అద్భుతాలను రేకెత్తించిన సాధారణ ఆధ్యాత్మిక చర్యలు

నోవహు మరియు జలప్రవాహము

ఆదికాండము 6 : 9.నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితోకూడ నడచినవాడు.౹ 

10.షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను.౹ 

11.భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.౹ 

12.దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.

13.దేవుడు నోవహుతో–సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.౹ 

14.చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలుపెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను.౹ 

15.నీవు దాని చేయవలసిన విధమిది; ఆ ఓడ మూడువందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును ముప్పది మూరల యెత్తును గలదై యుండవలెను.౹ 

16.ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను; ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను; క్రింది అంతస్థు రెండవ అంతస్థు మూడవ అంతస్థు గలదిగా దాని చేయవలెను.౹ 

17.ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చని పోవును;౹ 

18.అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును; నీవును నీతోకూడ నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను.౹ 

19.మరియు నీతోకూడ వాటిని బ్రదికించి యుంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరులయొక్క ప్రతి జాతిలో నివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను; వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను.౹ 

20.నీవు వాటిని బ్రదికించి యుంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును.౹ 

21.మరియు తినుటకు నానావిధములైన ఆహారపదార్థములను కూర్చుకొని నీదగ్గర ఉంచుకొనుము; అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను.౹ 

22.నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.

ఆదికాండము 7 : 5.తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను.

6.ఆ జలప్రవాహము భూమిమీదికి వచ్చినప్పుడు నోవహు ఆరువందల యేండ్లవాడు.౹ 

7.అప్పుడు నోవహును అతనితోకూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహజలములను తప్పించు కొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి.౹ 

8-9.దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను, పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను, మగది ఆడుది జతజతలుగా ఓడలో నున్న నోవహు నొద్దకు చేరెను.౹ 

10.ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహజలములు భూమిమీదికి వచ్చెను.౹ 

11.నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము రెండవనెల పదియేడవదినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.౹ 

12.నలుబది పగళ్లును నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమిమీద కురిసెను.౹ 

13.ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితోకూడ అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి.౹ 

14.వీరే కాదు; ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేలమీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానావిధములైన రెక్కలుగల ప్రతి పిట్టయు ప్రవేశించెను.౹ 

15.జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవహు నొద్ద ప్రవేశించెను.౹ 

16.ప్రవేశించినవన్నియు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను; అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను.౹ 

17.ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా, జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమిమీదనుండి పైకి లేచెను.౹ 

18.జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్లమీద నడిచెను.౹ 

19.ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను.౹ 

20.పదిహేను మూరల యెత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగి పోయెను.౹ 

21.అప్పుడు పక్షులేమి పశువులేమి మృగము లేమి భూమిమీద ప్రాకుపురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి.౹ 

22.పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చని పోయెను.౹ 

23.నరులతోకూడ పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచివేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితోకూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.౹ 

24.నూట ఏబది దినములవరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను.

ఆదికాండము 8 దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసి కొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను.౹ 

2.అగాధ జలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను; ఆకాశమునుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచి పోయెను.౹ 

3.అప్పుడు నీళ్లు భూమిమీదనుండి క్రమక్రమముగా తీసి పోవుచుండెను; నూట ఏబది దినములైనతరువాత నీళ్లు తగ్గిపోగా 

4.ఏడవ నెల పదియేడవదినమున ఓడ అరారాతు కొండలమీద నిలిచెను.౹ 

5.నీళ్లు పదియవ నెలవరకు క్రమముగా తగ్గుచువచ్చెను. పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను.౹ 

6.నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి 

7.ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమిమీదనుండి నీళ్లు ఇంకిపోవువరకు ఇటు అటు తిరుగుచుండెను.౹ 

8.మరియు నీళ్లు నేలమీదనుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్దనుండి నల్లపావుర మొకటి వెలుపలికి పోవిడిచెను.౹ 

9.నీళ్లు భూమి అంతటిమీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతనియొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాని పట్టుకొని ఓడలోనికి తీసికొనెను.౹ 

10.అతడు మరి యేడుదినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను.౹ 

11.సాయంకాలమున అది అతనియొద్దకు వచ్చి నప్పుడు త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను.౹ 

12.అతడింక మరి యేడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు.౹ 

13.మరియు ఆరువందల ఒకటవ సంవత్సరము మొదటినెల తొలిదినమున నీళ్లు భూమిమీదనుండి యింకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను.౹ 

14.రెండవనెల యిరువది యేడవదినమున భూమియెండి యుండెను.

