బైబిలు గ్రంధములోని ప్రతిజ్ఞలు

ప్రసంగి 5 : 4 నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము; బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు.౹ 

5.నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొనకుండుటయే మేలు.౹ 

6.నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటివలన జరుగనియ్యకుము; అది పొరపాటుచేత జరిగెనని దూత యెదుట చెప్పకుము; నీ మాటలవలన దేవునికి కోపము పుట్టించి నీవేల నీ కష్టమును వ్యర్థపరచుకొనెదవు? 

7.అధికమైన స్వప్నములును మాటలును నిష్‌ప్రయోజనములు; నీమట్టుకు నీవు దేవునియందు భయభక్తులు కలిగియుండుము.

ద్వితీయోపదేశకాండము 12 : 4 వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవానుగూర్చి చేయకూడదు.౹ 

5.మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్ప రచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను.౹ 

6.అక్కడికే మీరు మీ దహనబలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్ఠితములుగా మీరుచేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొఱ్ఱె మేకలలోను తొలిచూలువాటిని తీసికొని రావలెను.౹ 

ద్వితీయోపదేశకాండము 23 : 21 నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీవలన దాని రాబట్టుకొనును, అది నీకు పాపమగును.౹ 

22.నీవు మ్రొక్కు కొననియెడల నీయందు ఆ పాపముండదు.౹ 

23.నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని, నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను.

మ్రొక్కుబడులు నెరవేర్చమని దేవుడు చెప్పుట:

కీర్తనలు 50 : 7 నా జనులారా, నేను మాటలాడబోవుచున్నాను ఆలకించుడి ఇశ్రాయేలూ, ఆలకింపుము నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికెదను

8.నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహనబలులు నిత్యము నాయెదుట కనబడుచున్నవి.

9.నీ యింటనుండి కోడెనైనను నీ మందలోనుండి పొట్టేళ్లనైనను నేను తీసికొనను.

10.అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా

11.కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి.

12.లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను.

13.వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా?

14.దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.

15.ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పరచెదవు.

మోషే ధర్మశాస్త్రములో మ్రొక్కుబడులు

నాజీరగుటకు మ్రొక్కుబడులు:

సంఖ్యాకాండము 6 

1.మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము.౹ 

2.పురుషుడేగాని స్త్రీయేగాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్నుతాను ప్రత్యేకించుకొనినయెడలవాడు ద్రాక్షారస మద్యములను మానవలెను.౹ 

3.ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు; ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు; పచ్చివిగాని యెండినవిగాని ద్రాక్షపండ్లను తినవలదు.౹ 

4.అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నియు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టినదేదియు తినవలదు.౹ 

5.అతడు నాజీ రగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగలకత్తి అతని తలమీద వేయవలదు, అతడు యెహోవాకు తన్నుతాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరువరకు అతడు ప్రతిష్ఠితుడై తన తలవెండ్రుకలను ఎదుగనియ్యవలెను.౹ 

6.అతడు యెహోవాకు ప్రత్యేకముగానుండు దినములన్ని టిలో ఏ శవమును ముట్టవలదు.౹ 

7.తన దేవునికి మీదు కట్టబడిన తలవెండ్రుకలు అతని తలమీదనుండును గనుక అతని తండ్రిగాని తల్లిగాని సహోదరుడుగాని సహోదరిగాని చనిపోయినను వారినిబట్టి అతడు తన్నుతాను అపవిత్రపరచుకొనవలదు.౹ 

8.అతడు ప్రత్యేకముగాఉండు దినములన్నియు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును.౹ 

9.ఒకడు అతనియొద్ద హఠాత్తుగా చనిపోవుటవలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరపబడినయెడల అతడు పవిత్రపరపబడు దినమున, అనగా ఏడవదినమున తనతల గొరిగించుకొనవలెను.౹ 

10.ఎనిమిదవదినమున అతడు రెండు తెల్లగువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న యాజకునియొద్దకు తేవలెను.౹ 

11.అప్పుడు యాజకుడు ఒకదానితో పాపపరిహారార్థబలిని రెండవదానితో దహన బలిని అర్పించి,వాడు శవము ముట్టుటవలన పాపి యైనందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరపవలెను.౹ 

12.మరియు తాను ప్రత్యేకముగాఉండు దినములను మరల యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధపరిహారార్థబలిగా ఏడాది గొఱ్ఱెపిల్లను తీసికొని రావలెను; తన వ్రతసంబంధమైన తలవెండ్రుకలు అపవిత్రపరపబడెను గనుకమునుపటి దినములు వ్యర్థమైనవి.

13.నాజీరు ప్రత్యేకముగాఉండు దినములు నిండిన తరువాత వానిగూర్చిన విధి యేదనగా, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు వానిని తీసికొని రావలెను.౹ 

14.అప్పుడతడు దహనబలిగాను నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగాను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱెపిల్లను, సమాధాన బలిగాను నిర్దోషమైన యొక పొట్టేలును,౹ 

15.గంపెడు పొంగని పిండి, అనగా గోధుమపిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా యెహోవాయొద్దకు తేవలెను.౹ 

16.అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పింపవలెను.౹ 

17.యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధానబలిగా అర్పింపవలెను; వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను.౹ 

18.అప్పుడా నాజీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద తన వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు గొరిగించుకొని, ఆ వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు తీసికొని, సమాధానబలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను.౹ 

19.మరియు యాజకుడు ఆ పొట్టేలుయొక్క వండిన జబ్బను ఆ గంపలోనుండి పొంగని యొక భక్ష్యమును పొంగని యొక పూరీని తీసికొని నాజీరు తన వ్రతసంబంధమైన వెండ్రుకలు గొరికించుకొనిన పిమ్మట అతనిచేతులమీద వాటి నుంచవలెను.౹ 

20.తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోను ప్రతిష్ఠితమైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠితమగును; తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును.౹ 

21.మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు, అతడు నాజీరైయున్నందున యెహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున నాజీరునుగూర్చిన విధిని బట్టి ఇదియంతయు చేయవలెనని చెప్పుము.

