మాదీయుల మరియు పారసీకుల ప్రవాసం నుండి ఇశ్రాయేలీయుల విడుదల – IIవ భాగము

యిర్మీయా 29:10

యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు: బబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మునుగూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును.౹

ఎజ్రా గ్రంధముపై పట్టిక భాగం

ఎజ్రా 7 ఎజ్రా యెరూషలేమునకు వచ్చుట 

7 ఈ సంగతులు జరిగినపిమ్మట పారసీకదేశపు రాజైన అర్తహషస్తయొక్క యేలుబడిలో ఎజ్రా బబులోను దేశమునుండి యెరూషలేముపట్టణమునకు వచ్చెను. ఇతడు శెరాయా కుమారుడైయుండెను, శెరాయా అజర్యా కుమారుడు అజర్యా హిల్కీయా కుమారుడు 

2.హిల్కీయా షల్లూము కుమారుడు షల్లూము సాదోకు కుమారుడు సాదోకు అహీటూబు కుమారుడు 

3.అహీటూబు అమర్యా కుమారుడు అమర్యా అజర్యా కుమారుడు అజర్యా మెరాయోతు కుమారుడు 

4.మెరాయోతు జెరహ్యా కుమారుడు జెరహ్యా ఉజ్జీ కుమారుడు ఉజ్జీ బుక్కీ కుమారుడు 

5.బుక్కీ అబీషూవ కుమారుడు అబీషూవ ఫీనెహాసు కుమారుడు ఫీనెహాసు ఎలియాజరు కుమారుడు ఎలియాజరు ప్రధానయాజకుడైన అహరోను కుమారుడు.౹ 

6.ఈ ఎజ్రా ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషేయొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణతగల శాస్త్రి. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును.౹ 

7.మరియు రాజైన అర్తహషస్త ఏలుబడియందు ఏడవ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును యాజకులు కొందరును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి.౹ 

8.రాజు ఏలుబడియందు ఏడవ సంవత్సరము అయిదవ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను.౹ 

9.మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశమునుండి బయలుదేరి, తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున అయిదవ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను.౹ 

10.ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసికొనెను.

రాజైన అర్తహషస్త ఎజ్రాకు రాసిన లేఖ

11.యెహోవా ఆజ్ఞల వాక్యములయందును, ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడలయందును శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త యిచ్చిన తాకీదు నకలు 

12.–రాజైన అర్తహషస్త, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము, మొదలగు మాటలు వ్రాసి యీలాగు సెలవిచ్చెను 

13.–చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమునుబట్టి యూదానుగూర్చియు యెరూషలేమునుగూర్చియు విమర్శచేయుటకు నీవు రాజుచేతను అతని యేడుగురు మంత్రులచేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయ మేమనగా,౹ 

14.మా రాజ్యమందుండు ఇశ్రాయేలీయులలోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్లుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరు నీతోకూడ వెళ్లవచ్చును.౹ 

15.మరియు యెరూషలేములో నివాసముగల ఇశ్రాయేలీయుల దేవునికి రాజును అతనియొక్క మంత్రులును స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసికొని పోవలెను.౹ 

16.మరియు బబులోను ప్రదేశమందంతట నీకు దొరకు వెండి బంగారములంతయును, జనులును యాజకులును యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసికొని పోవలెను.౹ 

17.తడవు చేయక నీవు ఆ ద్రవ్యముచేత ఎడ్లను పొట్లేళ్లను గొఱ్ఱెపిల్లలను, వాటితోకూడ ఉండవలసిన భోజనార్పణలను పానార్పణలనుకొని, యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము.౹ 

18.మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికిని యుక్తమని తోచినదానిని చేయ వచ్చును.౹ 

19.మరియు నీ దేవుని మందిరపు సేవకొరకు నీకియ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని యెదుట అప్పగింపవలెను.౹ 

20.నీ దేవుని మందిర విషయములో దానమిచ్చుటకై మరి ఏదైనను నీకు కావలసినయెడల అది రాజుయొక్క ఖజానాలోనుండి నీకియ్యబడును.౹ 

21.మరియు–రాజునైన అర్తహషస్త అను నేనే నది యవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ యేదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైన అడిగినయెడల ఆలస్యముకాకుండ మీరు దాని చేయవలెను.౹ 

22.వెయ్యి తూముల గోధుమలు రెండువందల మణుగుల వెండి మూడువందల తూముల ద్రాక్షారసము మూడువందల తూముల నూనె లెక్కలేకుండ ఉప్పును ఇయ్యవలెను.౹ 

23.ఆకాశమందలి దేవునిచేత ఏది నిర్ణయమాయెనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింప వలసినది. రాజుయొక్క రాజ్యముమీదికిని అతని కుమారులమీదికిని కోపమెందుకు రావలెను? 

