దేవుని రాజ్యము మరియు పరలోక రాజ్యము

కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.

మత్తయి 5 : 3 ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.

చింతపడకుడి గాని దేవుని రాజ్యమును వెతుకుడి

మత్తయి 6 : 25.అందువలన నేను మీతో చెప్పునదేమనగా–ఏమి తిందుమో యేమి త్రాగు దుమో అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణమును, వస్త్రము కంటె దేహమును గొప్పవి కావా? 

26.ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్ఠులు కారా? 

27.మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? 

28.వస్త్రములనుగూర్చి మీరు చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు 

29.అయినను తన సమస్త వైభవముతోకూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు. 

30.నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంక రించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. 

31.కాబట్టి– ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. 

32.ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. 

33.కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. 

34.రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.

లూకా 12 : 22.అంతట ఆయన తన శిష్యులతో ఇట్లనెను–ఈ హేతువుచేత మీరు – ఏమి తిందుమో, అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో, అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి. 

23.ఆహారముకంటె ప్రాణమును వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా? 

24.కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు. 

25.మరియు మీలో ఎవడు చింతించుటవలన తన యెత్తును మూరెడెక్కువ చేసికొన గలడు? 

26.కాబట్టి అన్నిటికంటె తక్కువైనవి మీచేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేల? 

27.పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడుకవు; అయినను తన సమస్తవైభవముతోకూడిన సొలొమోను సయితము వీటిలో ఒకదానివలెనైన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. 

28.నేడు పొలములో ఉండి, రేపు పొయిలోవేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును. 

29.ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి. 

30.ఈ లోకపు జనులు వీటినన్నిటిని వెదకుదురు; ఇవి మీకు కావలసియున్నవని మీ తండ్రికి తెలియును. 

31.మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితోకూడ ఇవి మీ కనుగ్రహింపబడును

32.చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది 

మత్తయి 9 : 35.యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతివిధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను. 

36.ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెల వలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి 

37.– కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు 

38.గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడు కొనుడని తన శిష్యులతో చెప్పెను.

మత్తయి 10 : 5.యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింప కుడి గాని 

6.ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల యొద్దకే వెళ్లుడి. 

7.వెళ్లుచు పరలోకరాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి

8.రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. 

9.మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికఱ్ఱనైనను సిద్ధపరచుకొనకుడి; 

10.పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? 

11.మరియు మీరు ఏపట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి. 

12.ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి. 

13.ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.

లూకా 9 : 1.ఆయన తన పండ్రెండుమంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి 

2.దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను. 

3.మరియు ఆయన–మీరు ప్రయాణము కొరకు చేతికఱ్ఱనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొని పోవద్దు; రెండు అంగీలు ఉంచు కొనవద్దు. 

4.మీరు ఏ యింట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడనుండి బయలుదేరుడి. 

5.మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములోనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను. 

6.వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, (రోగులను) స్వస్థ పరచుచు గ్రామములలో సంచారము చేసిరి.

యోహాను 18 : 36.యేసు–నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను.౹ 

37-38.అందుకు పిలాతు–నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు–నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు–సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను.

లూకా 17 : 20.దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన నడిగినప్పుడు ఆయన–దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. 

21.ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది గనుక, ఇదిగో యిక్కడనని, అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తర మిచ్చెను.

రోమా 14 : 17

దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.౹

దేవుని రాజ్యము సమీపించి ఉన్నది

మత్తయి 3 : 1.ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి 

2.పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను.

3.ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే.

మార్కు 1 : 9.ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మముపొందెను. 

10.వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను. 

11.మరియు–నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.

12.వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను. 

13.ఆయన సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు అడవిమృగములతోకూడ నుండెను; మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి.

14.యోహాను చెరపట్టబడిన తరువాత యేసు 

15.కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించియున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను.

మత్తయి 4 : 12-16.యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.

– జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.) 

17.అప్పటినుండి యేసు పర లోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.

లూకా 10 : 5.త్రోవలో ఎవనినైనను కుశలప్రశ్న లడుగవద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడు–ఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి. 

6.సమాధానపాత్రుడు అక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగి వచ్చును. 

7.వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరుగవద్దు. 

8.మరియు మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొంటే మీ ముందరపెట్టునవి తినుడి. 

9.అందులో నున్న రోగులను స్వస్థపరచుడి–దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి. 

