క్రొత్త నిబంధన దినములలో పరిశుద్ధాత్మ  మేల్కొలుపు (BSI)

2 భాగము

అపొస్తలుల కార్యములు 6 – స్తెఫను యొక్క పరిచయము  

8. స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజలమధ్య మహత్కార్యములను గొప్ప సూచకక్రియలను చేయుచుండెను.౹

9. అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని౹

10. మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి.

{ లూకా 21:12 ఇవన్నియు జరుగకమునుపు వారు మిమ్మును బలాత్కారముగా పెట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకును అధిపతుల యొద్దకును తీసికొనిపోయి, సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు.

13. ఇది సాక్ష్యా ర్థమై మీకు సంభవించును.

14. కాబట్టి మేమేమి సమాధా నము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి.

15. మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.

16. తలిదండ్రులచేతను సహోదరులచేతను బంధువులచేతను స్నేహితులచేతను మీరు అప్పగింపబడుదురు; వారు మీలో కొందరిని చంపింతురు;

17. నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు.

18. గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు.

19. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు.

లూకా 12:11 వారు సమాజమందిరముల పెద్దలయొద్దకును అధిపతులయొద్దకును అధికారులయొద్దకును మిమ్మును తీసికొని పోవునప్పుడు మీరు–ఏలాగు ఏమి ఉత్తరమిచ్చెదమా, యేమి మాటలాడుదుమా అని చింతింపకుడి, 

12. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను.}

అపొస్తలుల కార్యములు 6 :11. అప్పుడు వారు–వీడు మోషేమీదను దేవునిమీదను దూషణవాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని

12. ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి 

13. అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు–ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు. 

14. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. 

15. సభలో కూర్చున్నవారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.

అపొస్తలుల కార్యములు 7 స్తెఫను యొక్క చిరునామా :అబ్రాహాము యొక్క పిలుపు 

1. ప్రధానయాజకుడు–ఈ మాటలు నిజమేనా అని అడిగెను

2. అందుకు స్తెఫను చెప్పినదేమనగా–సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండకమునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై౹ 

3. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను.

4. కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత, అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న యీ దేశమందు నివసించుటకై దేవుడతని తీసికొనివచ్చెను.

5. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానము చేసెను.౹ 

6. అయితే దేవుడు–అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు, ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధపెట్టుదురనియు చెప్పెను.౹ 

7. మరియు దేవుడు–ఏ జనమునకు వారు దాసులైయుందురో ఆ జనమును నేను విమర్శచేయుదుననియు, ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు చెప్పెను. 

8. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతని కనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతిచేసెను; ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి.

ఐగుప్తులోని  గోత్రకర్తలు

9. ఆ గోత్రకర్తలు మత్సరపడి, యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరిగాని, దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి 

10. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరోయెదుట అతనికి అ నుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన యింటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. 

11. తరువాత ఐగుప్తు దేశమంతటికిని కనాను దేశమంతటికిని కరవును బహుశ్రమయువచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను.

12. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని, మన పితరులను అక్క డికి మొదటి సారి పంపెను. 

13. వారు రెండవసారి వచ్చి నప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసి కొనెను; అప్పుడు యోసేపుయొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. 

14. యోసేపు తన తండ్రియైన యాకోబును తన స్వజనులందరిని పిలువనంపెను; వారు డెబ్బదియయిదు గురు

15. యాకోబు ఐగుప్తునకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి,

16. షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రా హాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి.

మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులను విడుదల చేయుట.

17. అయితే దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించినకొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొకరాజు ఐగుప్తును ఏలనారంభించెను.౹

18. ఇతడు మన వంశస్థుల యెడల కపటముగా ప్రవర్తించి౹

19. తమ శిశువులు బ్రదుకకుండ వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధపెట్టెను. 

20. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి యింట మూడు నెలలు పెంచ బడెను

21. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసికొని తన కుమారునిగా పెంచు కొనెను.

22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్య సించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.౹ 

23. అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను.౹

24. అప్పుడు వారిలో ఒకడు అన్యాయము ననుభవించుట అతడు చూచి, వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతికారముచేసెను.౹

25. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలం చెను గాని వారు గ్రహింపరైరి.

26. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి–అయ్యలారా, మీరు సహోదరులు; మీరెందుకు ఒకనికొకడు అన్యా యము చేసికొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచ జూచెను.౹ 

27.అయినను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడు–మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు?౹

28. నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంపదలచియున్నావా అని అతనిని త్రోసివేసెను

29. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశియైయుండి, అక్కడ ఇద్దరు కుమారులను కనెను.౹ 

30. నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగపడెను.౹ 

31. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా౹

32. నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వణకి, నిదానించి చూచుటకు తెగింపలేదు.౹ 

33. అందుకు ప్రభువు–నీ చెప్పులు విడువుము; నీవు నిలిచియున్నచోటు పరిశుద్ధభూమి

34. ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని; వారి మూలుగు వింటిని; వారిని విడిపించుటకు దిగివచ్చియున్నాను; రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదు నని అతనితో చెప్పెను.౹

35. అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడెవడని వారు నిరాకరించిన యీ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను.

36. ఇతడు ఐగుప్తులోను ఎఱ్ఱసముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను.

ఇశ్రాయేలీయులు దేవునిపై తిరుగుబాటు చేయుట .

37. నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే యితడే

38. సీనాయి పర్వతముమీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసికొనినవాడితడే.౹ 

39. ఇతనికి మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై౹ 

40. మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము; ఐగుప్తు దేశములోనుండి మనలను తోడుకొని వచ్చిన యీ మోషే యేమాయెనో మాకు తెలియదని అహరోనుతో అనిరి.౹

41. ఆ దినములలో వారొక దూడను చేసికొని ఆ విగ్రహమునకు బలి నర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి.౹

42. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచి పెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది.–ఇశ్రాయేలు ఇంటివారలారామీరు అరణ్యములో నలువది యేండ్లుబలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా?

43. మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైన మొలొకు  గుడారమును రొంఫాయను దేవతయొక్క నక్షత్రమును మోసికొని పోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయెదను.

దేవుని నిజమైన గుడారం.

44. అతడు చూచిన మాదిరిచొప్పున దాని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము, సాక్ష్యపుగుడారము అరణ్యములో మన పితరులయొద్ద ఉండెను.

45. మన పితరులు తమ పెద్దలచేత దానిని తీసికొనినవారై, దేవుడు తమ యెదుటనుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు, యెహోషువతోకూడ ఈ దేశములోనికి దానిని తీసికొనివచ్చిరి. అది దావీదు దినములవరకు ఉండెను.౹

46. అతడు దేవుని దయపొంది యాకోబుయొక్క దేవుని నివాసస్థలము కట్టగోరెను.౹ 

47-50 అయితే సొలొమోను ఆయనకొరకు మందిరముకట్టించెను. అయినను–ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు?నా విశ్రాంతి స్థలమేది?ఇవన్నియు నా హస్తకృతములు కావా?అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు.

ఇశ్రాయేలీయులు పరిశుద్ధాత్మను వ్యతిరేకించుట.

51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీపితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.

52. మీపితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి. 

53. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదని చెప్పెను.

హత సాక్షి అయిన స్తెఫను.

54. వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లుకొరికిరి. 

55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి 

56. ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను. 

57. అప్పుడు వారు పెద్ద కేకలువేసి చెవులు మూసికొని యేకముగా అతనిమీదపడి

58. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యౌవనుని పాదములయొద్ద తమ వస్త్రములుపెట్టిరి.

59. ప్రభువునుగూర్చి మొరపెట్టుచు–యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.

60. అతడు మోకాళ్లూని – ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.

అపొస్తలుల కార్యములు 8 సౌలు సంఘమును హింసించుట.

ఇప్పుడు సౌలు అతని మరణానికి అంగీకరించుట.

1. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, అపొస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి. 

2. భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధిచేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. 

3. సౌలయితే ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొనిపోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను.

సమరయ నందు క్రీస్తు ప్రకటింపబడుట.

4. కాబట్టి చెదరిపోయివారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారముచేసిరి. 

5. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమువరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించు చుండెను. 

6. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా

 7. అనేకులను పెట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలువేసి వారిని వదలిపోయెను; పక్షవాయువుగలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి.

 8. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను.

గారడీ వాని విశ్వాస ప్రకటన. .

9. సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీచేయుచు, తానెవడో యొక గొప్పవాడని చెప్పుకొనుచు, సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను.౹

10. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరు– దేవుని మహాశక్తి యనబడినవాడు ఇతడే అని చెప్పు కొనుచు అతని లక్ష్యపెట్టిరి.

11. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరచినందున వారతని లక్ష్య పెట్టిరి.

 12. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమునుగూర్చియు యేసుక్రీస్తు నామమునుగూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి.

 13. అప్పుడు సీమోను కూడ నమ్మి బాప్తిస్మముపొంది ఫిలిప్పును ఎడబాయకుండి, సూచక క్రియలును గొప్ప అద్భుతములును జరుగుట చూచి విభ్రాంతి నొందెను.

గారడీ వాని పాపము.

14. సమరయవారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని, పేతురును యోహానును వారియొద్దకు పంపిరి. 

15. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారికొరకు ప్రార్థనచేసిరి.

16. అంతకు ముందు వారిలో ఎవనిమీదను ఆయన దిగియుండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి.

17. అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతు లుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. 

18. అపొస్తలులు చేతులుంచుటవలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి 

19. వారియెదుట ద్రవ్యము పెట్టి–నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను.

20. అందుకు పేతురు–నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించు కొందునని తలంచుకొనినందున నీ వెండి నీతోకూడ నశించునుగాక.

 21. నీ హృదయము దేవునియెదుట సరియైనది కాదు గనుక యీ కార్యమందు నీకు పాలుపంపులు లేవు.

 22. కాబట్టి యీ నీ చెడుతనము మానుకొని మారుమనస్సునొంది ప్రభువును వేడుకొనుము; ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును; 

23. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను.

 24. అందుకు సీమోను –మీరు చెప్పినవాటిలో ఏదియు నా మీదికి రాకుండ మీరే నాకొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను.

25. అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్లుచు, సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి.

ఐతియొపీయునికి క్రీస్తు ప్రకటింప బడుట.

26. ప్రభువు దూత–నీవు లేచి, దక్షిణముగా వెళ్లి, యెరూషలేమునుండి గాజాకు పోవు అరణ్యమార్గమును కలసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్లెను. 

27. అప్పుడు ఐతియొపీయుల రాణియైన కందాకేక్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటి మీదనున్న ఐతియొపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను. 

28. అతడు తిరిగి వెళ్లుచు, తన రథముమీద కూర్చుండి ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండెను.

29. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో–నీవు ఆ రథము దగ్గరకుపోయి దానిని కలిసికొనుమని చెప్పెను. 

30. ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తికొనిపోయి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండగా విని–నీవు చదువునది గ్రహించుచున్నావా? అని అడుగగా౹

31. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి, రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను

32. అతడు లేఖనమందు చదువుచున్న భాగ మేదనగా– ఆయన గొఱ్ఱెవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను.

33. ఆయన దీనత్వమునుబట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకక పోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమిమీదనుండి తీసివేయబడినది.

34. అప్పుడు నపుంసకుడు – ప్రవక్త యెవనిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్నుగూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగెను.

 35. అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను.

 36. వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చి నప్పుడు నపుంసకుడు–ఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. 

37. ఫిలిప్పు–నీవు పూర్ణహృదయముతో విశ్వసించినయెడల పొందవచ్చునని చెప్పెను. అతడు–యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని యుత్తరమిచ్చెను.

38. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను. 

39. వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరి యెన్నడును చూడలేదు.౹

 40. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడనుండి కైసరయకు వచ్చువరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను.

అపొస్తలుల కార్యములు 9

దమస్కు మార్గములో : పౌలు మార్పునొందుట.

1. సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించు టయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి౹ 

2. యీ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనినయెడల, వారిని బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజములవారికి పత్రికలిమ్మని అడిగెను.