24.మరియు యాజకులును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును, దేవుని మందిరపు సేవకులునైన వారందరిని గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తుగాని సుంకముగాని పన్నుగాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలిసికొనుడి.౹ 

25.మరియు ఎజ్రా, నది యవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానముచొప్పున నీవు నీ దేవునియొక్క ధర్మశాస్త్రవిధులను తెలిసికొనినవారిలో కొందరిని అధికారులగాను న్యాయాధిపతులగాను ఉంచవలెను, ఆ ధర్మశాస్త్రవిషయములో తెలియని వారెవరో వారికి నేర్పవలెను.౹ 

26.నీ దేవుని ధర్మశాస్త్రముగాని, రాజుయొక్క చట్టము గాని, గైకొననివాడెవడో త్వరగా విచారణచేసి, మరణశిక్షయైనను స్వదేశత్యాగమైనను ఆస్తి జప్తియైనను ఖైదునైనను వానికి విధింపవలెను.

27.యెరూషలేములోనుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను, రాజును అతని మంత్రులును రాజుయొక్క మహాధిపతులును నాకు దయ అనుగ్రహింపజేసినందునను, మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.౹ 

28.నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి, నాతోకూడ వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని.

ఎజ్రా 8 యెరూషలేమునకు తిరిగి వచ్చుట

15.వీరిని నేను అహవా వైపునకు పారు నదియొద్దకు సమకూర్చితిని. అచ్చట మేము మూడుదినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తనికీ చూడగా లేవీయుడొకడును నాకు కనబడలేదు.౹ 

16.అప్పుడు నేను పెద్దలైన ఎలీయెజెరు అరీయేలు షెమయా ఎల్నాతాను యారీబు ఎల్నాతాను నాతాను జెకర్యా మెషుల్లాము అను వారిని, ఉపదేశకులగు యోయారీబు ఎల్నాతానులను పిలువనంపించి 

17–కాసిప్యా అను స్థల మందుండు అధికారియైన ఇద్దోయొద్దకు వారిని పంపి, మా దేవుని మందిరమునకు పరిచారకులను మాయొద్దకు తీసికొని వచ్చునట్లుగా కాసిప్యా అను స్థలమందుండు ఇద్దోతోను అతని బంధువులైన నెతీనీయులతోను చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పితిని.౹ 

18.మా దేవుని కరుణా హస్తము మాకు తోడుగా ఉన్నందునవారు ప్రజ్ఞావంతుడైన ఒక నిని షేరేబ్యాను అతని కుమారులను సహోదరులను, పదు నెనిమిదిమందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు; ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు.౹ 

19.హషబ్యాను అతనితోకూడ మెరారీయుడగు యెషయాను అతని బంధువులును వారి కుమారులునైన యిరువదిమందిని వారు తోడుకొని వచ్చిరి.౹ 

20.మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులును నిర్ణయించిన నెతీనీయులలో రెండువందల ఇరువదిమంది వచ్చిరి. వీరందరును పేర్లు ఉదాహరింపబడి నియమింపబడినవారు.౹ 

21.అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని, మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నదిదగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని.౹ 

22.–మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తముతోడుగా ఉండునుగాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరిమీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులును రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను.౹ 

23.మేము ఉపవాసముండి ఆ సంగతినిబట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను 

24.గనుక నేను యాజకులలోనుండి ప్రధానులైన పండ్రెండు మందిని, అనగా షేరేబ్యాను హషబ్యాను వీరి బంధువులలో పదిమందిని ఏర్పరచి 

25.మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయములో రాజును అతని మంత్రులును అధిపతులును అక్కడ నున్న ఇశ్రాయేలీయులందరును ప్రతిష్ఠించిన వెండిబంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించితిని.౹ 

26.వెయ్యిన్ని మూడువందల మణుగుల వెండిని రెండువందల మణుగుల వెండి ఉపకరణములను, రెండువందల మణుగుల బంగారమును,౹ 

27.ఏడువేల తులములుగల యిరువది బంగారపు గిన్నెలను, బంగారమంత వెలగల పరిశుద్ధమైన రెండు రాగి పాత్రలను తూచి 

28.వారిచేతికి అప్పగించి–మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడినవారు, పాత్రలును ప్రతిష్ఠితములైనవి. ఈ వెండి బంగారములును మీపితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై యున్నవి.౹ 

29.కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో, యాజకులయొక్కయు లేవీయులయొక్కయు ఇశ్రాయేలు పెద్దలయొక్కయు ప్రధానులైన వారియెదుట, వాటిని తూచి అప్పగించువరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని.౹ 

30.కాబట్టి యాజకులును లేవీయులును వాటి యెత్తు ఎంతో తెలిసికొని, యెరూషలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసికొనిరి.