10.మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొనక పోయినయెడల 

11.మీరు దాని వీధులలోనికి పోయి–మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడ మీ యెదుటనే దులిపివేయుచున్నాము; అయినను దేవుని రాజ్యము సమీపించియున్నదని తెలిసికొనుడని చెప్పుడి. 

12.ఆ పట్టణపు గతికంటె సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.

దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది

మత్తయి 12 : 28.దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. 

29.ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును. 

30.నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదర గొట్టువాడు. 

31.కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా–మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. 

32.మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.

లూకా 11 : 14.ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్లగొట్టుచుండెను. ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. 

15.అయితే వారిలో కొందరు–వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. 

16.మరికొందరు ఆయనను శోధించుచు–పరలోకము నుండి యొక సూచక క్రియను చూపుమని ఆయన నడిగిరి. 

17.ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ఇట్లనెను–తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును; తనకుతానే విరోధమైన యిల్లు కూలిపోవును. 

18.సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడినయెడల వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. 

19.నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల మీ కుమారులు ఎవనివలన వెళ్లగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులైయుందురు. 

20.అయితే నేను దేవుని వ్రేలితో దయ్యము లను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది. 

21.బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును. 

22.అయితే అతనికంటె బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధముల నన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. 

23.నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. 

24.అపవిత్రాత్మ యొక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున–నేను విడిచి వచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని 

25.వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చి యుండుట చూచి 

26.వెళ్లి, తనకంటె చెడ్డైవెన మరి యేడు (అపవిత్ర) ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును; అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును; అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటిదానికంటె చెడ్డదగునని చెప్పెను.

పరలోక రాజ్యమర్మములు తెలుసుకొనుట

మత్తయి 13 : 10.తరువాత శిష్యులు వచ్చి–నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను 

11.పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. 

12.కలిగినవానికే యియ్యబడును, వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసి వేయబడును. మరియు–వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. 

13-15.ఇందునిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను.ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందము లైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహిం పనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురు గాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెర వేరుచున్నది. 

16.అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. 

17.అనేక ప్రవక్తలును నీతిమంతు లును మీరు చూచువాటిని చూడగోరియు చూడక పోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

పరలోక రాజ్యములోనికి ప్రవేశించుట

మత్తయి 7 : 21.–ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. 

22.ఆ దినమందు అనేకులు నన్ను చూచి–ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. 

23.అప్పుడు –నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమముచేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.

మత్తయి 5 : 17.ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. 

18.ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 

19.కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. 

20.శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను.

21.నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. 

22.నేను మీతో చెప్పునదేమనగా – తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. 

23.కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల 

24.అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము. 

25.నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. 

26.కడపటి కాసు చెల్లించువరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

27.వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; 

28.నేను మీతో చెప్పునదేమనగా–ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవా డగును. 

29.నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా. 

30.నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా.

వడిగలవారు దాని నాక్రమించుకొనుచున్నారు

మత్తయి 11 : 7.వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహా నునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను –మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి? 

8.సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగో–సన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో నుందురు గదా. 

9.మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.–

10.ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును.అని యెవనిగూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను 

11.స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడు. 

12.బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటివరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు. 

13.యోహాను కాలమువరకు ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుండెను. 

14.ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే. 

15.వినుటకు చెవులుగలవాడు వినుగాక. 

లూకా 16 : 14.ధనాపేక్షగల పరిసయ్యులు ఈ మాటలన్నియు విని ఆయనను అపహసించుచుండగా 

15.ఆయన–మీరు మనుష్యులయెదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవునిదృష్టికి అసహ్యము. 

16.యోహాను కాలమువరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలును ఉండిరి; అప్పటినుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది; ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు 

17.ధర్మశాస్త్రములో ఒక పొల్లయిన తప్పి పోవుటకంటె ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము.

యోహాను 3 : 1.యూదుల అధికారియైన నీకొదేమను పరిసయ్యు డొకడుండెను.౹ 

2.అతడు రాత్రియందు ఆయనయొద్దకు వచ్చి–బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మే మెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచకక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను.౹ 

3.అందుకు యేసు అతనితో –ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.౹ 

4.అందుకు నీకొదేము – ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా౹ 

5.యేసు ఇట్లనెను–ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ 

6.శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది.౹ 

7.మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.౹ 

8.గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.౹

కీర్తనలు 103 : 15.నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును.