సంఖ్యాకాండము 30

1.మోషే ఇశ్రాయేలీయులయొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను 

2.–ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనినయెడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసినయెడల, అతడు తన మాటతప్పక తన నోటనుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను.౹

స్త్రీల యొక్క మ్రొక్కుబడులు

3-6.మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి యింటనుండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురా లైనయెడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగజేసికొనిన బాధ్యతను విని దానిగూర్చి ఊరకొనినయెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినినదినమున ఆక్షేపణచేసినయెడల, ఆమె మ్రొక్కుబడులలో ఏదియు, ఆమె తనమీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలువకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.౹ 

7.ఆమెకు వివాహమైన తరువాత ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లయినను, నిరాలోచనగా ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమెమీదనుండుట ఆమె భర్త విని, దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించినయెడల, ఆమె మ్రొక్కుబళ్లును ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును.౹ 

8.ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసినయెడల, అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తనమీద పెట్టుకొనిన ఒట్టులను రద్దుచేసినవాడగును; యెహోవా ఆమెను క్షమించును.౹ 

9.విధవరాలుగాని విడనాడబడినదిగాని తనమీద పెట్టుకొనిన ప్రతి మ్రొక్కుబడి నిలుచును.౹ 

10.ఆమె తన భర్తయింట ఉండి మ్రొక్కుకొనినయెడలనేమి, ప్రమాణముచేసి తనమీద ఒట్టు పెట్టుకొనినయెడలనేమి, 

11.తరువాత ఆమె భర్త విని దానిగూర్చి ఆక్షేపణచేయక ఊరకుండినయెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును; ఆమె తనమీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును.౹ 

12.ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసినయెడల, ఆమె మ్రొక్కుబళ్లనుగూర్చియు, ఆమె మీది ఒట్టునుగూర్చియు ఆమె పలికినదేదియు నిలువక పోవును; ఆమెభర్త వాటిని రద్దుచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.౹ 

13.ప్రతి మ్రొక్కుబడిని, తన్నుతాను దుఃఖపరచుకొందునని ప్రమాణపూర్వకముగా తనమీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచ వచ్చును, రద్దుచేయవచ్చును.౹ 

14.అయితే ఆమె భర్త నానాట దానిగూర్చి ఊరకొనుచు వచ్చినయెడల,వాడు ఆమెమీదనున్న ఆమె మ్రొక్కుబడులన్నిటిని ఆమె ఒట్టులన్నిటిని స్థిరపరచినవాడగును. అతడు వినిన దినమున దానిగూర్చి ఊరకుండుటవలన వాటిని స్థిరపరచెను.౹ 

15.అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దుచేసినయెడల, తానే ఆమె దోషశిక్షను భరించును.౹ 

16.ఇవి భర్తనుగూర్చియు, భార్యనుగూర్చియు, తండ్రినిగూర్చియు, బాల్యమున తండ్రి యింటనున్న కుమార్తెనుగూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు.

మ్రొక్కుబడిని విమోచించుట:

దేవునికి ప్రతిష్ఠించినవి విమోచించుట:

లేవీయకాండము 27 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను 

2.–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసినయెడల నీవు నిర్ణయించిన వెలచొప్పునవారు యెహోవాకు దాని చెల్లింపవలెను.౹ 

3.నీవు నిర్ణయింపవలసిన వెల యేదనగా, ఇరువది ఏండ్లు మొదలుకొని అరువది ఏండ్ల వయస్సువరకు మగవానికి పరిశుద్ధస్థలముయొక్క తులమువంటి యేబది తులముల వెండి నిర్ణయింపవలెను.౹ 

4.ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను.౹ 

5.అయిదేండ్లు మొదలుకొని యిరువది ఏండ్లలోపలి వయస్సుగల మగవానికి ఇరువది తులముల వెలను, ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను.౹ 

6.ఒక నెల మొదలుకొని అయిదేండ్లలోపలి వయస్సుగల మగవానికి అయిదు తులముల వెండి వెలను ఆడుదానికి మూడు తులముల వెండి వెలను నిర్ణయింపవలెను.౹ 

7.అరువది ఏండ్ల ప్రాయముదాటిన మగవానికి పదునైదు తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను.౹ 

8.ఒకడు నీవు నిర్ణయించినవెలను చెల్లింపలేనంత బీదవాడైనయెడల అతడు యాజకుని యెదుట నిలువవలెను; అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మ్రొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను.

9.యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతిదానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను.౹ 

10.అట్టిదానిని మార్చకూడదు; చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొకదానిని ఇయ్యకూడదు. పశువుకు పశువును మార్చినయెడల అదియు దానికి మారుగా ఇచ్చి నదియు ప్రతిష్ఠితమగును.౹ 

11.జనులు యెహోవాకు అర్పింప కూడని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చినయెడల ఆ జంతువును యాజకుని యెదుట నిలువబెట్టవలెను.౹ 

12.అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును.౹ 

13.అయితే ఒకడు అట్టిదానిని విడిపింప గోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు వానితో కలుపవలెను.

14.ఒకడు తన యిల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించినయెడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును.౹ 

15.తన యిల్లు ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరినయెడల అతడు నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు దానితో కలుపవలెను; అప్పుడు ఆ యిల్లు అతనిదగును.