31.మేము మొదటి నెల పండ్రెండవదినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నదినుండి బయలుదేరగా, మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి, శత్రువుల చేతిలోనుండియు మార్గమందు పొంచియున్నవారి చేతిలోనుండియు మమ్మును తప్పించినందున 

32.మేము యెరూషలేమునకు వచ్చి మూడుదినములు అక్కడ బసచేసితిమి.౹ 

33.నాలుగవదినమున వెండి బంగారములును పాత్రలును మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతుచేత తూనిక వేయబడెను. అతనితోకూడ ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను; వీరితో లేవీయులైన యేషూవ కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవద్యాయును కూడనుండిరి.౹ 

34.సంఖ్యచొప్పునను ఎత్తుచొప్పునను అన్నిటిని సరిచూచిన తరువాత వాటి యెత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి.౹ 

35.మరియు చెరలోనికి కొనిపోబడినవారికి పుట్టి చెరనుండి విడుదలనొంది తిరిగి వచ్చినవారు ఇశ్రాయేలీయుల దేవునికి దహనబలులు అర్పించిరి. ఇశ్రాయేలీయులందరికొరకు పండ్రెండు ఎడ్లను తొంబది యారు పొట్టేళ్లను డెబ్బదియేడు గొఱ్ఱెపిల్లలను, పాపపరిహారార్థబలిగా పండ్రెండు మేకపోతులను తెచ్చి అన్నిటిని దహనబలిగా యెహోవాకు అర్పించిరి.౹ 

36.వారు రాజుయొక్క నిర్ణయములను రాజుయొక్క సేనాధిపతులకును నది యివతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి.

ఎజ్రా 9 జాత్యంతర వివాహముల గురించి ఎజ్రా ప్రార్థన

9 ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి–ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును, కనానీయులు హిత్తీయులు పెరిజ్జీయులు యెబూసీయులు అమ్మోనీయులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరీయులు అను దేశపు జనములలోనుండి తమ్మును తాము వేరు పరచుకొనక, వారుచేయు అసహ్యమైన కార్యములను తామేచేయుచు,౹ 

2.వారి కుమార్తెలను పెండ్లి చేసికొనుచు, తమ కుమారులకును తీసికొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనినవారైరి. ఈ అపరాధము చేసినవారిలో పెద్దలును అధికారులును నిజముగా ముఖ్యులై యుండిరని చెప్పిరి.౹ 

3.నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని, నా తల వెండ్రుకలను నా గడ్డపు వెండ్రుకలను పెరికి వేసికొని విభ్రాంతిపడి కూర్చుంటిని.౹ 

4.చెరపట్ట బడినవారి అపరాధమును చూచి, ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరును నాయొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళవరకు కూర్చుంటిని.౹ 

5.సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి, నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్లమీద పడి, నా దేవుడైన యెహోవాతట్టు చేతులెత్తి 

6.–నా దేవా నా దేవా, నా ముఖము నీవైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై యున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత యెత్తుగా పెరిగియున్నది.౹ 

7.మా పితరుల దినములు మొదలుకొని నేటివరకు మేము మిక్కిలి అపరాధులము; మా దోషములనుబట్టి మేమును మా రాజులును మా యాజకులును అన్యదేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటిదినముననున్నట్లు అప్పగింపబడుటచేత మిగుల సిగ్గునొందినవార మైతిమి.౹ 

8.అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి, మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్ల జేయునట్లుగాను, మాలో ఒక శేషము ఉండ నిచ్చినట్లుగాను, తన పరిశుద్ధస్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను, మా దేవుడైన యెహోవా కొంతమట్టుకు మాయెడల దయ చూపియున్నాడు.౹ 

9.నిజముగా మేము దాసులమైతిమి; అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మును విడువక, పారసీకదేశపు రాజులయెదుట మాకు దయ కనుపరచి, మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి, దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుటకును, యూదాదేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపించితివి.౹ 

10.మా దేవా, యింత కృపనొందిన తరువాత మేమేమి చెప్ప గలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసులద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి గదా.౹ 

11.వారు–మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అప విత్రతచేతను వారుచేయు అసహ్యమైన వాటిచేతను అపవిత్రమాయెను, వారు జరిగించిన అసహ్యమైన వాటిచేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయెను.౹ 

12.కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకియ్యకుడి. వారి కుమార్తెలను మీ కుమారులకొరకు పుచ్చుకొనకుడి. మరియు వారికి క్షేమభాగ్యములు కలుగవలెనని మీరు ఎన్నటికిని కోరకుండినయెడల, మీరు బలముగానుండి, ఆ దేశముయొక్క సుఖమును అనుభవించి, మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాని నప్పగించెదరని చెప్పిరి.౹ 

13.అయితే మా దుష్క్రియలనుబట్టియు మా గొప్ప అపరాధములనుబట్టియు ఈ శ్రమలన్నియు మామీదికి వచ్చిన తరువాత, మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మామీద ఉంచి, మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి 

14.ఈ అసహ్యకార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసికొనినయెడల, మేము నాశనమగువరకు శేషమైననులేకుండునట్లును, తప్పించుకొనుటకు సాధనమైననులేకుండునట్లును, నీవు కోపపడుదువు గదా.౹ 

15.యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై యున్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము; మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థనచేసితిని.