{1 కొరింథీయులకు 15:3 నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను,౹

 4. లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.౹

 5. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను.౹ 

6. అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి.౹

7. తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను.౹

 8. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;౹

 9. ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను. దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.౹ 

10. అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయి యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కు వగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.౹ 

11. నేనైననేమి వారైననేమి, ఆలాగుననే మేము ప్రకటించుచున్నాము, ఆలాగుననే మీరును విశ్వసించితిరి.}

3. అతడు ప్రయాణము చేయుచు దమస్కుదగ్గరకు వచ్చి నప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.౹

 4. అప్పుడతడు నేలమీదపడి –సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.౹

 5. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన–నేను నీవు హింసించు చున్న యేసును;౹

 6. లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను.౹

 7. అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని యెవనిని చూడక మౌనులై నిలువ బడిరి.౹

 8. సౌలు నేలమీదనుండి లేచి కన్నులు తెరచినను ఏమియు చూడలేక పోయెను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి.౹

 9. అతడు మూడుదినములు చూపులేక అన్నపానము లేమియు పుచ్చుకొనకుండెను.

అననీయ సౌలునకు బాప్తిస్మము ఇచ్చుట

10. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు–అననీయా, అని అతనిని పిలువగా

11. అతడు–ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు–నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థనచేయుచున్నాడు. 

12 .అతడు అననీయ అను నొక మనుష్యుడు లోపలికివచ్చి, తాను దృష్టిపొందునట్లు తలమీద చేతులుంచుట చూచియున్నాడని చెప్పెను. 

13. అందుకు అననీయ–ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసియున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని. 

14. ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థనచేయు వారినందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకులవలన అధికారము పొంది యున్నాడని ఉత్తరమిచ్చెను.

15. అందుకు ప్రభువు–నీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు 

16. ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను.౹ 

17. అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి, అతని మీద చేతులుంచి–సౌలా, సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృిష్టిపొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి యున్నాడని చెప్పెను.౹

18. అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను.

19. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతోకూడ కొన్ని దినములుండెను.

సౌలు యేసుని గూర్చి బోధించుట.

20. వెంటనే సమాజమందిరములలో –యేసే దేవుని కుమారుడని ఆయననుగూర్చి ప్రకటించుచు వచ్చెను. 

21. వినినవారందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధానయాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడ వచ్చియున్నాడని చెప్పుకొనిరి.

22. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి–ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను.

సౌలు మరణమునుండి తప్పించుకొనుట.

23. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంప నాలోచింపగా

24. వారి ఆలోచన సౌలునకు తెలియ వచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్లు ద్వారములయొద్ద కాచుకొనుచుండిరి 

25. గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొనిపోయి గంపలో ఉంచి, గోడ గుండ అతనిని క్రిందికి దింపిరి.

యెరూషలేములో సౌలు.

26. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నముచేసెను గాని, అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి.౹

27. అయితే బర్నబా అతనిని దగ్గరతీసి అపొస్తలులయొద్దకు తోడుకొనివచ్చి–అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామమునుబట్టి ధైర్యముగా బోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను. 

28-29. అతడు యెరూషలేములో వారితోకూడ వచ్చుచు పోవుచు, ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకుభాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచునుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని 

30. సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోడుకొనివచ్చి తార్సునకు పంపిరి.

సంఘము యొక్క పురోగతి .

31. కావున యూదయ గలిలయ సమరయ దేశములం దంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశు ద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.

ఐనెయ స్వస్థతపరచ బడుట.

32. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారముచేయుచు, లుద్దలో కాపురమున్న పరిశుద్ధులయొద్దకు వచ్చెను.౹

33. అక్కడ పక్షవాయువు కలిగి యెనిమిది ఏండ్లనుండి మంచము పెట్టియుండిన ఐనెయ అను ఒక మనుష్యుని చూచి,౹ 

34. పేతురు–ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా౹ 

35. వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్నవారందరు అతనిచూచి ప్రభువుతట్టు తిరిగిరి.

దొర్కా తిరిగి సజీవురాలగుట.

36. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్‌క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి యుండెను.౹ 

37. ఆ దినములయందామె కాయిలాపడి చనిపోగా, వారు శవమును కడిగి మేడ గదిలో పరుండ బెట్టిరి.౹ 

38. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుటచేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, అతడు తడవుచేయక తమయొద్దకు రావలెనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిరి.౹

39. పేతురు లేచి వారితోకూడ వెళ్లి అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోనికి అతనిని తీసికొనివచ్చిరి; విధవరాండ్రందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతోకూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు అతని యెదుట నిలిచిరి.౹ 

40. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగి–తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను.౹ 

41. అతడామెకు చెయ్యి యిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను.౹

42. ఇది యొప్పేయందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి.౹ 

43. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారునియొద్ద బహుదినములు నివసించెను.