16.ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించినయెడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. పందుము యవల విత్తనములు ఏబది తులముల వెండి వెలగలది.౹ 

17.అతడు సునాదసంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించినయెడల నీవు నిర్ణయించు వెల స్థిరము.౹ 

18.సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించినయెడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున, అనగా మరుసటి సునాదసంవత్సరమువరకు వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను.౹ 

19.పొలమును ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవ వంతును అతడు దానితో కలుపవలెను. అప్పుడు అది అతనిదగును.౹ 

20.అతడు ఆ పొలమును విడిపింపనియెడలను వేరొకనికి దాని అమ్మినయెడలను మరి ఎన్నటికిని దాని విడిపింప వీలుకాదు.౹ 

21.ఆ పొలము సునాదసంవత్సరమున విడుదలకాగా అది ప్రతిష్ఠించిన పొలమువలె యెహోవాకు ప్రతిష్ఠితమగును; ఆ స్వాస్థ్యము యాజకునిదగును.౹ 

22.ఒకడు తాను కొనిన పొలమును, అనగా తన స్వాస్థ్యములో చేరనిదానిని యెహోవాకు ప్రతిష్ఠించినయెడల 

23.యాజకుడు సునాదసంవత్సరమువరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేరచొప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలెను.౹ 

24.సునాదసంవత్సరమున ఆ భూమి యెవని పిత్రార్జితమైనదో వానికి, అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగిరావలెను.౹ 

25.నీ వెలలన్నియు పరిశుద్ధ స్థలముయొక్క వెలచొప్పున నిర్ణయింపవలెను. ఒక తులము ఇరువది చిన్నములు.

26.అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక యెవడును దాని ప్రతిష్ఠింపకూడదు; అది ఎద్దయిననేమి గొఱ్ఱెమేకల మందలోనిదైననేమి యెహోవాదగును.౹ 

27.అది అపవిత్రజంతువైనయెడలవాడు నీవు నిర్ణయించు వెలలో అయిదవవంతు దానితో కలిపి దాని విడిపింప వచ్చును. దాని విడిపింపనియెడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను.

28.అయితే మనుష్యులలోగాని జంతువులలోగాని స్వాస్థ్యమైన పొలములలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించినయెడల ప్రతిష్ఠించినదానిని అమ్మకూడదు, విడిపింపనుకూడదు, ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును.౹

29.మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను.

యెఫ్తా యొక్క మ్రొక్కు బడి

న్యాయాధిపతులు 11

1.గిలాదువాడైన యెఫ్తా పరాక్రమముగల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు; గిలాదు యెఫ్తాను కనెను.౹ 

2.గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్ద వారై యెఫ్తాతో–నీవు అన్యస్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రియింట నీకు స్వాస్థ్యము లేదనిరి.౹ 

3.యెఫ్తా తన సహోదరులయొద్దనుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరిజనము యెఫ్తాయొద్దకు వచ్చి అతనితోకూడ సంచరించుచుండెను.

4.కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా 

5.అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున 

6.గిలాదు పెద్దలు టోబుదేశమునుండి యెఫ్తాను రప్పించుటకు పోయి–నీవు వచ్చి మాకు అధిపతివై యుండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్పిరి.౹ 

7.అందుకు యెఫ్తా–మీరు నాయందు పగపెట్టి నా తండ్రి యింటనుండి నన్ను తోలివేసితిరే. ఇప్పుడు మీకు కలిగినశ్రమలో మీరు నాయొద్దకు రానేల? అని గిలాదు పెద్దలతో చెప్పెను.౹ 

8.అప్పుడు గిలాదు పెద్దలు–అందుచేతనే మేము నీయొద్దకు మళ్లి వచ్చితిమి; నీవు మాతోకూడ వచ్చి అమ్మోనీయులతో యుద్ధముచేసినయెడల, గిలాదు నివాసులమైన మా అందరిమీద నీవు అధికారివవుదువని యెఫ్తాతో అనిరి.౹ 

9.అందుకు యెఫ్తా–అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసికొనిపోయినమీదట యెహోవావారిని నా చేతి కప్పగించినయెడల నేనే మీకు ప్రధానుడనవుదునా? అని గిలాదు పెద్దల నడుగగా 

10.గిలాదు పెద్దలు–నిశ్చయముగా మేము నీ మాటచొప్పున చేయుదుము; యెహోవా మన యుభయులమధ్యను సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అనిరి.౹ 

11.కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతోకూడ పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి యంతయు వినిపించెను.

12.యెఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలనుపంపి– నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదికి యుద్ధమునకు వచ్చియున్నావని యడుగగా 

13.అమ్మోనీయుల రాజు–ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దానువరకును నా దేశము ఆక్రమించుకొని నందుననే నేను వచ్చియున్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండునట్లు ఆ దేశములను మరల మాకప్పగించుమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను.౹ 

14.అంతట యెఫ్తా మరల అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి యిట్లనెను 

15.–యెఫ్తా సెలవిచ్చినదేమనగా–ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు.౹ 

16.ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు ఎఱ్ఱసముద్రమువరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి.౹ 

17.అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజునొద్దకు దూతలను పంపి –నీ దేశము గుండ పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని యడుగగా, ఎదోమురాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరిగాని అతడును–నేను సెలవియ్యనని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేషులో నివసించిరి.౹ 

18.తరువాత వారు అరణ్యప్రయాణముచేయుచు ఎదోమీయులయొక్కయు మోయాబీయులయొక్కయు దేశముల చుట్టు తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దుగదా.౹ 

19.మరియు ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోనను హెష్బోను రాజునొద్దకు దూతలను పంపి–నీ దేశముగుండ మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతనియొద్ద మనవిచేయగా 

20.సీహోను ఇశ్రాయేలీయులను నమ్మక, తన దేశములోబడి వెళ్లనియ్యక, తన జనులనందరిని సమకూర్చుకొని యాహసులో దిగి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసెను.౹ 

21.అప్పుడు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలీయుల చేతి కప్పగింపగా వారు ఆ జనమును హతముచేసిన తరువాత ఆ దేశనివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరచుకొని 

22.అర్నోను నది మొదలుకొని యబ్బోకువరకును అరణ్యము మొదలుకొని యొర్దానువరకును అమోరీయుల ప్రాంతములన్నిటిని స్వాధీనపరచుకొనిరి.౹ 

23.కాబట్టి ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా అమోరీయులను తన జనులయెదుట నిలువకుండ తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించు కొందువా? 