16.దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు.

17.ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుసరించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద

18.ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును.

19.యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటిమీద రాజ్యపరిపాలనచేయుచున్నాడు.

20.యెహోవాదూతలారా,ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా,ఆయనను సన్నుతించుడి.

పేతురు తన ప్రకటన ద్వారా అధికారాన్ని పొందుట

మత్తయి 16 : 13.యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి–మనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా 

14.వారు కొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. 

15.అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను. 

16.అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. 

17.అందుకు యేసు–సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు.

18.మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. 

19.పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. 

20.అటుపిమ్మట తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.

దేవుని రాజ్యముపై బోధించుట

మత్తయి 4 : 23.యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమునుగూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను. 

24.ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగములచేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపెట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. 

25.గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దానునకు అవతలనుండియు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను.

అపొస్తలుల కార్యములు 28 : 23.అతనికి ఒక దినము నియమించి, అతని బసలోనికి అతనియొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమునుండి సాయంకాలమువరకు అతడు దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములోనుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసునుగూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను.

24.అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి.౹

25.వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్లిపోయిరి. అదేదనగా.

26.–మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు; చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని యీ ప్రజలయొద్దకు వెళ్లి చెప్పుము.౹

27.ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనసార గ్రహించి నావైపు తిరిగి నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసికొనియున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్తద్వారా మీపితరులతో చెప్పిన మాట సరియే.౹ 

28-29.కాబట్టి దేవునివలననైన యీ రక్షణ అన్యజనులయొద్దకు పంపబడి యున్నదని మీరు తెలిసికొందురుగాక, వారు దాని విందురు.

1 కొరింథీయులకు 15 : 42.మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును;౹ 

43.ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలీహనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును;౹ 

44.ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీర మున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడ ఉన్నది.౹ 

45.ఇందు విషయమై–ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను.౹ 

46.ఆత్మసంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతిసంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది.౹ 

47.మొదటి మను ష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.౹ 

48.మంటినుండి పుట్టినవాడెట్టివాడో మంటినుండి పుట్టినవారును అట్టివారే, పరలోకసంబంధి యెట్టివాడో పరలోకసంబంధులును అట్టి వారే.౹ 

49.మరియు మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోకసంబంధి పోలికయు ధరింతుము.

50.సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.౹ 

51-52.ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.౹ 

53.క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది.౹ 

54.ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, –విజయమందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.౹ 

55.ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీముల్లెక్కడ?౹ 

56.మరణపుముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.౹

57.అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.౹ 

1 కొరింథీయులకు 4 : 16.క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమంది యున్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.౹ 

17.ఇందునిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును.౹ 

18.నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరుప్పొంగుచున్నారు.౹ 

19.ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.౹ 

20.దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది.౹ 

21.మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీయొద్దకు రావలెనా? ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా?

మరొకరు ఆహారము మీద పొరపాట్లు చేయవద్దు

రోమా 14 : 13.కాగా మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చ కుందము. ఇదియుగాక, సహోదరునికి అడ్డైమెనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించు కొనుడి.౹ 

14.సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని యెంచుకొనువానికి అది నిషిద్ధమే.౹ 

15.నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించినయెడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొను వాడవు కావు. ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనముచేత పాడు చేయకుము.౹ 

16.మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి.౹ 

17.దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.౹ 

18.ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై యున్నాడు.౹ 

19.కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము.౹ 

20.భోజనము నిమిత్తము దేవుని పనిని పాడుచేయకుడి; సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము.౹ 

21.మాంసము తినుట గాని, ద్రాక్షారసము త్రాగుటగాని, నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని, మానివేయుట మంచిది.౹ 

22.నీకున్న విశ్వాసము దేవుని యెదుట నీమట్టుకు నీవే యుంచుకొనుము; తాను సమ్మతించిన విషయములో తనకుతానే తీర్పు తీర్చు కొననివాడు ధన్యుడు.౹ 

23.అనుమానించువాడు తినినయెడల విశ్వాసములేకుండ తినును, గనుక దోషి యని తీర్పు నొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.