15-16.అప్పుడు దేవుడు–నీవును నీతోకూడ నీ భార్యయు నీ కుమారులును నీ కోడండ్రును ఓడలోనుండి బయటికి రండి.౹ 

17.పక్షులు పశువులు భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్తశరీరులలో నీతోకూడ నున్న ప్రతిజంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమిమీద బహుగా విస్తరించి భూమిమీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను.౹ 

18.కాబట్టి నోవహును అతనితోకూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి.౹ 

19.ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమిమీద సంచరించునవన్నియు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలోనుండి బయటికి వచ్చెను.౹ 

20.అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠముకట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.౹ 

21.అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి–ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందు కనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను.౹ 

22.భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీత కాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.

యాకోబు యొక్క గొర్రెల పెంపకము

ఆదికాండము 31 : 4.యాకోబు పొలములో తన మందయొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో యిట్లనెను.౹ 

5.–మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడై యున్నాడు;౹ 

6.మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసే యున్నది.౹ 

7.మీ తండ్రి నన్ను మోసపుచ్చి పది మార్లు నా జీతము మార్చెను; అయినను–దేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు.౹ 

8.అతడు–పొడలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు పొడలుగల పిల్లలనీనెను. చారలుగలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు చారలుగల పిల్లల నీనెను.౹ 

9.అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను.౹ 

10.మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై యుండెను.౹ 

11.మరియు ఆ స్వప్నమందు దేవుని దూత –యాకోబూ అని నన్ను పిలువగా–చిత్తము ప్రభువా అని చెప్పితిని.౹ 

12.అప్పుడు ఆయన–నీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱెలను దాటు చున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి; ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని 

13.నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.

ఆదికాండము 30 : 25.రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో–నన్ను పంపివేయుము; నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను.౹ 

26.నా భార్యలను నా పిల్లలను నా కప్పగించుము; అప్పుడు నేను వెళ్లెదను; వారి కోసము నీకు కొలువుచేసితిని; నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువుగదా అని చెప్పెను.౹ 

27.అందుకు లాబాను అతనితో–నీ కటాక్షము నా మీదనున్నయెడల నా మాట వినుము; నిన్నుబట్టి యెహోవా నన్ను ఆశీర్వదించె నని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను.౹ 

28.మరియు అతడు–నీ జీత మింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను.౹ 

29.అందుకు యాకోబు అతని చూచి–నేను నీకెట్లు కొలువు చేసితినో నీ మందలు నాయొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియును;౹ 

30.నేను రాకమునుపు నీకుండినది కొంచెమే; అయితే అది బహుగా అభివృద్ధి పొందెను; నేను పాదముపెట్టిన చోటెల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను; నేను నా యింటి వారికొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందుననెను.౹ 

31.అప్పుడతడు–నేను నీకేమి ఇయ్యవలెనని యడిగినందుకు యాకోబు–నీవు నాకేమియు ఇయ్యవద్దు; నీవు నాకొరకు ఈ విధముగా చేసినయెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను.౹ 

32.నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొఱ్ఱెను, గొఱ్ఱెపిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను; అట్టివి నాకు జీతమగును.౹ 

33.ఇకమీదట నాకు రావలసిన జీతమునుగూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయప్రవర్తనయే నాకు సాక్ష్యమగును; మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నియు, గొఱ్ఱెపిల్లలలో నలుపు లేనివన్నియు నా యొద్దనున్నయెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను.౹ 

34.అందుకు లాబాను –మంచిది, నీ మాటచొప్పుననే కాని మ్మనెను.౹ 

35.ఆ దినమున లాబాను చారయైనను మచ్చ యైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటిమేకలన్నిటిని కొంచెము తెలుపుగల ప్రతిదానిని గొఱ్ఱెపిల్లలలో నల్లవాటినన్నిటిని వేరుచేసి తన కుమారులచేతి కప్పగించి 

36.తనకును యాకోబునకును మధ్య మూడుదినముల ప్రయాణమంత దూరము పెట్టెను; లాబానుయొక్క మిగిలిన మందను యాకోబు మేపు చుండెను.౹ 

37.యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసికొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి 

38.మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్లగాళ్లలోను వాటియెదుట పెట్టగా 

39.మందలు ఆ చువ్వల యెదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను.౹ 

40.యాకోబు ఆ గొఱ్ఱెపిల్లలను వేరుచేసి, చారలుగల వాటితట్టును లాబాను మందలలో నల్లని వాటితట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను.౹ 

41.మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల యెదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల యెదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను.౹ 

42.మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను.౹ 

43.ఆప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధిపొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను.

ఇస్సాకు కరువు దినములలో విత్తుట

ఆదికాండము 26  అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను.౹ 

2.అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై–నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము.౹ 

3.ఈ దేశమందు పరవాసివై యుండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను;౹ 

4.ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు.౹ 

5.ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను.