24.స్వాధీన పరచుకొనుటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవనుభవించుచున్నావుగదా? మా దేవుడైన యెహోవా మా యెదుటనుండి యెవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకొందుము.౹ 

25.మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకుకంటె నీవు ఏమాత్రమును అధికుడవు కావుగదా? అతడు ఇశ్రాయేలీయులతో ఎప్పుడైనను కలహించెనా? ఎప్పుడైనను వారితో యుద్ధము చేసెనా? 

26.ఇశ్రాయేలీయులు హెష్బోనులోను దాని ఊరులలోను అరోయేరులోను దాని ఊరులలోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను మూడు వందల సంవత్సరములనుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేల వాటిని పట్టుకొనలేదు? 

27.ఇట్లుండగా నేను నీ యెడల తప్పు చేయలేదుగాని నీవు నామీదికి యుద్ధమునకు వచ్చుటవలన నాయెడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతియైన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీయులకును న్యాయము తీర్చును గాక.౹ 

28.అయితే అమ్మోనీయులరాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు.

29.యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు, గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పేనుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను.౹ 

30.అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కు కొనెను, ఎట్లనగా–నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినయెడల 

31.నేను అమ్మోనీయులయొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా యింటిద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు దహనబలిగా దాని నర్పించెదననెను.౹ 

32.అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారియొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతనిచేతికి వారినప్పగించెను గనుక అతడు వారిని 

33.అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చువరకు ఆబేల్కెరామీమువరకును ఇరువది పట్టణముల వారిని నిశ్శేషముగా హతముచేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల యెదుట నిలువకుండ అణచి వేయబడిరి.

34.యెఫ్తా మిస్పాలోనున్న తన యింటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోను నాట్యముతోను బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమేగాని ఆడుసంతానమేగానిలేదు.౹ 

35.కాబట్టి అతడు ఆమెను చూచి, తన బట్టలను చింపుకొని–అయ్యో నా కుమారీ, నీవు నన్ను బహుగా క్రుంగచేసితివి, నీవు నన్ను తల్లడింపచేయువారిలో ఒకతెవైయున్నావు; నేను యెహోవాకు మాట యిచ్చియున్నాను గనుక వెనుకతీయ లేననగా 

36.ఆమె–నా తండ్రీ, యెహోవాకు మాట యిచ్చి యుంటివా? నీ నోటినుండి బయలుదేరిన మాటచొప్పున నాకు చేయుము; యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయులమీద పగతీర్చుకొని యున్నాడని అతనితోననెను.౹ 

37.మరియు ఆమె–నాకొరకు చేయవలసినదేదనగా రెండు నెలలవరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలును పోయి కొండలమీద ఉండి, నా కన్యాత్వమునుగూర్చి ప్రలాపించెదనని తండ్రితో చెప్పగా 

38.అతడు పొమ్మనిచెప్పి రెండు నెలలవరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతోకూడ పోయి కొండలమీద తన కన్యాత్వమునుగూర్చి ప్రలాపించెను.౹ 

39.ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రియొద్దకు తిరిగిరాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిచొప్పున ఆమెకు చేసెను.౹ 

40.ఆమె పురుషుని ఎరుగనేలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు నాలుగు దినములు గిలాదుదేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధిచేయుటకద్దు.

సమ్సోను మ్రొక్కుబడి

సమ్సోను యొక్క జననం:

న్యాయాధిపతులు 13 ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా నలువది సంవత్సరములు వారిని ఫిలిష్తీయులచేతికి అప్పగించెను.

2.ఆ కాలమున దానువంశస్థుడును జొర్యాపట్టణస్థుడునైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను.౹ 

3.యెహోవాదూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై–ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపులేకపోయెను; అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు.౹ 

4.కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము.౹ 

5.నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తలమీద మంగలకత్తి వేయకూడదు; ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా 

సమ్సోను యొక్క ప్రతిజ్ఞ భంగము మరియు అతని పతనము

న్యాయాధిపతులు 16 : 15 అప్పుడు ఆమె–నాయందు నీకిష్టము లేనప్పుడు –నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పు చున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళిచేసి నీ గొప్పబలము దేనిలోనున్నదో నాకు తెలుపక పోతివని అతనితో అనెను.౹ 

16.ఆమె అనుదినమును మాటలచేత అతని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను.౹ 

17.అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి–నేను నా తల్లిగర్భమునుండి పుట్టి నది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనై యున్నాను, నా తలమీదికి మంగలకత్తి రాలేదు, నాకు క్షౌరముచేసినయెడల నా బలము నాలోనుండి తొలగి పోయి యితర మనుష్యులవలె అవుదునని ఆమెతో అనెను.౹ 

18.అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా యెరిగి, ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి–యీసారికి రండి; ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపెననెను. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయిలను చేతపట్టుకొని ఆమెయొద్దకు రాగా 

19.ఆమె తన తొడమీద అతని నిద్రబుచ్చి, ఒక మనుష్యుని పిలిపించి వానిచేత అతని తలమీదియేడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలోనుండి బలము తొలగిపోయెను.౹ 

20.ఆమె–సమ్సోనూ, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారనగా అతడు నిద్రమేలుకొని–యెప్పటియట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు.౹