పరలోక రాజ్యము యొక్క దర్శనమును దానియేలు వివరించుట

దానియేలు 2 : 31.రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమకనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును, భయంకరమునైన రూపమును గలదై తమరియెదుట నిలిచెను.౹ 

32.ఆ ప్రతిమయొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములును వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు,౹ 

33.దాని మోకాళ్లు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునైయుండెను.౹ 

34.మరియు చేతిసహాయము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీదపడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కనబడెను.౹ 

35.అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను; ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమాయెను.౹ 

36.తాము కనిన కల యిదే, దాని భావము రాజుసముఖమున మేము తెలియ జెప్పెదము.౹ 

37.రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్ర హించియున్నాడు; తమరు రాజులకు రాజైయున్నారు.౹ 

38.ఆయన మనుష్యులు నివసించు ప్రతిస్థలమందును, మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్నిటిని ఆయన తమరి చేతి కప్పగించియున్నాడు, వారందరి మీద తమరికి ప్రభుత్వము ననుగ్రహించియున్నాడు; తామే ఆ బంగారపు శిరస్సు 

39.తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యముకంటె తక్కువైన రాజ్యమొకటి లేచును. అటుతరువాత లోకమంత యేలునట్టి మూడవ రాజ్యమొకటి లేచును. అది యిత్తడి వంటిదగును.౹ 

40.పిమ్మట నాలుగవ రాజ్యమొకటి లేచును. అది ఇనుమువలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైనవాటిని దంచి విరుగగొట్టునది గదా; ఇనుము పగులగొట్టునట్లు అది రాజ్యములన్నిటిని పగులగొట్టి పొడిచేయును.౹ 

41.పాదములును వ్రేళ్లును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసియున్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో ఆలాగుననుండును, ఆ రాజ్యము ఇనుమువంటి బలముగలదై యుండును.౹ 

42.పాదముల వ్రేళ్లు కొంతమట్టునకు ఇనుపవిగాను కొంతమట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును.౹ 

43.ఇనుమును బురదయు మిళితమై యుండుట తమరికి కనబడెను; అటువలె మనుష్య జాతులు మిళితములై యినుము మట్టితో అతకనట్లువారు ఒకరితో ఒకరు పొసగకయుందురు.౹ 

44.ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిం చును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.౹ 

45.చేతి సహాయము లేక పర్వతమునుండి తియ్యబడిన ఆ రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే; యిందువలన మహా దేవుడు ముందు జరుగబోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు; కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను.౹ 

దానియేలు 7 : 23.నేనడిగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెను–ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోక మంతయు భక్షించును.౹ 

24.ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పదిమంది రాజులను సూచించుచున్నవి; కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరియొక రాజుపుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును.౹ 

25.ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయపద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు.౹ 

26.అతని యధికారము నశింపజేయుటకును నిర్మూలముచేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది కొట్టి వేయబడును.౹ 

27.ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను.౹ 

ప్రకటన 11 : 15.ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు–ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగములవరకు ఏలుననెను.౹ 

16.అంతట దేవునియెదుట సింహాసనాసీనులగు ఆ యిరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారముచేసి౹ 

17.–వర్తమానభూతకాలములలోఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.౹ 

18.జనములు కోప గించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి.

19.మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుము లును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.

జెకర్యా 14 : 6.యెహోవా, ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును.౹ 

7.ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రికాదు; అస్తమయకాలమున వెలుతురు కలుగును.౹ 

8.ఆ దినమున జీవజలములు యెరూషలేములోనుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవికాలమందును చలికాలమందును ఆలాగుననే జరుగును.౹ 

9.యెహోవా సర్వలోకమునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును.౹

తుది తీర్పు

మత్తయి 24 : 9.అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు. 

10.అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు. 

11.అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు; 

12.అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును. 

13.అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును. 

14.మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.

మత్తయి 25 : 31.తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతోకూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండును. 

32.అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి 

33.తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. 

34.అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. 

35.నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; 

36.దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును 

37.అందుకు నీతిమంతులు–ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? 

38.ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? 

39.ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. 

40.అందుకు రాజు–మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. 

41.అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. 

42.నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పి గొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు; 

43.పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. 

44.అందుకు వారును–ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, పరదేశివైయుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. 

45.అందుకాయన–మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. 

46.వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు.

అపొస్తలుల కార్యములు 1 : 4.ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను–మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి;౹ 

5.యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను.

6.కాబట్టి వారు కూడివచ్చినప్పుడు–ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన౹ 

7.–కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.౹ 

8.అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.౹

పరలోక రాజ్యముపై ఉపమానములు

మత్తయి 13

విత్తువాని యొక్క ఉపమానము

1.ఆ దినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. 