అపొస్తలుల కార్యములు 10 కొర్నేలి ఒక ప్రతినిధి బృందాన్ని పంపుట. 

1. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి . యైన కొర్నేలీ అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను.౹ 

2. అతడు తన యింటివారందరితోకూడ దేవునియందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థనచేయు వాడు.౹

 3. పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చి–కొర్నేలీ, అనిపిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.౹

 4. అతడు దూతవైపు తేరి చూచి భయపడి–ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూత–నీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.౹

 5. ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము;౹

 6. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని యింట దిగియున్నాడని అతనితో చెప్పెను.౹

 7. అతనితో మాటలాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన యింటి పనివారిలో ఇద్దరిని, తన యొద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకొని యుండువారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి౹ 

8. వారికి ఈ సంగతులన్నియు వివరించి వారిని యొప్పేకు పంపెను.

పేతురు యొక్క దర్శనము .

9. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పండ్రెండు గంట లకు పేతురు ప్రార్థనచేయుటకు మిద్దెమీది కెక్కెను.౹ 

10. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను; ఇంటివారు సిద్ధముచేయుచుండగా అతడు పరవశుడై౹ 

11. ఆకాశము తెరవబడుటయు, నాలుగు చెంగులుపెట్టి దింప బడిన పెద్ద దుప్పటివంటి యొకవిధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను.౹

12. అందులో భూమియందుండు సకల విధములైన చతుష్పాద జంతువులును, ప్రాకుపురుగులును, ఆకాశపక్షులును ఉండెను.౹ 

13. అప్పుడు –పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమత నికి వినబడెను.౹ 

14. అయితే పేతురు–వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా౹ 

15. దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను.౹

16. ఈలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను.

కైసరయకు పిలవబడుట .

17. పేతురు తనకు కలిగిన దర్శనమేమై యుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని, వాకిట నిలిచి యింటివారిని పిలిచి౹ 

18. పేతురు అను మారుపేరుగల సీమోను ఇక్కడ దిగియున్నాడా? అని అడిగిరి౹ 

19. పేతురు ఆ దర్శనమునుగూర్చి యోచించుచుండగా ఆత్మ–ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదకుచున్నారు.౹ 

20. నీవు లేచి క్రిందికిదిగి, సందేహింపక వారితోకూడ వెళ్లుము; నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను.౹

21. పేతురు ఆ మనుష్యులయొద్దకు దిగి వచ్చి–ఇదిగో మీరు వెదకువాడను నేనే; మీరు వచ్చిన కారణ మేమని అడిగెను.౹ 

22. అందుకు వారు–నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూద జనులందరివలన మంచిపేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలి యను ఒక మనుష్యుడున్నాడు; అతడు నిన్ను తన యింటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధదూత వలన బోధింపబడెనని చెప్పిరి; అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను.

23. మరునాడు అతడు లేచి, వారితోకూడ బయలుదేరెను; యొప్పేవారైన కొందరు సహోదరులును వారితోకూడ వెళ్లిరి.౹

పేతురు, కొర్నేలిని కలుసుకొనుట .

24. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారికొరకు కనిపెట్టుకొని యుండెను.౹ 

25. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదములమీదపడి నమస్కారము చేసెను.౹ 

26. అందుకు పేతురు–నీవు లేచి నిలువుము, నేను కూడ నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి౹ 

27. అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి, అనేకులు కూడియుండుట చూచెను.౹ 

28. అప్పుడతడు–అన్యజాతివానితో సహవాసము చేయుటయైనను, అట్టివానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మముకాదని మీకు తెలియును. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగినవాడనియైనను అపవిత్రుడనియైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు.౹ 

29. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చితిని గనుక, ఎందునిమిత్తము నన్ను పిలువనంపితిరో దానినిగూర్చి అడుగు చున్నానని వారితో చెప్పెను.౹ 

30. అందుకు కొర్నేలి– నాలుగు దినముల క్రిందట పగలు మూడుగంటలు మొదలుకొని యీ వేళవరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా యెదుట నిలిచి౹ 

31. కొర్నేలీ, నీ ప్రార్థన వినబడెను; నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి యున్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి౹ 

32. పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము; అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను.౹ 

33. వెంటనే నిన్ను పిలిపించితిని; నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞా పించినవన్నియు వినుటకై యిప్పుడు మేమందరము దేవుని యెదుట ఇక్కడ కూడియున్నామని చెప్పెను. అందుకు పేతురు నోరుతెరచి ఇట్లనెను.