రాజైన సౌలు యొక్క మ్రొక్కుబడి

1 సమూయేలు 14 : 24–నేను నా శత్రువులమీద పగ తీర్చుకొనకమునుపు, సాయంత్రము కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనులచేత ప్రమాణము చేయించెను, అందువలన జనులు ఏమియు తినకుండిరి.౹ 

25.జనులందరు ఒక అడవిలోనికి రాగా అక్కడ నేలమీద తేనె కనబడెను.౹ 

26.జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టియుండెనుగాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోటపెట్టలేదు.౹ 

27.అయితే యోనాతాను తన తండ్రి జనులచేత చేయించిన ప్రమాణము వినలేదు. గనుక తన చేతికఱ్ఱ చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను.౹ 

28.జనులలో ఒకడు–నీ తండ్రి జనులచేత ప్రమాణము చేయించి–ఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించియున్నాడు; అందుచేతనే జనులు బహు బడలియున్నారని చెప్పెను.౹ 

29.అందుకు యోనాతాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయెను; నేను ఈ తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి 

30.జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనముచేసినయెడల వారు ఫిలిష్తీయులను మరి అధికముగా హతము చేసియుందురనెను.౹ 

31.ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మషునుండి అయ్యాలోనువరకు హతముచేయగా జనులు బహు బడలిక నొందిరి.౹ 

32.జనులు దోపుడుమీద ఎగబడి, గొఱ్ఱెలను ఎడ్లను పెయ్యలను తీసికొని నేలమీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున 

33.–జనులు రక్తముతోనేతిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు–మీరు విశ్వాసఘాతకులైతిరి; పెద్ద రాయి యొకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి 

34.–మీరు అక్కడక్కడికి జనులమధ్యకు పోయి, అందరు తమ యెద్దులను తమ గొఱ్ఱెలను నాయొద్దకు తీసికొనివచ్చి యిక్కడ వధించి భక్షింపవలెను; రక్తముతో మాంసముతిని యెహోవా దృష్టికి పాపము చేయకుడని వారితో చెప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరు ఆ రాత్రి తమతమ యెద్దులను తీసికొని వచ్చి అక్కడ వధించిరి.౹ 

35.మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే.

36.అంతట–మనము రాత్రియందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారువరకు వారిని కలతపెట్టి, శేషించు వాడొకడునులేకుండ చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులు –నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి. అంతట సౌలు–యాజకుడు ఇక్కడనే యున్నాడు, దేవునియొద్ద విచారణ చేయుదము రండని చెప్పి 

37.సౌలు–ఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయినయెడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారి నప్పగింతువా అని దేవునియొద్ద విచారణ చేయగా, ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యక యుండెను.౹ 

38.అందువలన సౌలు–జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరివలన ఈ పాపము కలిగెనో అది విచారింపవలెను.౹ 

39.నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీయులను రక్షించు యెహోవా జీవముతోడని నేను ప్రమాణము చేయుచున్నాననెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చినవాడు ఒకడును లేకపోయెను.౹ 

40.–మీరు ఒకతట్టునను నేనును నా కుమారుడగు యోనాతానును ఒకతట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులు–నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి.౹ 

41.అప్పుడు సౌలు–ఇశ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా, దోషిని కనుపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటిపడెనుగాని జనులు తప్పించుకొనిరి.౹ 

42.–నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరట చీటి పడెను.౹ 

43.–నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతాను–నా చేతికఱ్ఱకొనతో కొంచెము తేనె పుచ్చుకొన్న మాట వాస్తవమే; కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను.౹ 

44.అందుకు సౌలు–యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు, నేను ఒప్పుకొనని యెడల దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయునుగాక అనెను.౹ 

45.అయితే జనులు సౌలుతో–ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగ జేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినికూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను; యెహోవా జీవముతోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.౹ 

46.అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని వెళ్లిపోగా ఫిలిష్తీయులు తమ స్థలమునకు వెళ్లిరి.

యాకోబు యొక్క మ్రొక్కుబడి

ఆదికాండము 28 : 10-11యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారానువైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను.౹ 

12.అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి.౹ 

13.మరియు యెహోవా దానికి పైగా నిలిచి–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను.౹ 

14.నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును; నీవు పడమటితట్టును తూర్పుతట్టును ఉత్తరపుతట్టును దక్షిణపుతట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును.౹ 

15.ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా 

16.యాకోబు నిద్ర తెలిసి–నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని 

17.భయపడి–ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమేగాని వేరొకటికాదు; పరలోకపు గవిని ఇదే అనుకొనెను.౹ 

18.తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.౹ 

19.మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు.౹ 

20-21.అప్పుడు యాకోబు–నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసినయెడల యెహోవా నాకు దేవుడైయుండును.౹ 

22.మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను.

గిబియోనీయుల ప్రతీకారం

2 సమూయేలు 21 : 1దావీదు కాలమున మూడు సంవత్సరములు విడువకుండ కరవుకలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను–సౌలు గిబియోనీయులను హతముచేసెను గనుక అతనినిబట్టియు, నరహంతకులగు అతని యింటివారినిబట్టియు శిక్షగా ఈ కరవు కలిగెను.౹ 

2.గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించినవారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరిగాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారియందు ఆసక్తిగలవాడై వారిని హతము చేయ చూచుచుండెను.౹ 

3.రాజగు దావీదు గిబియోనీయులను పిలువనంపి–నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించునట్లు దోష నివృత్తికై దేనిచేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా 

4.గిబియోనీయులు–సౌలు అతని యింటివారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులేగాని ఇశ్రాయేలీయులలో ఎవరినైనను చంపుటయేగాని మేము కోరుట లేదనిరి. అంతట దావీదు మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదు ననగా 

5.వారు–మాకు శత్రువులై మమ్మును నాశనముచేయుచు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో ఉండకుండ మేము లయమగునట్లు మాకు హానిచేయనుద్దేశించినవాని కుమారులలో ఏడుగురిని మాకప్పగించుము.౹ 