6-7.ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి–ఆమె యెవరని అడిగినప్పుడు అతడు–ఆమె నా సహోదరి అని చెప్పెను; ఎందుకనగా –రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను.౹ 

8.అక్కడ అతడు చాలాదినము లుండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలోనుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్యయైన రిబ్కాతో సరసమాడుట కనబడెను.౹ 

9.అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి–ఇదిగో ఆమె నీ భార్యయే–ఆమె నా సహో దరి అని యేల చెప్పితివని అడుగగా ఇస్సాకు–ఆమెనుబట్టి నేను చనిపోవుదునేమో అనుకొంటినని అతనితో చెప్పెను.౹ 

10.అందుకు అబీమెలెకు–నీవు మాకు చేసిన యీ పని యేమి? ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మామీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవుగదా అనెను.౹ 

11.అబీమెలెకు–ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికి ఆజ్ఞాపింపగా 

12.ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలముపొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.౹ 

13.అతడు మిక్కిలి గొప్పవాడగువరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను.౹ 

14.అతనికి గొఱ్ఱెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయ పడిరి.౹ 

ఎలీషా నీటిని తీపి చేయుట:

2 రాజులు 2 : 15.యెరికోదగ్గరనుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి–ఏలీయా ఆత్మ ఎలీషామీద నిలిచియున్నదని చెప్పుకొని, అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి 

16.అతనితో ఇట్లనిరి–ఇదిగో నీ దాసులమైన మా యొద్ద ఏబదిమంది బలముగలవారున్నారు; మా మీద దయయుంచి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము; యెహోవా ఆత్మ అతనిని ఎత్తి యొక పర్వతము మీదనైనను లోయయందైనను వేసియుండునేమో అని మనవిచేయగా అతడు–ఎవరిని పంపవద్దనెను.౹ 

17.అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు ఏబదిమందిని పంపిరి. వీరు వెళ్లి మూడుదినములు అతనిని వెదకినను అతడు వారికి కనబడకపోయెను.౹ 

18.వారు యెరికో పట్టణమందు ఆగియున్న ఎలీషాయొద్దకు తిరిగి రాగా అతడు–వెళ్లవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను.

19.అంతట ఆ పట్టణపువారు–ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా యేలినవాడవైన నీకు కనబడుచున్నదిగాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సా రమై యున్నదని ఎలీషాతో అనగా 

20.అతడు–క్రొత్త పాత్రలో ఉప్పువేసి నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పెను. వారు దాని తీసికొని రాగా 

21.అతడు ఆ నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పువేసి, – యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ నీటిని నేను బాగుచేసియున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగక పోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను.౹ 

22.కాబట్టి నేటివరకు ఎలీషా చెప్పిన మాటచొప్పున ఆ నీరు మంచిదైయున్నది.

కుండలో మరణమును నయముచేయుట:

2 రాజులు 4 : 38.ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి యుండగా అతడు తన పనివానిని పిలిచి –పెద్దకుండ పొయిమీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటచేయుమని సెలవిచ్చెను.౹ 

39.అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెఱ్ఱి ద్రాక్షచెట్టును చూచి, దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడినిండ కోసికొని వచ్చి, వాటిని తరిగి కూరకుండలో వేసెను.౹ 

40.తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచిచూచి –దైవజనుడా,కుండలో విషమున్నదని కేకలువేసి దానిని తినక మానిరి.౹ 

41.అతడు–పిండి కొంత తెమ్మనెను. వారు తేగా–కుండలో దాని వేసి, జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగాకుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను.

వంద మందికి ఆహారం

42.మరియు ఒకడు బయల్షాలిషానుండి మొదటి పంట బాపతు యవలపిండితో చేయబడిన యిరువది రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసికొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను.౹ 

43.అయితే అతని పనివాడు–నూరుమందికి వడ్డించుటకు ఇవి యెంతవని చెప్పగా అతడు–వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చియున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరల ఆజ్ఞ ఇచ్చెను.౹ 

44.పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను.

ఎఱ్ఱసముద్రము మరియు మారా:

నిర్గమకాండము 14 : 5.ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి –మనమెందుకీలాగు చేసితిమి? మన సేవలో నుండకుండ ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పు కొనిరి.౹ 

6.అంతట అతడు తన రథమును సిద్ధపరచుకొని, తన జనమును తనతోకూడ తీసికొని పోయెను.౹ 

7.మరియు అతడు శ్రేష్ఠమైన ఆరువందల రథములను ఐగుప్తు రథముల నన్నిటిని వాటిలో ప్రతిదానిమీద అధిపతులను తోడుకొనిపోయెను.౹ 

8.యెహోవా ఐగుప్తురాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమిచేత బయలు వెళ్లుచుండిరి.౹ 

9.ఐగుప్తీయులు, అనగా ఫరో రథముల గుఱ్ఱములన్నియు అతని గుఱ్ఱపు రౌతులు అతని దండును వారిని తరిమి, బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసికొనిరి.౹ 

10.ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమవెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొఱపెట్టిరి.౹ 

11.అంతట వారు మోషేతో–ఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల? 