ఎజ్రా 10 ప్రజల పాపముల ఒప్పుకోలు

10 ఎజ్రా యేడ్చుచు దేవుని మందిరము ఎదుట. సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థనచేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా 

2.ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను –మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లిచేసికొని మా దేవునిదృష్టికి పాపము చేసితిమి; అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడ వడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు.౹ 

3.కాబట్టి యీ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచ ననుబట్టియు, దైవాజ్ఞకు భయపడువారి యోచననుబట్టియు, ఈ భార్యలను వారికి పుట్టినవారిని వెలివేయించెదమని మన దేవునితో నిబంధన చేసికొనెదము.౹ 

4.లెమ్ము ఈ పని నీ యధీనములోనున్నది, మేమును నీతోకూడ నుందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీని జరిగించుమనగా 

5.ఎజ్రా లేచి, ప్రధానయాజకులును లేవీయులును ఇశ్రాయేలీయులందరును ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారిచేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసికొనగా 

6.ఎజ్రా దేవుని మందిరము ఎదుటనుండి లేచి, ఎల్యాషీబు కుమారుడైన యోహానానుయొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి, చెరపట్టబడినవారి అపరాధమునుబట్టి దుఃఖించుచు, భోజనమైనను పానమైనను చేయకుండెను.౹ 

7.చెరనుండి విడుదల నొందినవారందరు యెరూషలేమునకు కూడి రావలెనని యూదా దేశమంతటియందును యెరూషలేము పట్టణమందును ప్రకటనచేయబడెను.౹ 

8.మరియు మూడుదినములలోగా ప్రధానులును పెద్దలును చేసిన యోచనచొప్పున ఎవడైనను రాకపోయినయెడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు, వాడు విడుదల నొందినవారి సమాజములోనుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి.౹ 

9.యూదా వంశస్థులందరును బెన్యామీనీయులందరును ఆ మూడుదినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది తొమ్మిదవ నెల; ఆ నెల యిరువదియవ దినమున జనులందరును దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాలచేత తడియుచు, ఆ సంగతిని తలం చుటవలన వణకుచుండిరి.

10.అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను –మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లిచేసికొని, ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి.౹ 

11.కాబట్టి యిప్పుడు మీపితరులయొక్క దేవుడైన యెహోవా యెదుట మీ పాపమును ఒప్పుకొని, ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి, దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని యుండుడి.౹ 

12.అందుకు సమాజకులందరు ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి–నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసియున్నది.౹ 

13.అయితే జనులు అనేకులై యున్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము, ఈ పని యొకటి రెండు దినములలో జరుగునది కాదు; ఈ విషయములో అనేకులము అపరాధులము; కాబట్టి సమాజపు పెద్దలనందరిని యీ పనిమీద ఉంచవలెను,౹ 

14.మన పట్టణములయందు ఎవరెవరు అన్యస్త్రీలను పెండ్లిచేసికొనిరో వారందరును నిర్ణయకాలమందు రావలెను; మరియు ప్రతి పట్టణముయొక్క పెద్దలును న్యాయాధిపతులును ఈ సంగతినిబట్టి మామీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మామీదికి రాకుండ తొలగి పోవునట్లుగా వారితోకూడ రావలెను అనిచెప్పెను.౹ 

15.అప్పుడు అశాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణ యింప బడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్బెతైయును వారికి సహాయులై యుండిరి.౹ 

16.చెరనుండి విడుదలనొందినవారు అట్లుచేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులును వారి పితరుల యింటి పేరులనుబట్టి తమతమ పేరుల ప్రకారము అందరిని వేరుగా ఉంచి, పదియవ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి.౹ 

17.మొదటి నెల మొదటి దినమున అన్యస్త్రీలను పెండ్లి చేసికొనిన వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి.

జాత్యంతర వివాహము వలన దోషులుగా భావించుకొనినవారు

18.యాజకుల వంశములో అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యున్నట్లు కనబడినవారు ఎవరనగా – యోజాదాకు కుమారుడైన యేషూవ వంశములోను, అతని సహోదరులలోను మయశేయాయు, ఎలీయెజెరును, యారీబును గెదల్యాయును.౹ 

19.(వీరు తమ భార్యలను పరిత్యజించెదమని మాట యిచ్చిరి. మరియు వారు అపరాధులై యున్నందున అపరాధ విషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి.౹ )

హగ్గయి

హగ్గయి 1 యెహోవా మందిరమును పునర్నిర్మించుటకు పిలుపు 

1 రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయిద్వారా యూదా దేశముమీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధానయాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –సైన్యములకధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా 

2.సమయమింక రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే.౹ 

3.అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయిద్వారా సెలవిచ్చినదేమనగా 

4.ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నివసించుటకు ఇది సమయమా? 

