అప్పుడు పూరీమునుగూర్చి వ్రాయబడిన యీ రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహాయిలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దకైయును ఖండితముగా వ్రాయించిరి.౹ 

30.మరియు యూదుడైన మొర్దకైయును రాణియైన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానినిబట్టి వారు ఉపవాస విలాపకాలములు ఏర్పరచుకొని, అది తమమీదను తమ వంశపు వారిమీదను ఒక బాధ్యతయని యెంచుకొని వాటిని జరిగించెదమని యొప్పుకొనిన ప్రకారముగా 

31.ఈ పూరీము అను పండుగదినములను స్థిరపరచుటకు అతడు అహష్వే రోషుయొక్క రాజ్యమందుండు నూట ఇరువదియేడు సంస్థానములలోనున్న యూదులకందరికి వారి క్షేమము కోరునట్టియు, విశ్వాసార్థములగునట్టియు మాటలుగల పత్రికలు పంపెను.౹ 

32.ఈలాగున ఎస్తేరుయొక్క ఆజ్ఞచేత ఈ పూరీముయొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను.

ఎస్తేరు 10వ అధ్యాయము

మొర్దెకై యొక్క గొప్పతనం

1.రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములును పన్ను చెల్లింప నిర్ణయించెను.౹ 

2.మొర్దకైయొక్క బలమునుగూర్చియు, అతడు సామర్థ్యముచేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు, రాజు అతనిని ఘనపరచిన సంగతిని గూర్చియు మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు రాజ్యసమాచార గ్రంథమందు వ్రాయబడియున్నది.౹ 

3.యూదుడైన మొర్దకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగానుండి, తనవారందరితో సమాధానముగా మాటలాడుచు, తన జనులయొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడుగా ఉండెను.

Related Quiz Articles