కొర్నేలి ఇంటివారికి బోధించుట .

34. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను.౹ 35ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.౹

36. యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు.౹

37. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయమొదలుకొని యూదయ యందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియును౹ 

38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలుచేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.౹ 

39. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసినవాటికన్నిటికిని మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడ దీసి చంపిరి.౹ 

40. దేవుడాయనను మూడవదినమున లేపి౹ 

41. ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరు వాత ఆయనతోకూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను.౹

42. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను.౹ 

43. ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నారనెను.

అన్యుల మీదికి పరిశుదాత్మ దిగి వచ్చుట.

44. పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను.౹ 

45-46. సున్నతి పొందినవారిలో పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినొందిరి. ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి.౹

47. అందుకు పేతురు–మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి౹ 

48. యేసు క్రీస్తు నామమందువారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి.

ఎఫెసీయులకు 2 విశ్వాసము ద్వారా దయ చేత .

1. మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతోకూడ బ్రదికించెను.౹ 

2. మీరు వాటినిచేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పునమునుపు నడుచుకొంటిరి.౹

3. వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించిమునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.౹ 

4-5. అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృప చేత మీరు రక్షింపబడియున్నారు.౹ 

6. క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము,౹ 

7. క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను.౹ 

8. మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.౹ 

9. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.౹ 

10. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

రక్తమువలన సమీపస్థులగుట.

11. కాబట్టిమునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన మీరు౹ 

12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.౹ 

13. అయిననుమునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.

క్రీస్తే మన శాంతి.

14. ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.౹ 

15. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,౹

16. తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.౹

17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.౹

18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.౹

క్రీస్తే మన మూల రాయి .

19. కాబట్టి మీరిక మీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు.౹ 

20. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.౹ 

21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.౹ 

22. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.

అపొస్తలుల కార్యములు 11 పీటర్ దేవుని యొక్క దయను సమర్ధించుట. 

1. అన్యజనులును దేవుని వాక్యమంగీకరించిరని అపొస్తలులును యూదయ యందంతటనున్న సహోదరులును వినిరి.౹ 

2. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు౹

3. నీవు సున్నతి పొందనివారియొద్దకు పోయి వారితోకూడ భోజనముచేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి.

4. అందుకు పేతురు మొదటనుండి వరుసగా వారికి ఆ సంగతి ఈలాగు వివరించి చెప్పెను౹ 

5. నేను యొప్పే పట్టణములో ప్రార్థనచేయుచుండగా పరవశుడనైతిని, అప్పుడొక దర్శనము నాకు కలిగెను; అది ఏదనగా నాలుగు చెంగులుపెట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొక విధమైన పాత్ర ఆకాశమునుండి దిగి నాయొద్దకు వచ్చెను.

6. దానివైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమియందుండు చతుష్పాద జంతువులును అడవి మృగములును ప్రాకెడు పురుగులును ఆకాశపక్షులును నాకు కనబడెను

7. అప్పుడు –పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని యొక శబ్దము నాతో చెప్పుట వింటిని

8. అందుకు నేను–వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడును పడలేదని చెప్పగా౹

9. రెండవమారు ఆ శబ్దము ఆకాశము నుండి–దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను.౹

10. ఈలాగు ముమ్మారు జరిగెను; తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసికొని పోబడెను.౹ 

11. వెంటనే కైసరయనుండి నాయొద్దకు పంప బడిన ముగ్గురు మనుష్యులు మేమున్న యింటియొద్ద నిలిచి యుండిరి.౹ 

12. అప్పుడు ఆత్మ–నీవు భేదమేమియు చేయక వారితోకూడ వెళ్లుమని నాకు సెలవిచ్చెను. ఈ ఆరుగురు సహోదరులు నాతోకూడ వచ్చిరి; మేము కొర్నేలి యింట ప్రవేశించితిమి.౹

13. అప్పుడతడు–నీవు యొప్పేకు మనుష్యు లను పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము;౹

14. నీవును నీ యింటివారందరును ఏ మాటలవలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని, తన యింట నిలిచి తనతో చెప్పిన యొక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను.౹ 

15. నేను మాటలాడ నారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికిని దిగెను.౹ 

16. అప్పుడు–యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తి స్మము పొందుదురని ప్రభువు చెప్పినమాట నేను జ్ఞాపకము చేసికొంటిని.౹ 

17. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడ సమానవరము అనుగ్రహించి యుండగా, దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడనని చెప్పెను.౹

18. వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక–అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసియున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.