5.కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా –మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.౹ 

6.మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనముచేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానముచేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పు కొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.౹ 

7.కాగా సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.౹ 

8.పర్వతములెక్కి మ్రాను తీసికొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినయెడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ 

9.విస్తారముగా కావలెనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను; మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని; ఎందు చేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడైయుండగా మీరందరు మీ మీ యిండ్లు కట్టుకొనుటకు త్వరపడుటచేతనే గదా.౹ 

10.కాబట్టి మిమ్మునుబట్టి ఆకాశపుమంచు కురువకయున్నది, భూమి పండక యున్నది.౹ 

11.నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి, ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్తము విషయములోను మనుష్యుల విషయములోను పశువుల విషయములోను చేతిపనులన్నిటి విషయములోను క్షామము పుట్టించియున్నాను.

12.షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహో జాదాకు కుమారుడును ప్రధానయాజకుడునగు యెహోషు వయు శేషించిన జనులందరును తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపించి, తెలియజేసిన వార్త విని యెహోవాయందు భయభక్తులు పూనిరి.౹ 

13.అప్పుడు యెహోవాదూతయైన హగ్గయి యెహోవా తెలియ జేసిన వార్తనుబట్టి జనులకు ప్రకటించినదేమనగా–నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే యెహోవా వాక్కు.౹ 

14.యెహోవా యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుయొక్క మనస్సును, ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును,శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా 

15.వారు కూడివచ్చి, రాజైన దర్యావేషుయొక్క యేలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల యిరువది నాలుగవదినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి.

హగ్గయి 2 కడవరి మందిరముయొక్క వాగ్దాన మహిమ

2 ఏడవ నెల యిరువది యొకటవదినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా 

2.నీవు యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోను ఇట్లనుము 

3.పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచినవారు మీలో ఉన్నారు గదా; అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడు చున్నది? దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచు చున్నది గదా.౹ 

4.అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా–జెరుబ్బాబెలూ, ధైర్యము తెచ్చుకొమ్ము; ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువా, ధైర్యము తెచ్చుకొమ్ము; దేశములోనున్న సమస్తజనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి; నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.౹ 

5.మీరు ఐగుప్తుదేశములోనుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసికొనుడి; నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి.౹ 

6.మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా – ఇక కొంతకాలము ఇంకొకమారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును.౹ 

7.నేను అన్యజనులనందరిని కద లింపగా అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.౹ 

8. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.౹ 

9.ఈ కడవరి మందిరముయొక్క మహిమమునుపటి మందిరముయొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించెదను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

అపవిత్రమైన ప్రజలకు ఆశీర్వాదము

10.మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము తొమ్మిదవనెల యిరువది నాల్గవదినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా 

11.సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–యాజకులయొద్ద ధర్మశాస్త్ర విచారణచేయుము.౹ 

12.ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపుచెంగున కట్టుకొని, తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏవిధమగు భోజనపదార్థమునైనను ముట్టినయెడల, ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా? యని యాజకులనడుగగా వారు కాదనిరి 

13.శవమును ముట్టుటవలన ఒకడు అంటుపడి అట్టివాటిలో దేనినైనను ముట్టినయెడల తాను ముట్టినది అపవిత్రమగునాయని హగ్గయి మరల నడుగగా యాజకులు –అది అపవిత్రమగు ననిరి.౹ 

14.అప్పుడు హగ్గయి వారికీలాగు ప్రత్యుత్తరమిచ్చెను–ఈ ప్రజలును ఈ జనులును నా దృష్టికి ఆలాగుననేయున్నారు; వారుచేయు క్రియలన్నియు వారచ్చట అర్పించునవియన్నియు నా దృష్టికి అపవిత్రములు; ఇదే యెహోవా వాక్కు.౹ 

15.–ఈ రాతి మీద రాయియుంచి యెహోవా మందిరము కట్టనారం భించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించినదానిని ఆలోచనచేసికొనుడి.౹ 

16.నాటనుండి యొకడు ఇరువది కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలు చున్నది; తీసికొనవలెనని ఏబది కొలల తొట్టియొద్దకు ఒకడు రాగా ఇరువదికొలలు మాత్రమే దొరకును.౹ 

17.తెగులుతోను కాటుకతోను వడగండ్లతోను మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసియున్నాను; అయినను మీలో ఒకడును తిరిగి నాయొద్దకు రాలేదు; ఇదే యెహోవా వాక్కు.౹ 

18.మీరు ఆలోచించుకొనుడి. ఇంతకుముందుగా తొమ్మిదవ నెల యిరువది నాలుగవ దినమునుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటనుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి.౹ 

19.కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్షచెట్లయినను అంజూరపుచెట్లయినను దానిమ్మచెట్లయి నను ఒలీవచెట్లయినను ఫలించకపోయెను గదా.                     “అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను.”