12.మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పినమాట యిదే గదా; మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటె ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి.౹ 

13.అందుకు మోషే–భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగ జేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు.౹ 

14.యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.

15.అంతలో యెహోవా మోషేతో–నీవేల నాకు మొఱ పెట్టుచున్నావు? –సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము.౹ 

16.నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రముమధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు.౹ 

17.ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరుచుదును. వారు వీరిని తరుముదురు; నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను అతని రథముల వలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను నాకు మహిమ తెచ్చు కొందును.౹ 

18.నేను ఫరోవలనను అతని రథములవలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను మహిమ తెచ్చుకొనునప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.౹ 

19.అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను.౹ 

20.అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు.౹ 

21.మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొల గించి దానిని ఆరిన నేలగా చేసెను.౹ 

22.నీళ్లు విభజింప బడగా ఇశ్రాయేలీయులు సముద్రముమధ్యను ఆరిన నేలమీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.౹ 

23.ఐగుప్తీయులును ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి.౹ 

24.అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండువైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి 

25.వారి రథచక్రములు ఊడిపడునట్లుచేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు –ఇశ్రాయేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవావారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.

26.అంతలో యెహోవా మోషేతో–ఐగుప్తీయులమీదికిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను.౹ 

27.మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను.౹ 

28.నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.౹ 

29.అయితే ఇశ్రాయేలీయులు ఆరిననేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను గోడవలె నుండెను.౹ 

30.ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్రతీరమున చూచిరి.౹ 

31.యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మకముంచిరి.

నిర్గమకాండము 15 : 19.ఫరో గుఱ్ఱములు అతని రథములు అతని రౌతులును సముద్రములో దిగగా యెహోవావారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రముమధ్యను ఆరిన నేలమీద నడిచిరి.

20.మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేతపట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా 

21.మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను–యెహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను.

మారా మరియు ఎలీము యొక్క నీరు

22.మోషే ఎఱ్ఱసముద్రమునుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో మూడుదినములు నడిచిరి; అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి.౹ 

23.మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను.౹ 

24.ప్రజలు–మేమేమి త్రాగుదుమని మోషేమీద సణగు కొనగా 

25.అతడు యెహోవాకు మొఱపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురము లాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, అక్కడ వారిని పరీక్షించి,౹ 

26.–మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.౹ 

27.తరువాత వారు ఏలీమునకు వచ్చిరి; అక్కడ పండ్రెండు నీటి బుగ్గలును డెబ్బది యీతచెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్లయొద్ద దిగిరి.

నిర్గమకాండము 17: రాతి నుండి నీరు మొదటి భాగము

1.తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాటచొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లులేనందున 

2.మోషేతో వాదిం చుచు–త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషే– మీరు నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల అని వారితో చెప్పెను.౹ 

3.అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పి గొని మోషేమీద సణుగుచు–ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులోనుండి ఇక్కడికి తీసికొని వచ్చితిరనిరి.౹ 

4.అప్పుడు మోషే యెహోవాకు మొఱపెట్టుచు–ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదు రనెను.౹ 

5.అందుకు యెహోవా–నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసికొని ప్రజలకు ముందుగా పొమ్ము; నీవు నదిని కొట్టిన నీ కఱ్ఱను చేతపట్టుకొని పొమ్ము 

6.ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను.౹ 

7.అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమునుబట్టియు యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటనుబట్టియు అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను.

సంఖ్యాకాండము 20 : రాతి నుండి నీరు రెండవ భాగము 

20 మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను.౹ 

2.ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందునవారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి.౹ 

3.జనులు మోషేతో వాదించుచు–అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినయెడల ఎంతో మేలు 

4.అయితే మేమును మా పశువులును ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి? 

5.ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులోనుండి మమ్మును ఏల రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్లే లేవనిరి.౹ 

6.అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుటనుండి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను.౹ 

7.అంతట యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను 

8.–నీవు నీ కఱ్ఱను తీసికొని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల యెదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోనుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము.౹ 

9.యెహోవా అతని కాజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధినుండి ఆ కఱ్ఱను తీసికొని పోయెను.౹ 

10.తరువాత మోషే అహరోనులు ఆ బండ యెదుట సమాజమును పోగుచేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి; మేము ఈ బండలోనుండి మీకొరకు నీళ్లు రప్పింపవలెనా? అనెను.౹ 

11.అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను.౹ 

12.అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను.౹ 

13.అవి మెరీబా జలమనబడెను; ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారిమధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను.