2.బహుజనసమూహములు తన యొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుండెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా 

3.ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా – ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. 

4.వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మ్రింగివేసెను 

5.కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని 

6.సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. 

7.కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను. 

8.కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను. 

9.చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.

విత్తువాని  ఉపమానము యొక్క వివరణ

18-19.విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే. 

20.రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు. 

21.అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతర పడును. 

22.ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. 

23.మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను.

కలుపు మొక్కల ఉపమానము

24.ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనమువిత్తిన యొక మనుష్యుని పోలియున్నది. 

25.మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమలమధ్యను గురుగులు విత్తిపోయెను. 

26.మొలకలు పెరిగి గింజపెట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను. 

27.అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి –అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనమువిత్తితివి గదా, అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి. 

28.–ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు–మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి. 

29.అందుకతడు –వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు. 

30.కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను.

ఆవగింజలు మరియు పులియబెట్టుట

31.ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను–పరలోకరాజ్యము, ఒకడు తీసికొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. 

32.అది విత్తనములన్నిటిలో చిన్నదేగాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును.

33.ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను–పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది.

ప్రవచనములు మరియు ఉపమానములు

34.నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడిన సంగతులను తెలియజెప్పెదను

35.అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధిం చెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.

కలుపు మొక్కల ఉపమాన వివరణ

36.అప్పుడాయన జనసమూహములను పంపివేసి, యింటిలోనికి వెళ్లగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చి–పొలము లోని గురుగులనుగూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమనిరి. 

37.అందుకాయన ఇట్లనెను–మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు; 

38.పొలము లోకము; మంచి విత్తనములు రాజ్య సంబంధులు; గురుగులు దుష్టుని సంబంధులు

39.వాటిని విత్తిన శత్రువు అపవాది; కోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు. 

40.గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో ఆలాగే యుగ సమాప్తియందు జరుగును. 

41.మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. 

42.అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును. 

43.అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక.

పొలములో దాచబడిన ధనము ఉపమానము

44.పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును.

మంచి ముత్యముల ఉపమానము

45.మరియు పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది

46.అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును.

చేపల వల ఉపమానము

47.మరియు పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పెట్టిన వలను పోలియున్నది. 

48.అది నిండినప్పుడు దానిని దరికి లాగి, కూర్చుండి, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. 

49.ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి, 

50.వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును.

51.వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితి మనిరి. 

52.ఆయన అందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగాచేరిన ప్రతిశాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను.

మత్తయి 19 : 13.అప్పుడు ఆయన వారిమీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. 

14.ఆయన శిష్యులు, తీసికొనివచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పి 

15.వారిమీద చేతులుంచి, అక్కడనుంచి లేచిపోయెను.

కొలొస్సయులకు 1 : 9-12.అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతోకూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు చున్నాము.౹ 

13.ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.౹ 

14.ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది.

లూకా 13 : 22.ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచా రము చేయుచుండెను. 

23.ఒకడు–ప్రభువా, రక్షణపొందువారు కొద్దిమందేనా? అని ఆయన నడుగగా 

24.ఆయన వారిని చూచి–ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను. 

25.ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి–అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించి నప్పుడు 

26.ఆయన–మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరునీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే; నీవు మా వీధులలో బోధించితివే అని చెప్ప సాగుదురు. 

27.అప్పుడాయన– మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పు చున్నాను; అక్రమముచేయు మీరందరు నా యొద్దనుండి తొలగిపొండని చెప్పును. 

28.అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. 

29.మరియు జనులు తూర్పునుండియు పడమటనుండియు ఉత్తరమునుండియు దక్షిణమునుండియువచ్చి, దేవుని రాజ్యమందు కూర్చుందురు

30.ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటివారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను.

యెషయా 9 : 6.ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును.ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

7.ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును.సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

ప్రకటన 5 : 6.మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.౹ 

7.ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండువాని కుడిచేతిలోనుండి ఆ గ్రంథమును తీసికొనెను.౹ 

8.ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.౹ 

9-10.ఆ పెద్దలు– నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులనుకొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.౹ 

11.మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించియున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను.౹ 

12.వారు–వధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.౹ 

13.అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును –సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.౹ 

14.ఆ నాలుగు జీవులు–ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి.

 

Related Quiz Articles