6.యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదమని రాజుతో మనవిచేయగా రాజు–నేను వారిని అప్పగించెదననెను.౹ 

7.తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమునుబట్టి ప్రమాణము చేసియున్న హేతువుచేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషె తును అప్పగింపక 

8.అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన యిద్దరు కుమారులగు అర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెయగు మెరాబు మెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలునకు కనిన అయిదుగురు కుమారులను పట్టుకొని గిబియోనీయుల కప్పగించెను.౹ 

9.వారు ఈ యేడుగురిని తీసికొనిపోయి కొండమీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ యేడుగురు ఏకరీతినే చంపబడిరి; కోతకాలమున యవలకోత యారంభమందువారు మరణమైరి.౹ 

10.అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసికొని కొండపైన పరచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశమునుండి వర్షము ఆ కళేబరములమీద కురియువరకు అచ్చటనేయుండి, పగలు ఆకాశపక్షులు వాటిమీద వాలకుండను రాత్రి అడవిమృగములు దగ్గరకు రాకుండను వాటిని కాచుచుండగా 

11.అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను.౹ 

12.కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారియొద్దనుండి తెప్పించెను. ఫిలిష్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా యాబే ష్గిలాదువారు వారి యెముకలను అచ్చటనుండి దొంగిలి తెచ్చి యుండిరి.౹ 

13.కావున దావీదు వారియొద్దనుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను, రాజాజ్ఞనుబట్టి ఉరితీయబడినవారి యెముకలను జనులు సమకూర్చిరి.౹ 

14.సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధియందు పాతిపెట్టిరి. రాజు ఈలాగు చేసిన తరువాత దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడంగీకరించెను.

గిబియోనీయుల ప్రతిజ్ఞ – వివరణ

యెహోషువ 9

1.యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అనువారి రాజులందరు జరిగినదానిని వినినప్పుడు 

2.వారు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను యుద్ధము చేయుటకు కూడివచ్చిరి.౹ 

3.యెహోషువ యెరికోకును హాయికిని చేసినదానిని గిబియోను నివాసులు వినినప్పుడు 

4.వారు కపటోపాయము చేసి, రాయబారులమని వేషము వేసికొని బయలుదేరి, తమ గాడిదలకు పాత గోనెలుకట్టి పాతగిలి చినిగి కుట్ట బడియున్న ద్రాక్షారసపు సిద్దెలు తీసికొని 

5.పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాతబట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నియు ఎండిన ముక్కలుగా నుండెను.౹ 

6.వారు గిల్గాలునందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి–మేము దూరదేశమునుండి వచ్చినవారము, మాతో నొక నిబంధనచేయుడని అతనితోను ఇశ్రాయేలీయులతోను చెప్పగా 

7.ఇశ్రాయేలీయులు–మీరు మామధ్యను నివసించుచున్నవారేమో, మేము మీతో ఏలాగు నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో ననిరి.౹ 

8.వారు–మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ–మీరు ఎవరు? ఎక్కడనుండి వచ్చితిరి? అని వారి నడుగగా 

9.వారు–నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి నీ దాసులమైన మేము బహుదూరమునుండి వచ్చితిమి; ఏలయనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యొర్దానుకు అద్దరినున్న 

10.హెష్బోనురాజైన సీహోను, అష్తారోతులోనున్న బాషానురాజైన ఓగు అను అమోరీయుల యిద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి.౹ 

11.అప్పుడు మా పెద్దలును మా దేశ నివాసులందరును మాతో–మీరు ప్రయాణముకొరకు ఆహారము చేతపట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితో–మేము మీ దాసులము గనుక మాతో నిబంధనచేయుడి అని చెప్పుడి అనిరి.౹ 

12.మీ యొద్దకు రావలెనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా యిండ్లనుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే, యిప్పటికి అవి యెండి ముక్కలాయెను.౹ 

13.ఈ ద్రాక్షారసపు సిద్దెలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, యిప్పటికి అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలును చెప్పులును పాతగిలిపోయెనని అతనితో చెప్పిరి.౹ 

14.ఇశ్రాయేలీయులు యెహోవాచేత సెలవుపొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా 

15.యెహోషువ ఆ వచ్చినవారితో సమాధానపడి వారిని బ్రదుకనిచ్చుటకు వారితో నిబంధనచేసెను. మరియు సమాజప్రధానులు వారితో ప్రమాణము చేసిరి.౹ 

16.అయితే వారితో నిబంధన చేసి మూడుదినములైన తరువాత, వారు తమకు పొరుగు వారు, తమ నడుమను నివసించువారే యని తెలిసికొనిరి.

17.ఇశ్రాయేలీయులు సాగి మూడవనాడు వారి పట్టణములకు వచ్చిరి; వారి పట్టణములు గిబియోను కెఫీరా బెయే రోతు కిర్యత్యారీము అనునవి.౹ 

18.సమాజ ప్రధానులు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాతోడని వారితో ప్రమాణము చేసియుండిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొఱ్ఱపెట్టిరి.౹ 

19.అందుకు సమాజ ప్రధానులందరు సర్వసమాజముతో ఇట్లనిరి–మనము ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాతోడని వారితో ప్రమాణము చేసితిమి గనుక మనము వారికి హానిచేయకూడదు.౹ 

20.మనము వారితో చేసిన ప్రమాణమువలన మనమీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమునుబట్టి వారిని బ్రదుక నియ్యవలెనని చెప్పి 

21.వారిని బ్రదుకనియ్యుడని సెలవిచ్చిరి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లువారు సర్వసమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి.౹ 

22.మరియు యెహోషువ వారిని పిలిపించి యిట్లనెను–మీరు మామధ్యను నివసించువారై యుండియు–మేము మీకు బహు దూరముగా నున్న వారమని చెప్పి మమ్ము నేల మోసపుచ్చితిరి? 