నిర్గమకాండము 17 : అమాలేకీయులు ఓడింపబడుట

8.తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా 

9.మోషే యెహోషువతో–మనకొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసికొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధముచేయుము; రేపు నేను దేవుని కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలిచెదననెను.౹ 

10.యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను; మోషే అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖర మెక్కిరి 

11.మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి; మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి,౹ 

12.మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసికొని వచ్చి అతడు దానిమీద కూర్చుండుటకై దానివేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతనిచేతులను ఆదుకొనగా అతనిచేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండెను.౹ 

13.అట్లు యెహోషువ కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను.౹ 

14.అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను–నేను అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంధములో దీని వ్రాసి యెహోషువకు విని పించుము.౹ 

15.తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరుపెట్టి 

16.–అమాలేకీయులు తమచేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములవరకు యుద్ధమనెను.

గాలియు లేదు వర్షము కాదు, అయినను నీటితో నిండిన లోయ:

2 రాజులు 3 : 1.అహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలువారికి రాజై పండ్రెండు సంవత్సరములు ఏలెను.౹ 

2.ఇతడు తన తలి దండ్రులు చేసిన ప్రకారము చేయక, తన తండ్రి నిలిపిన బయలుదేవతాస్తంభమును తీసివేసెనుగాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను 

3.ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను.

4.మోయాబు రాజైన మేషా అనేకమైన మందలుగల వాడై లక్ష గొఱ్ఱెపిల్లలను బొచ్చుగల లక్ష గొఱ్ఱెపొట్టేళ్లను ఇశ్రాయేలురాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు.౹ 

5.అయితే అహాబు మరణమైన తరువాత మోయాబురాజు ఇశ్రాయేలురాజుమీద తిరుగుబాటుచేయగా 

6.యెహోరాము షోమ్రోనులోనుండి బయలుదేరి ఇశ్రాయేలువారినందరిని సమకూర్చెను.౹ 

7.యూదారాజైన యెహోషాపాతునకు వర్తమానము పంపి–మోయాబురాజు నామీద తిరుగుబాటు చేసియున్నాడు; నీవు వచ్చి నాతోకూడ మోయాబీయులతో యుద్ధము చేసెదవా అని యడుగగా అతడు–నేను నీవాడనైయున్నాను, నా జనులు నీ జనులే, నా గుఱ్ఱములు నీ గుఱ్ఱములే; నేను బయలుదేరి వచ్చెదనని ప్రత్యుత్తరమిచ్చెను.౹ 

8.–మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడుగగా అతడు–ఎదోము అరణ్య మార్గమున పోవుదుమని చెప్పెను.౹ 

9.ఇశ్రాయేలురాజును యూదారాజును ఎదోమురాజును బయలుదేరి యేడు దినములు చుట్టు తిరిగిన తరువాత, వారితోకూడనున్నదండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను.౹ 

10.ఇశ్రాయేలురాజు–కటకటా ముగ్గురు రాజులమైన మనలను మోయాబీయులచేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచెననగా 

11.యెహోషాపాతు–అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణచేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని యడిగెను. అంతట ఇశ్రాయేలురాజు సేవకులలో ఒకడు–ఏలీయా చేతులమీద నీళ్లుపోయుచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా 

12.యెహోషాపాతు –యెహోవా ఆజ్ఞ యితనిద్వారా మనకు దొరుకుననెను. ఇశ్రాయేలురాజును యెహోషాపాతును ఎదోమురాజును అతని యొద్దకుపోగా 

13.ఎలీషా ఇశ్రాయేలురాజును చూచి–నాతో నీకు నిమిత్తమేమి? నీ తలిదండ్రులుంచుకొనిన ప్రవక్తలయొద్దకు పొమ్మని చెప్పెను. –ఆలాగనవద్దు, మోయాబీయులచేతికి అప్పగింపవలెనని యెహోవా, రాజులమైన మాముగ్గురిని పిలిచెనని ఇశ్రాయేలురాజు అతనితో అనినప్పుడు 

14.ఎలీషా ఇట్లనెను–ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయనియెడల నిన్ను చూచుట కైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును.౹ 

15.నాయొద్దకు వీణె వాయించగల యొకనిని తీసికొనిరమ్ము. వాద్యకు డొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను.౹ 

16.– యెహోవా సెలవిచ్చినదేమనగా – ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి;౹ 

17.యెహోవా సెలవిచ్చునదేమనగా–గాలియేగాని వర్షమేగాని రాక పోయినను, మీరును మీ మందలును మీ పశువులును త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును.౹ 

18.ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీచేతికి అప్పగించును.౹ 

19.మీరు ప్రాకారములుగల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి, మంచి చెట్లనెల్ల నరికి, నీళ్ల బావులన్నిటిని పూడ్చి, సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను.౹ 

20.ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను.౹ 

21.తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చియున్నారని మోయాబీయులు విని, అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరిని సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి.౹ 

22.ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్లమీద ప్రకాశింపగా, అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తమువలె కనబడెను 

23.గనుక వారు–అది రక్తము సుమా; రాజులు ఒకరినొకరు హతము చేసికొని నిజముగా హతులైరి; మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి.౹ 