జెరుబ్బాబెలు యెహోవా ముద్ర యుంగరము

20.మరియు ఆ నెల యిరువది నాలుగవదినమున యెహోవా వాక్కు హగ్గయికి మరల ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా 

21.యూదాదేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము–ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను.౹ 

22.రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును; అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును; రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును; గుఱ్ఱములును రౌతులును ఒకరి ఖడ్గముచేత ఒకరు కూలుదురు.౹ 

23.నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడవునైన జెరుబ్బాబెలూ, నేను నిన్ను ఏర్పరచుకొనియున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసికొని ముద్ర యుంగరముగా చేతును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

జెకర్యా గ్రంధము

అధ్యాయములు 1 – 6

ప్రవాసము నుండి తిరిగి వచ్చుట గురించిన ప్రవచనాలు మరియు ప్రవక్త దర్శనాలు

“శక్తిచేతనైనను బలముచేతనైననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని” -జెకర్యా 4:6

జెకర్యా 1 యెహోవా వైపుకు తిరిగి మరులుటకు పిలుపు 

1 దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా 

2.–యెహోవా మీపితరులమీద బహుగా కోపించెను.౹ 

3.కాబట్టి నీవు వారితో ఇట్లనుము –సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున దేమనగా–మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీతట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.౹ 

4.మీరు మీపితరులవంటివారై యుండవద్దు; పూర్వికులైన ప్రవక్తలు–సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–మీ దుర్మార్గ తను మీ దుష్‌క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించక పోయిరి; ఇదే యెహోవా వాక్కు.౹ 

5.మీపితరు లేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రదుకుదురా? 

6.అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలును కట్టడలును మీపితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి–మన ప్రవర్తననుబట్టియు క్రియలనుబట్టియు యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి.

గొంజి చెట్లలో నిలువబడి యొక మనుష్యుడు

7.మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవ త్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవదినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹ 

8.–రాత్రి ఎఱ్ఱని గుఱ్ఱమునెక్కిన మనుష్యు డొకడు నాకు కనబడెను; అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడియుండగా అతని వెనుక ఎఱ్ఱని గుఱ్ఱములును చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములును తెల్లని గుఱ్ఱములును కనబడెను.౹ 

9.అప్పుడు–నా యేలినవాడా, యివి ఏమని నేనడుగగా నాతో మాటలాడు దూత–ఇవి ఏమియైనది నేను నీకు తెలియజేతుననెను.౹ 

10.అప్పుడు గొంజి చెట్లలో నిలువబడియున్నవాడు–ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుఱ్ఱములని చెప్పెను.౹ 

11.అవి గొంజిచెట్లమధ్యను నిలువబడిన యెహోవాదూతను చూచి–మేము లోకమంతట తిరుగులాడివచ్చియున్నాము; ఇదిగో లోకులందరు శాంతముకలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పెను.౹ 

12.అందుకు యెహోవాదూత – సైన్యములకధిపతియగు యెహోవా, డెబ్బది సంవత్సరములనుండి నీవు యెరూషలేముమీదను యూదా పట్టణములమీదను కోపముంచియున్నావే; యిక ఎన్నాళ్లు కనికరింపకయుందువు అని మనవిచేయగా 

13.యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణయైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను.౹ 

14.కాబట్టి నాతో మాటలాడుచున్నదూత నాతో ఇట్లనెను–నీవు ప్రకటన చేయ వలసినదేమనగా–సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – నేను యెరూషలేము విషయములోను సీయోనువిషయములోను అధికాసక్తి కలిగియున్నాను;౹ 

15.నిమ్మళముగా ఉన్న అన్యజనులమీద నేను బహుగా కోపించుచున్నాను; ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడుచేయవలెనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి.౹ 

16.కాబట్టి యెహోవా సెలవిచ్చున దేమనగా–వాత్సల్యముగలవాడనై నేను యెరూషలేముతట్టు తిరిగియున్నాను; అందులో నా మందిరము కట్టబడును; యెరూషలేముమీద శిల్పకారులు నూలు సాగ లాగుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.౹ 

17.నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా –ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.

నాలుగు కొమ్ములు మరియు నలుగురు కంసాలులు

18.అప్పుడు నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కనబడెను.౹ 

19.– ఇవి ఏమిటివని నేను నాతో మాటలాడుచున్నదూతనడుగగా అతడు–ఇవి యూదావారిని ఇశ్రాయేలువారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను.౹ 

20.యెహోవా నలుగురు కంసాలులను నాకు కనుపరచగా 

21.–వీరేమి చేయబోవుచున్నారని నేనడిగినందుకు ఆయన–ఎవడును తలయెత్తకుండ యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయ పెట్టుటకును, యూదాదేశస్థులనందరిని చెదరగొట్టుటకై వారిమీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను.