23.ఆ హేతువుచేతను మీరు శాపగ్రస్తులగుదురు, దాస్యము మీకెన్నడును మానదు, నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై యుండకమానరు.౹ 

24.అందుకు వారు యెహోషువను చూచి–నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి, మీ యెదుట నిలువకుండ ఈ దేశనివాసులనందరిని నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించెనని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయములో నీవలన మిక్కిలి భయపడి యీలాగు చేసితిమి.౹ 

25.కాబట్టి మేము నీ వశముననున్నాము; మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో యేది మంచిదో అదే చేయుమని యెహోషువకు ఉత్తరమిచ్చిరి.౹ 

26.కాగా అతడు ఆలాగు చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండ వారి చేతులలోనుండి విడిపించెను.౹ 

27.అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటుననుండు బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటివరకు వారు ఆ పని చేయువారై యున్నారు.

సమూయేలు మీద హన్నా యొక్క మ్రొక్కుబడి

1 సమూయేలు 1 : 1ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్టణపువాడు ఒకడుండెను; అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయీమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు, అతనికి ఇద్దరు భార్యలుండిరి.౹ 

2.వీరిలో ఒకదాని పేరు హన్నా రెండవదాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరిగాని హన్నాకు పిల్లలులేకపోయిరి.౹ 

3.ఇతడు షిలోహునందున్న సైన్యములకధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీయొక్క యిద్దరు కుమారులగు హొప్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి.౹ 

4.ఎల్కానా తాను బల్యర్పణ చేసిననాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్లు ఇచ్చుచు వచ్చెనుగాని 

5.హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు రెండుపాళ్లు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతులేకుండచేసెను.౹ 

6.యెహోవా ఆమెకు సంతులేకుండ చేసియున్న హేతువునుబట్టి, ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై, ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను.౹ 

7.ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచు నుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునపుడెల్ల అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను.౹ 

8.ఆమె పెనిమిటియైన ఎల్కానా–హన్నా, నీ వెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఏల? నీకు మనో విచారమెందుకు కలిగినది? పదిమంది కుమాళ్లకంటె నేను నీకు విశేషమైనవాడను కానా? అని ఆమెతో చెప్పుచు వచ్చెను.౹ 

9.వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనముమీద కూర్చునియుండగా 

10.బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థనచేయుచు బహుగా ఏడ్చుచు 

11.–సైన్యములకధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్నశ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసి కొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను,౹ 

12.ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను.౹ 

13.ఆమె పెదవులుమాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడక యుండెను గనుక ఏలీ ఆమె మత్తురాలై యున్నదనుకొని 

14.–ఎంతవరకు నీవు మత్తురాలవై యుందువు? నీవు ద్రాక్షారసమును నీయొద్దనుండి తీసివేయుమని చెప్పగా 

15.హన్నా–అది కాదు, నా యేలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయ లేదుగాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను.౹ 

16.నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు; అత్యంతమైన కోపకారణమునుబట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పు కొనుచుంటిననెను.౹ 

17.అంతట ఏలీ–నీవు క్షేమముగా వెళ్లుము; ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా 

18.ఆమె అతనితో–నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనముచేయుచు నాటనుండి దుఃఖముఖిగా నుండుట మానెను.౹ 

19.తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ యింటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసికొనెను 

20.గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని–నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను.౹ 

21.ఎల్కానాయును అతనియింటి వారందరును యెహోవాకు ఏటేట అర్పించు బలినర్పించుటకును మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయిరి.౹ 

22.అయితే హన్నా–బిడ్డ పాలు విడుచువరకు నేను రాను; వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసికొనివత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్లక యుండెను.౹ 

23.కాబట్టి ఆమె పెనిమిటియైన ఎల్కానా–నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము; నీవు వానికి పాలు మాన్పించువరకు నిలిచి యుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనేయుండి తన కుమారునికి పాలు మాన్పించువరకు అతని పెంచుచుండెను.౹ 

24.పాలు మాన్పించిన తరువాత అతడు ఇంక చిన్నవాడై యుండగా ఆమె ఆ బాలుని ఎత్తికొని మూడు కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసికొని షిలోహులోని మందిరమునకు వచ్చెను.౹ 

25.వారు ఒక కోడెను వధించి, పిల్లవానిని ఏలీయొద్దకు తీసికొనివచ్చి నప్పుడు ఆమె అతనితో ఇట్లనెను 

26.–నా యేలినవాడా, నా యేలినవాని ప్రాణముతోడు, నీయొద్దనిలిచి, యెహోవాను ప్రార్థనచేసిన స్త్రీని నేనే.౹ 

27.ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నా కనుగ్రహించెను.౹ 

28.కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను; తాను బ్రదుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను.

తన మ్రొక్కుబడులను నెరవేరుస్తాననిన యోనా వాగ్దానం

యోనా 2:

1.ఆ మత్స్యము కడుపులోనుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను.౹ 

2.–నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములోనుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు.౹ 

3.నీవు నన్ను అగాధమైన సముద్రగర్భములో పడవేసి యున్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి, నీ తరంగములును నీ కరుళ్లును నన్ను కప్పియున్నవి.౹ 

4.నీ సన్నిధిలోనుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాల యముతట్టు మరల చూచెదననుకొంటిని.౹ 

5.ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొనియున్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించియున్నది. సముద్రపు నాచు నా తలకుచుట్టుకొని యున్నది.౹ 

6.నేను మరెన్న టికిని ఎక్కిరాకుండ భూమి గడియలు వేయబడియున్నవి; పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను, నా దేవా, యెహోవా, నీవు నా ప్రాణము కూపములోనుండి పైకి రప్పించియున్నావు.౹ 

7.కూపములోనుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసికొంటిని; నీ పరిశుద్ధాలయములోనికి నీయొద్దకు నా మనవి వచ్చెను.౹ 

8.అసత్యమైన వ్యర్థదేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు.౹ 

9.కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులనర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవాయొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించెను.౹ 

10.అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేలమీద కక్కివేసెను.