24.వారు ఇశ్రాయేలువారి దండుదగ్గరకు రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీయులు వారియెదుట నిలువలేక పారిపోయిరి; ఇశ్రాయేలీయులు వారి దేశములో చొరబడి మోయాబీయులను హతము చేసిరి.౹ 

25.మరియు వారు పట్టణములను పడగొట్టి, సమస్తమైన మంచి భూభాగములమీదను తలయొక రాయి వేసి నింపి, నీళ్ల బావులన్నిటిని పూడ్చి, మంచి చెట్లన్నిటిని నరికివేసిరి. కీర్హరెశెతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి గనుక దాని ప్రాకారము నిలిచి యుండెనుగాని వడిసెలలు విసరువారు దాని చుట్టుకొని రాళ్లు విసరుచు వచ్చిరి.౹ 

26.మోయాబురాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తిదూయు ఏడువందలమందిని ఏర్పరచుకొని, ఎదోమురాజునొద్దకు తీసికొని పోవుటకు యత్నించెనుగాని అది వారివలన కాకపోయెను.౹ 

27.అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠకుమారుని తీసికొని, పట్టణపు ప్రాకారముమీద దహనబలిగా అర్పింపగా ఇశ్రాయేలువారిమీదికి కోపము బహుగా వచ్చెను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి.

2 రాజులు 4 : వితంతువు యొక్క నూనెకుండ

1.అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య–నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవాయందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొనిపోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొఱ్ఱపెట్టగా 

2.ఎలీషా–నా వలన నీకేమి కావలెను? నీ యింటిలో ఏమి యున్నదో అది నాకు తెలియ జెప్పుమనెను. అందుకామె–నీ దాసురాలనైన నా యింటిలో నూనెకుండ యొకటి యున్నది; అది తప్ప మరేమియు లేదనెను.౹ 

3.అతడు–నీవు బయటికి పోయి, నీ యిరుగు పొరుగు వారందరియొద్ద దొరుకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరవు పుచ్చుకొనుము;౹ 

4.అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపలనుండి తలుపుమూసి, ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి, నిండినవి యొకతట్టున ఉంచుమని ఆమెతో సెలవియ్యగా 

5.ఆమె అతని యొద్దనుండి పోయి, తానును కుమారులును లోపలనుండి తలుపుమూసి, కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను.౹ 

6.పాత్రలన్నియు నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు–మరేమియు లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచి పోయెను.౹ 

7.ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు–నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలినదానితో నీవును నీ పిల్లలును బ్రదుకుడని ఆమెతో చెప్పెను.

2 రాజులు 6 : గొడ్డలి తేలుట

1.అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి– ఇదిగో నీయొద్ద మాకున్న స్థలము ఇరుకుగా నున్నది;౹ 

2.నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలయొక మ్రాను అచ్చటనుండి తెచ్చుకొని మరియొకచోట నివా సము కట్టుకొందుమని మనవిచేయగా అతడు–వెళ్లుడని ప్రత్యుత్తరమిచ్చెను.౹ 

3.ఒకడు–దయచేసి నీ దాసులమైన మాతోకూడ నీవు రావలెనని కోరగా అతడు–నేను వచ్చెదనని చెప్పి 

4.వారితోకూడ పోయెను; వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి.౹ 

5.ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడి పోగా వాడు–అయ్యో నా యేలినవాడా, అది యెరవు తెచ్చినదని మొఱ్ఱపెట్టెను గనుక 

6.ఆ దైవజనుడు– అదెక్కడపడెనని అడిగెను; వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మయొకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను.౹ 

7.అతడు–దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను.

2 రాజులు 5 : కుష్ఠ వ్యాధి నుండి నయమాను స్వస్థత

1.సిరియారాజు సైన్యాధిపతియైన నయమాను అను నొక డుండెను. అతనిచేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి యుండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయపొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలియైయుండెనుగాని అతడు కుష్ఠరోగి.౹ 

2.సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలుదేశముమీదికి పోయి యుండిరి. వారచ్చటనుండి యొక చిన్నదాని చెరగొని తేగా, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను.౹ 

3.అది–షోమ్రోనులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను.౹ 

4.నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా 

5.సిరియా రాజు–నేను ఇశ్రాయేలురాజునకు దూతచేత పత్రిక పంపించెదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు ఇరువది మణుగుల వెండియు లక్ష యిరువది వేల రూపాయిల బంగారును పది దుస్తుల బట్టలను తీసికొనిపోయి ఇశ్రాయేలురాజునకు పత్రికను అప్పగించెను.౹ 

6.ఆ పత్రికలో ఉన్న సంగతి యేదనగా–నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగుచేయవలెనని యీ పత్రి కను అతనిచేత నీకు పంపించియున్నాను.౹ 