జెకర్యా 2 కొలనూలు చేతపట్టుకొనిన యొకడు

2 మరియు నేను తేరిచూడగా కొలనూలు చేతపట్టుకొనిన యొకడు నాకు కనబడెను.౹ 

2.నీ వెక్కడికి పోవు చున్నావని నేనతని నడుగగా అతడు–యెరూషలేముయొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచిచూడ బోవుచున్నాననెను.౹ 

3.అంతట నాతో మాటలాడుచున్న దూత బయలుదేరగా మరియొక దూత యతనిని ఎదుర్కొనవచ్చెను.౹ 

4.రెండవ దూత – పరుగెత్తిపోయి యెరూషలేములో మనుష్యులును పశువులును విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యౌవనునికి తెలియజేయుమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను.౹ 

5.నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దానిమధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు.౹ 

6.ఉత్తర దేశములో ఉన్నవారలారా, తప్పించుకొని రండి; ఆకాశపు నాలుగు వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసియున్నాను; ఇదే యెహోవా వాక్కు.౹ 

7.బబులోనుదేశములో నివాసివగు సీయోనూ, అచ్చటనుండి తప్పించుకొని పొమ్ము; ఇదే యెహోవా వాక్కు–.౹ 

8.సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు.౹ 

9.నేను నా చేతిని వారిమీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు; అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలిసి కొందురు.౹ 

10.సీయోను నివాసులారా, నేను వచ్చి మీమధ్యను నివాసముచేతును; సంతోషముగానుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు.౹ 

11.ఆ దినమున అన్యజనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును; అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలిసి కొందురు.౹ 

12.మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.౹ 

13.సకలజనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై యుండుడి.

జెకర్యా 3 ప్రధాన యాజకునికి ప్రశస్తమైన వస్త్రములు 

3 మరియు యెహోవాదూతయెదుట ప్రధానయాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను.౹ 

2.– సాతానూ, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలోనుండి తీసిన కొరవివలెనే యున్నాడుగదా అని యెహోవాదూత సాతానుతో అనెను.౹ 

3.యెహోషువ మలిన వస్త్రములు ధరించినవాడై దూత సముఖములో నిలువబడియుండగా 

4.దూత దగ్గర నిలిచియున్నవారిని పిలిచి–ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి–నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను.౹ 

5.–అతని తలమీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవిచేయగా వారు అతని తలమీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి; యెహోవాదూత దగ్గర నిలుచుండెను.౹ 

6.అప్పుడు యెహోవాదూత యెహోషువకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను.౹ 

7.సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా – నా మార్గములలో నడుచుచు నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనినయెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును.౹ 

8.ప్రధానయాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను.౹ 

9.యెహోషువ యెదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి ఏడు నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు; మరియు ఒక దినము లోగానే నేను ఈ దేశముయొక్క దోషమును పరిహ రింతును;౹ 

10.ఆ దినమున ద్రాక్షచెట్లక్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరు ఒకరినొకరు పిలుచుకొనిపోవుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

జెకర్యా 4 సువర్ణమయమైన దీపస్తంభము మరియు రెండు ఒలీవచెట్లు

 4 నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొకని లేపినట్లు నన్ను లేపి 

2.నీకు ఏమి కనబడు చున్నదని యడుగగా నేను–సువర్ణమయమైన దీపస్తంభమును దానిమీద ఒక ప్రమిదెయును, దీపస్తంభమునకు ఏడు దీపములును దీపమునకు ఏడేసి గొట్టములును కనబడుచున్నవి.౹ 

3.మరియు రెండు ఒలీవచెట్లు దీపస్తంభమునకు కుడిప్రక్క ఒకటియు ఎడమప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి 

4.–నా యేలినవాడా, యిదేమిటియని నాతో మాటలాడుచున్న దూత నడిగితిని.౹ 

5.నాతో మాటలాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా యని నన్నడుగగా–నేను–నా యేలినవాడా, నాకు తెలియదంటిని.౹ 

6-7.అప్పుడతడు నాతో ఇట్లనెను–జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేతనైనను బలముచేతనైననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదునుభూమి వగుదువు; –కృప కలుగును గాక కృప కలుగునుగాక అని జనులు కేకలువేయగా అతడు పైరాయి తీసికొని పెట్టించును.౹ 

8.యెహోవా వాక్కు మరల నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 

9.– జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసియున్నవి, అతనిచేతులు ముగించును, అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీయొద్దకు పంపియున్నాడని నీవు తెలిసికొందువు.౹ 

10.కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారముచేయు యెహోవాయొక్క యేడు నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుటచూచి సంతోషించును.౹ 

11.దీపస్తంభమునకు ఇరుప్రక్కలనుండు ఈ రెండు ఒలీవచెట్లు ఏమిటివనియు,౹ 

12.రెండు బంగారపు కొమ్ములలోనుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మలును ఏమిటివనియు నేనతని నడుగగా 

13.అతడు నాతో–ఇవేమిటివని నీకు తెలియదా యనెను–నా యేలినవాడా, నాకు తెలియదని నేననగా 

14.అతడు–వీరిద్దరు సర్వలోకనాధుడగు యెహోవాయొద్ద నిలువబడుచు తైలము పోయువారై యున్నారనెను.