పౌలు యొక్క మ్రొక్కుబడి

అపొస్తలుల కార్యములు 18 : 18 పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరులయొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నందున కెంక్రేయలో తల వెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితోకూడ వెళ్లిరి.౹ 

అపొస్తలుల కార్యములు 21 : 17 మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మును సంతోషముతో చేర్చుకొనిరి.౹ 

18.మరునాడు పెద్దలందరు అక్కడికి వచ్చియుండగా పౌలు మాతోకూడ యాకోబునొద్దకు వచ్చెను.౹ 

19.అతడు వారిని కుశల మడిగి, తన పరిచర్యవలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను.౹ 

20.వారు విని దేవుని మహిమపరచి అతని చూచి–సహోదరుడా, యూదులలో విశ్వాసులైనవారు ఎన్ని వేలమంది యున్నారో చూచుచున్నావుగదా? వారందరును ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు.౹ 

21.అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడువకూడదనియు నీవు చెప్పుటవలన వారందరు మోషేను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్నుగూర్చి వర్తమానము వినియున్నారు.౹ 

22.కావున మన మేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు.౹ 

23.కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము. మ్రొక్కుబడియున్న నలుగురు మనుష్యులు మాయొద్ద ఉన్నారు.౹ 

24.నీవు వారిని వెంటబెట్టుకొనిపోయి వారితోకూడ శుద్ధిచేసికొని, వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారికయ్యెడి తగులుబడి పెట్టుకొనుము; అప్పుడు నిన్నుగూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలిసికొందురు౹ 

25.అయితే విశ్వసించిన అన్యజనులనుగూర్చి–వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపినదానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసియున్నామని చెప్పిరి.౹ 

26.అంతట పౌలు మరునాడు ఆ మనుష్యులను వెంట బెట్టుకొనిపోయి, వారితోకూడ శుద్ధిచేసికొని, దేవాలయములో ప్రవేశించి, వారిలో ప్రతివానికొరకు కానుక అర్పించువరకు శుద్ధిదినములు నెరవేర్చుదుమని తెలిపెను.

మ్రొక్కుబడులు నెరవేర్చిన తరువాత వేడుకల కీర్తనలు

కీర్తనలు 65

1దేవా, సీయోనులో మౌనముగానుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసియున్నది.

2.ప్రార్థన ఆలకించువాడా,సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు

3.నామీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు.

4.నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత మేము తృప్తిపొందెదము.

5.మాకు రక్షణకర్తవైన దేవా,భూదిగంతముల నివాసులకందరికిని దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైనవాడా, నీవు నీతినిబట్టి భీకరక్రియలచేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు

6.బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడై తన శక్తిచేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే

7.ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు.

8.నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులును భయపడుదురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు.

9.నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాతవారి ధాన్యము దయచేయుచున్నావు.

10.దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు.వాన జల్లులచేత దానిని పదునుచేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దాని నాశీర్వదించుచున్నావు.

11.సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి.

12.అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొనియున్నవి.

13.పచ్చికపట్లు మందలను వస్త్రమువలె ధరించియున్నవి. లోయలు సస్యములతో కప్పబడియున్నవి అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి అన్నియు గానముచేయుచున్నవి.

కీర్తనలు 66

ప్రధానగాయకునికి. కీర్తన. గీతము.

1.సర్వలోకనివాసులారా, దేవునిగూర్చి సంతోషగీతము పాడుడి.ఆయన నామప్రభావము కీర్తించుడి

2.ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి.

3.–నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమునుబట్టి నీ శత్రువులు లొంగి నీయొద్దకు వచ్చెదరు

4.సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమునుబట్టి నిన్ను కీర్తించును.(సెలా.)

5.దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి నరులయెడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై యున్నాడు.

6.ఆయన సముద్రమును ఎండిన భూమిగా జేసెను జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయనయందు మేము సంతోషించితిమి.

7.ఆయన తన పరాక్రమమువలన నిత్యము ఏలుచున్నాడు? అన్యజనులమీద ఆయన తన దృష్టియుంచియున్నాడు.ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు.(సెలా.)

8.జనములారా, మా దేవుని సన్నుతించుడి గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి.

9.జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనియ్యడు.

10.దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు.వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.

11.నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుములమీద గొప్పభారము పెట్టితివి.

12.నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అయినను నీవు సమృద్ధిగలచోటికి మమ్ము రప్పించియున్నావు.

13.దహనబలులను తీసికొని నేను నీ మందిరములోనికి వచ్చెదను.

14.నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను

15.పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొఱ్ఱెలను తీసికొని నీకు దహనబలులు అర్పించెదను. ఎద్దులను పోతుమేకలను అర్పించెదను. (సెలా).

16.దేవునియందు భయభక్తులుగలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను.

17.ఆయనకు నేను మొఱ్ఱపెట్టితిని అప్పుడే నా నోట శ్రేష్ఠమైన కీర్తన యుండెను.

18.నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినయెడల ప్రభువు నా మనవి వినకపోవును.

19.నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించియున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు

20.దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నాయొద్దనుండి తన కృపను తొలగింపలేదు; ఆయన సన్నుతింపబడును గాక.

కీర్తనలు 116

17.నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను,యెహోవా నామమున ప్రార్థనచేసెదను

18.ఆయన ప్రజలందరియెదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను

19.యెరూషలేమా, నీమధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి.

 

Related Quiz Articles