7.ఇశ్రాయేలురాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని– చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నాయొద్దకు ఇతడు పంపుటయేమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడనెను.౹ 

8.ఇశ్రాయేలురాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు–నీ వస్త్రములు నీ వెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త యొకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నాయొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను.౹ 

9.నయమాను గుఱ్ఱములతోను రథముతోను వచ్చి ఎలీషా యింటి ద్వారము ముందర నిలిచియుండగా 

10.ఎలీషా–నీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను.౹ 

11.అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి యిట్లనెను–అతడు నా యొద్దకు వచ్చి నిలిచి, తన దేవుడైన యెహోవా నామమునుబట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముమీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని.౹ 

12.దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలుదేశములోని నదులన్నిటికంటె శ్రేష్ఠమైనవి కావా? వాటిలో స్నానముచేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయెను.౹ 

13.అయితే అతని దాసులలో ఒకడు వచ్చి–నాయనా, ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించినయెడల నీవు చేయకుందువా? అయితే స్నానముచేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటె మేలుకాదా అని చెప్పినప్పుడు 

14.అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులుమునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను.౹ 

15.అప్పుడతడు తన పరివారముతోకూడ దైవజనునిదగ్గరకు తిరిగివచ్చి అతని ముందర నిలిచి–చిత్తగించుము; ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగుదును; ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసికొనవలసినదని అతనితో చెప్పగా 

16.ఎలీషా –ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియు తీసి కొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతి మాలినను అతడు ఒప్పక పోయెను.౹ 

17.అప్పుడు–యెహోవాకు తప్ప దహనబలినైనను మరి యే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను; రెండు కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించ కూడదా? 

18.నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతిమీద ఆనుకొనునప్పుడు, నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినయెడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారముచేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా 

19.ఎలీషా–నెమ్మదిగలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషాయొద్దనుండి వెళ్లి కొంత దూరము సాగిపోయెను.

1 సమూయేలు 11 : సౌలు యాబేషు నగరాన్ని రక్షించుట

1.అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదు కెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరు–మేము నీకు సేవచేయుదుము, మాతో నిబంధనచేయుమని నాహాషుతో అనిరి.౹ 

2.–ఇశ్రాయేలీయులందరి మీదికి నింద తెచ్చునట్లు మీయందరి కుడికన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసెదనని అమ్మోనీయుడైన నాహాషు 

3.యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారు–మేము ఇశ్రాయేలీయుల సరిహద్దు లన్నిటికి దూతలను పంపుటకై యేడు దినముల గడువు మాకిమ్ము; మమ్మును రక్షించుటకు ఎవరును లేక పోయినయెడల మమ్మును మేము నీకప్పగించుకొనెదమనిరి.౹ 

4.దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరు బిగ్గరగా ఏడ్చిరి.౹ 

5.సౌలు పొలమునుండి పశువులను తోలుకొని వచ్చుచు– జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా వారు యాబేషువారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి.౹ 

6.సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతనిమీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై 

7.ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశము లోని నలుదిక్కులకు దూతలచేత వాటిని పంపి–సౌలుతోను సమూయేలుతోను చేరకుండువాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనులమీదికి వచ్చెను గనుక యొకడైనను నిలువకుండ వారందరు వచ్చిరి.౹ 

8.అతడు బెజెకులో వారిని లెక్కపెట్టగా ఇశ్రాయేలువారు మూడు లక్షలమందియు యూదావారు ముప్పదివేలమందియు అయిరి.౹ 

9.అప్పుడు–రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేసెను. దూతలు పోయి యాబేషువారికి ఆ వర్తమానము తెలుపగా వారు సంతోషపడిరి.౹ 

10.కాబట్టి యాబేషువారు నాహాషుయొక్క దూతలతో ఇట్లనిరి–రేపు మేము బయలుదేరి మమ్మును అప్పగించుకొందుము, అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును.౹ 

11.మరునాడు సౌలు జనులను మూడు సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండుమధ్యను జొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీయులను హతముచేయగా వారిలో మిగిలినవారు ఇద్దరేసికూడి పోజాలకుండ చెదరి పోయిరి.౹

సౌలు రాజుగా ధృవీకరించబడుట

12.జనులు–సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి? మేము వారిని చంపునట్లు ఆ మనుష్యులను తెప్పించుడని సమూయేలుతో అనగా 

13.సౌలు–నేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసెను గనుక ఈ దినమున ఏ మనుష్యుని మీరు చంపవద్దనెను.

14.–మనము గిల్గాలునకు వెళ్లి రాజ్యపరిపాలన పద్ధతిని మరల స్థాపించుకొందము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా 

15.జనులందరు గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధానబలులను అర్పించి, యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీయులందరును అక్కడ బహుగా సంతోషించిరి.