జెకర్యా 5 ఎగిరే పుస్తకము 

నేను మరల తేరిచూడగా ఎగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడెను.౹ 

2.నీకేమి కనబడుచున్నదని అతడు నన్నడుగగా నేను, –ఇరువైమూరల నిడివియు పదిమూరల వెడల్పునుగల యెగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడు చున్నదంటిని.౹ 

3.అందుకతడు నాతో ఇట్లనెను–ఇది భూమియంతటిమీదికి బయలువెళ్లు శాపమే; దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి దొంగిలువారందరును కొట్టివేయబడుదురు; రెండవ ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి అప్రమాణికులందరును కొట్టివేయబడుదురు.౹ 

4.ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు– నేనే దాని బయలుదేరజేయుచున్నాను; అది దొంగలయిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధప్రమాణము చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును.

కొల తూములో కూర్చున్న యొక స్త్రీ

5.అప్పుడు నాతో మాటలాడుచున్న దూత బయలు వెళ్లి–నీవు నిదానించి చూచి ఇవతలకు వచ్చునదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా 

6.ఇదేమిటియని నేనడిగితిని. అందుకతడు–ఇది కొల, ఇది బయలువెళ్లు తూము అనెను; మరియు లోకమంతటను జనులు ఈలాగున కనబడుదురని చెప్పెను.౹ 

7.అప్పుడు సీసపుబిళ్లను తీయగా కొల తూములో కూర్చున్న యొక స్త్రీ కనబడెను.౹ 

8.అప్పుడతడు–ఇది దోషమూర్తి యని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపుబిళ్లను తూముమీద నుంచెను.౹ 

9.నేను మరల తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరిరి; సంకుబుడి కొంగ రెక్కలవంటి రెక్కలు వారికుండెను, గాలి వారి రెక్కలను ఆడించుచుండెను, వారు వచ్చి తూమును భూమ్యాకాశములమధ్యకు ఎత్తి దాని మోసిరి.౹ 

10.వీరు ఈ తూమును ఎక్కడికి తీసికొని పోవుదురని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా 

11.–షీనారుదేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు; అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠముమీద పెట్టియుంచుదురని అతడు నాకుత్తర మిచ్చెను.

జెకర్యా 6 నాలుగు రథములు

6 నేను మరల తేరిచూడగా రెండు పర్వతములమధ్యనుండి నాలుగు రథములు బయలుదేరుచుండెను, ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై యుండెను.౹ 

2.మొదటి రథమునకు ఎఱ్ఱని గుఱ్ఱములు, రెండవ రథమునకు నల్లని గుఱ్ఱములు,౹ 

3.మూడవ రథమునకు తెల్లని గుఱ్ఱములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలుగల బలమైన గుఱ్ఱము లుండెను.౹ 

4.నా యేలినవాడా, యివేమిటియని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా 

5.అతడు నాతో ఇట్లనెను–ఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్లు ఆకాశపు చతుర్వాయువులు.౹ 

6.నల్లని గుఱ్ఱములున్న రథము ఉత్తర దేశములోనికి పోవునది; తెల్లని గుఱ్ఱములున్న రథము వాటి వెంబడిపోవును, చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములుగల రథము దక్షిణ దేశములోనికి పోవును.౹ 

7.బలమైన గుఱ్ఱములు బయలువెళ్లి లోకమంతట సంచరింప ప్రయత్నింపగా, –పోయి లోక మందంతట సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతట సంచరించుచుండెను.౹ 

8.అప్పుడతడు నన్ను పిలిచి – ఉత్తరదేశములోనికి పోవు వాటిని చూడుము; అవి ఉత్తరదేశమందు నా ఆత్మను నెమ్మది పరచునని నాతో అనెను.

యెహోషువకు కిరీటము

9.మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా 

10.–చెరపట్టబడినవారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి టోబీయా యెదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషీయా యింట దిగియున్నారు; వారు చేరిన దినముననే నీవు ఆ యింటికిపోయి 

11.వారి నడిగి వెండి బంగారములను తీసికొని కిరీటముచేసి ప్రధానయాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువతలమీద ఉంచి 

12.అతనితో ఇట్లనుము–సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–చిగురు అను ఒకడు కలడు; అతడు తన స్థలములోనుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును.౹ 

13.అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనా సీనుడై యేలును,సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును.౹ 

14.ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి, హేలెమునకును టోబీయాకును యెదాయాకును జెఫన్యా కుమారుడైన హేనునకును ఉండును.౹ 

15.దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపెనని మీరు తెలిసికొందురు; మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించినయెడల ఈలాగు జరుగును.

Related Quiz Articles