అంతియొకయ వద్ద పౌలు మరియు బర్నబా.

19. స్తెఫను విషయములో కలిగినశ్రమనుబట్టి చెదరి పోయినవారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక, ఫేనీకే, కుప్ర, అంతియొకయ ప్రదేశములవరకు సంచరించిరి.

20. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపువారితో మాటలాడుచు ప్రభువైన యేసునుగూర్చిన సువార్త ప్రకటించిరి;౹ 

21. ప్రభువు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువుతట్టు తిరిగిరి.౹ 

22. వారినిగూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపువారు విని బర్నబాను అంతియొకయవరకు పంపిరి.౹

 23. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను.౹ 

24. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు; బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి.౹

25. అంతట అతడు సౌలును వెదకు టకు తార్సునకు వెళ్లి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను.౹ 

26. వారు కలిసి యొక సంవత్సర మంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి.

యూదయకు ఉపశమనము.

27. ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియొకయకు వచ్చిరి.౹ 

28. వారిలో అగబు అను ఒకడు నిలువబడి, భూలోకమంతట గొప్ప కరవు రాబోవుచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను.౹

 29. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తికొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను.౹

 30. ఆలాగున చేసి బర్నబా సౌలు అను వారిచేత పెద్దలయొద్దకు దానిని పంపిరి.

అపొస్తలుల కార్యములు 12 హేరోదు సంఘమును హింసించుట .

1. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు . సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని౹

2. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను.౹

3. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురును కూడ పట్టుకొనెను. ఆ దినములు పులియనిరొట్టెల పండుగ దినములు.౹

 4. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండు గైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను

పేతురు చెరసాల నుండి విడుదల పొందుట.

5. పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను.౹ 

6. హేరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెననియుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు సైనికులమధ్య నిద్రించు చుండెను; మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి.౹ 

7. ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి–త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతనిచేతులనుండి ఊడిపడెను.౹

 8. అప్పుడు దూత అతనితో–నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడాలాగు చేసిన తరువాత దూత –నీ వస్త్రము పైన వేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను.౹ 

9. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను.౹ 

10. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవినియొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి యొక వీధి దాటినవెంటనే దూత అతనిని విడిచిపోయెను.

11. పేతురుకు తెలివివచ్చి–ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటినుండియు నన్ను తప్పించియున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను.౹

12. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనేకులుకూడి ప్రార్థనచేయుచుండిరి.౹ 

13. అతడు తలవాకిటి తలుపుతట్టుచుండగా, రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను.

14. ఆమె పేతురు స్వరము గుర్తుపెట్టి, సంతోషముచేత తలుపుతీయక లోపలికి పరుగెత్తి కొనిపోయి–పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను.

15. అందుకు వారు–నీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు–అతని దూత అనిరి.౹ 

16. పేతురు ఇంకనుతట్టుచున్నందునవారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి.౹ 

17. అతడు–ఊరకుండుడని వారికి చేసైగచేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి – యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొకచోటికి వెళ్లెను.౹

18 .తెల్లవారగనే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంతకాదు.౹ 

19.హేరోదు అతనికోసరము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలివారిని విమర్శించి వారిని చంప నాజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్లి అక్కడ నివసించెను.

హేరోదు యొక్క ఘోర మరణము.

20 .తూరీయులమీదను సీదోనీయులమీదను అతనికి అత్యా గ్రహము కలిగినందున వారేకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధాన పడవలెనని వేడుకొనిరి; ఎందుకనగా రాజుయొక్క దేశమునుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను.౹ 

21.నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసముచేయగా౹

 22 .జనులు–ఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరి.

 23. దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.

24 .దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను.

Related Quiz Articles