1 సమూయేలు 30 : దావీదు అమాలేకీయులను నాశనం చేయుట

1.దావీదును అతని జనులును మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి; అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశముమీదను సిక్లగుమీదను పడి, కొట్టి దానిని తగులబెట్టి,౹ 

2.ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసికొని వెళ్లిపోయి యుండిరి.౹ 

3.దావీదును అతని జనులును పట్టణమునకు వచ్చి అది కాల్చబడియుండుటయు, తమ భార్యలును కుమారులును కుమార్తెలును చెరలోనికి కొని పోబడి యుండుటయు చూచి 

4.ఇక ఏడ్చుటకు శక్తిలేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి.౹ 

5.యెజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మెలీయుడైన నాబాలు భార్యయయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలును చెరలోనికి కొనిపోబడగా చూచి 

6.దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమతమ కుమారులనుబట్టియు కుమార్తెలనుబట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పు కొనగా దావీదు తన దేవుడైన యెహోవానుబట్టి ధైర్యము తెచ్చుకొనెను.౹ 

7.పిమ్మట దావీదు–ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసికొనివచ్చెను.౹ 

8.–నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణచేయగా యెహోవా–తరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసి కొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను.౹ 

9.కాబట్టి దావీదు అతనియొద్దనున్న ఆరువందలమందియును బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా వారిలో రెండువందలమంది వెనుక దిగవిడువబడిరి.౹ 

10.దావీదును నాలుగువందలమందియును ఇంక తరుముచు పోయిరిగాని ఆ రెండువందలమంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ నాలుగు వందలమంది పోవుచుండగా 

11.పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొనివచ్చి, వాడు మూడు రాత్రింబగళ్లు అన్నపానము లేమియు పుచ్చు కొనలేదని తెలిసికొని, వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను రెండు ద్రాక్షగెలలను వానికిచ్చిరి.౹ 

12.వాడు భోజనముచేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా 

13.దావీదు–నీవు ఏ దేశపువాడవు? ఎక్కడనుండి వచ్చితివని వాని నడిగెను. అందుకు వాడు –నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన యొకనికి దాసుడనైతిని; మూడుదినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను.౹ 

14.మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసితిమని చెప్పెను.౹ 

15.–ఆ దండును కలిసికొనుటకై నీవు నాకు దోవచూపుదువా అని దావీదు వానినడుగగా వాడు–నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవునిబట్టి నీవు నాకు ప్రమాణము చేసినయెడల ఆ దండును కలిసి కొనుటకు నీకు దోవచూపుదుననెను.౹ 

16.తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, ఫిలిష్తీయుల దేశములోనుండియు యూదా దేశములోనుండియు తాము దోచి తెచ్చికొనిన సొమ్ముతో తులదూగుచు, వారు ఆ ప్రదేశమంతట చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి.౹ 

17.దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రమువరకు వారిని హతము చేయుచుండగా, ఒంటెలమీద ఎక్కి పారిపోయిన నాలుగువందలమంది యౌవనులు తప్ప తప్పించుకొనినవాడు ఒకడును లేకపోయెను.౹ 

18.ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొనిపోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన యిద్దరు భార్యలను రక్షించెను.౹ 

19.కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తికొనిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి యేదియు తక్కువకాకుండ దావీదు సమస్తమును రక్షించెను.౹ 

20.మరియు దావీదు అమాలేకీయుల గొఱ్ఱెలన్నిటిని గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి.౹ 

21.అలసటచేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ రెండువందలమందియొద్దకు దావీదు పోగా వారు దావీదును అతనియొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనులయొద్దకు వచ్చి వారి యోగక్షేమమడుగగా 

22.దావీదుతోకూడ వెళ్లినవారిలో దుర్మార్గులును, పనికి మాలినవారునైన కొందరు–వీరు మనతోకూడ రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరల వచ్చిన దోపుడు సొమ్ములో మన మేమియు వీరికియ్యము; తమ భార్య పిల్లలను వారు తీసికొని పోవచ్చుననిరి.౹ 

23.అందుకు దావీదు వారితో ఇట్లనెను–నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మనమీదికి వచ్చిన యీ దండును మనకప్పగించి మనకు దయచేసిన దాని విషయములో మీరు ఈలాగున చేయకూడదు.౹ 

24.మీరు చెప్పినది యెవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయినవాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట; అందరు సమముగానే పాలు పంచుకొందురు గదా 

25.కావున నాటనుండి నేటివరకు దావీదు ఇశ్రాయేలీయులలో అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరచి నియమించెను.

26.దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరచి– యెహోవా శత్రువులయొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాదసూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను.౹ 

అపొస్తలుల నీడల ద్వారా స్వస్థత పొందుట

అపొస్తలుల కార్యములు 5 : 12.ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహ త్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి.౹ 

13.కడమవారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని౹ 

14.ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కు వగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.౹ 

15.అందు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి.౹ 

16.మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి.

Related Quiz Articles